Suryaa.co.in

Andhra Pradesh

అయ్యన్నపాత్రుడు, చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి

దిశ ప్రతుల తగలబెట్టిన లోకేష్‌ కూడా క్షమాపణలు కోరాలి
లేకపోతే వారంతా ఎప్పటికీ చరిత్రహీనులుగా మిగిలిపోతారు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ టీడీపీకి పరాభవం తప్పదు
దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే ఈ కుయుక్తులు
ఉద్దేశపూర్వకంగా సీఎంగారిపై ఇష్టానుసారం విమర్శలు, వ్యాఖ్యలు
అయినా మేము ఘాటుగా స్పందించబోం. వారిలా మాట్లాడం
మాకు సంస్కారం ఉంది. అందుకే సంయమనంతో ఉంటాం
ప్రభుత్వ చీఫ్‌ విప్‌  గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టీకరణ
మీడియాలో గుర్తింపు కోసమే అయ్యన్న విమర్శలు
ఆయన మాటలు, వాడిన భాష అత్యంత దారుణం
సీఎంగారిపై అనుచిత విమర్శలు. మంత్రులపై వ్యాఖ్యలు
అయ్యన్న మాటలపై నిరసనకు వెళ్లిన ఎమ్మెల్యేపై దాడి చేశారు
ఆ ఎమ్మెల్యేనే చంద్రబాబు ఇంటిపై దాడి చేశారని దుష్ప్రచారం
చంద్రబాబు దిగజారిన రాజకీయాలకు ఇది నిదర్శనం
ప్రెస్‌మీట్‌లో ప్రభుత్వ చీఫ్‌ విప్‌  జి.శ్రీకాంత్‌రెడ్డి వెల్లడి
ఆయన కోపం ఎవరిపై?:
నిన్న (గురువారం) అయ్యన్నపాత్రుడు వ్యవహరించిన తీరు దురదృష్టకరం. ఆయన మాట్లాడిన మాటలు, వాడిన భాష కేవలం పబ్లిసిటీ కోసం. తను మీడియాలో గుర్తింపు పొందాలన్న ఉద్దేశంతో గౌరవం అనేది లేకుండా ముఖ్యమంత్రి పదవికి కానీ, మంత్రులకు ఇవాల్సిన గౌరవం ఇవ్వకపోగా ఏకవచనంతో చాలా దుర్మార్గంగా మాట్లాడిన విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఆయన కోపం ఎవరిపైన, ఎందుకు అంత ప్రస్టేషన్, దీని ద్వారా ఆయన ఏం మెసేజ్‌ ఇవ్వాలనుకున్నాడో తెలియదు కానీ, అందరినీ ఏకవచనంతో సంబోధిస్తూ, ఆయన ఏం మాట్లాడాడన్నది చెప్పే పరిస్థితి కూడా లేకుండా అనాగరికంగా ఆయన వాడిన భాష దారుణంగా ఉంది.
రాజకీయ నాయకులు ప్రశ్నించవచు. తప్పుంటే అడగొచ్చు. అంతే కానీ తమ మాటలతో సోషల్‌ మీడియా ద్వారా గుర్తింపు పొందాలన్న ఉద్దేశంతో ఆ విధంగా మాట్లాడడం తగదు.
నిరసనకు వెళితే దాడి… దుష్ప్రచారం:
సీఎంగారి గురించి ఆ విధంగా మాట్లాడడం సరి కాదు. అయ్యన్నపాత్రుడు అలా మాట్లాడడానికి కారణం చంద్రబాబు. దాన్ని సహించలేక ధర్నాకు సిద్ధమైన ఒక బీసీ ఎమ్మెల్యేపై ఇవాళ దౌర్జన్యం చేశారు.
ఎవరు ఎవరి మీద దాడి చేశారన్నది ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఎమ్మెల్యే జోగి రమేష్‌ వస్తుంటే, వాహనాన్ని ఆపి ఆయన దిగగానే వాహనం అద్దాలు పగలగొట్టడంతో పాటు, ఆయనపై దాడి చేసింది ఎవరు. వాళ్లే దాడి చేసి పబ్లిసిటీ కోసం ఈ రకంగా వ్యవహరించారు. పైగా ఎమ్మెల్యే చంద్రబాబు ఇంటిపై దాడి చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.
దృష్టి మళ్లించే ప్రయత్నం:
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కౌంటింగ్‌కు వచ్చాయి. అసలు ఆ ఎన్నికలు జరగకూడదని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత కౌంటింగ్‌ జరగకూడదని ఆపడానికి ప్రయత్నం చేశారు. కౌంటింగ్‌ చేస్తే పరువు పోతుందని, అది జరగకుండా చాలా ప్రయత్నించారు. ఇప్పుడు కౌంటింగ్‌కు కోర్టు అనుమతి ఇవ్వడంతో, ఎలాగూ పరాభవం తప్పదని, ప్రజల దృష్టి మళ్లించాలని కుయుక్తులు.
సీఎంగారిని తిడితే, ఆయనపై ఇష్టానుసారం మాట్లాడితే.. ఆయనను అభిమానించే వాళ్లు ఉంటారు, వారు ప్రశ్నిస్తారు, రోడ్డు పైకి వస్తారు.. అప్పుడు అందరి దృష్టిని మళ్లించవచ్చు అన్న కుట్ర. ఎల్లుండి కౌంటింగ్‌లో తమకు ఫలితాలు ఎలాగూ వ్యతిరేకంగా వస్తాయి. కాబట్టి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే చంద్రబాబు ఈ పన్నాగం పన్నారు.
మనకు తెలుసు. ప్రభుత్వానికి ఎప్పుడు మైలేజీ వచ్చినా, ప్రజల దృష్టి మళ్లించడం కోసమే కొన్ని ఛానళ్లు పని చేస్తున్నాయ.
విచక్షణ మరిచి..:
అయ్యన్నపాత్రుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. పార్టీ నేతలను తిట్టారు. చివరికి పోలీసు ఉన్నతాధికారిపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘ఎస్పీ నా కొడుకు’ అని మాట్లాడడం చాలా దారుణం. ఒక దళిత మహిళను, అందరిలో ఆత్మస్థైర్యం నింపే లక్ష్యంతో హోం మంత్రిని చేస్తే ఆమెపైనా అయ్యన్నపాత్రుడు విచక్షణా రహితంగా వ్యాఖ్యలు చేశారు. దారుణంగా తిట్టారు. ఎస్‌ఐలను, సీఐలను తన బూటు కాలు కింద పెట్టుకోవాలనే విధంగా, పోలీసు వ్యవస్థను కించపర్చే విధంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలు చూస్తే.. పోలీసు వ్యవస్థ తన బూటు కాలు కింద ఉండాలన్న విధంగా మాట్లాడాడు.
ఆ వ్యవస్థను గౌరవించాలి:
అయ్యన్నపాత్రుడుగారూ మీరు ప్రచారం కోసం ఏమైనా మాట్లాడండి. ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి మాట్లాడండి.
ప్రతిపక్షంగా విఫలమయ్యారని ప్రజలు భావిస్తున్నారన్న ఉద్దేశంతో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. మనల్ని కాపాడుతున్న పోలీసు వ్యవస్థను మనం గౌరవించాలి. కాబట్టి వెంటనే మీరు పోలీసు అధికారులకు క్షమాపణ చెప్పాలి.
సీఎంగారికి మంచి మనసు ఉంది. ఏముందిలే అన్నా.. వాళ్లు మాట్లాడితే మాట్లాడనీ, మన పని మనం చేసుకుంటూ పోదాం అని ఆయన అంటూ ఉంటారు. ఆయన అలాంటి మంచి వ్యక్తి. ఆయన అలా ఉన్నాడు కాబట్టే మీ ఇష్టానుసారం పెట్రేగిపోయి మాట్లాడుతున్నారు. కాబట్టి మీ కర్మ మీరు అనుభవిస్తారు.
ఓర్వలేకనే విమర్శలు:
కరోనా సమయంలో ప్రపంచమంతా కుదేలై పోయి, ప్రజలకు సాయం చేసే పరిస్థితి లేకపోయినా, మన రాష్ట్రంలో మాత్రం ఏదీ ఆగలేదు. వారికి చెప్పింది చెప్పినట్లు చేశారు. కావాలంటే మిగతా రాష్ట్రాలలో ఏం చేయగలిగారన్నది గణాంకాలు తెప్పించి చూసుకోండి.
గతంలో ఎక్కడా లేని విధంగా, రాష్ట్రంలో పలు పథకాలలో సీఎంగారు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నిరుపేదల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశారు. అది చూసి ఓర్వలేని మీరు ఇష్టానుసారం విమర్శిస్తున్నారు. రెచ్చిపోతున్నారు.
మహిళల ఆత్మగౌరవాన్ని కాల్చారు:
మతి లేకుండా, కనీస అవగాహన కూడా లేని లోకేష్, దిశ చట్టం ప్రతులను తగలబెట్టారు. దిశ చట్టం ఉందా. ఉంటే ఎక్కడ ఉందని ఆయన మాట్లాడుతున్నాడు. మీరు ఎంత చులకనగా మాట్లాడినా ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం దిశ చట్టం చేయడంతో పాటు, దిశ యాప్‌ను కూడా రూపొందించి తద్వారా ఎందరో మహిళలను కాపాడుతున్నారు. మహిళలు మామూలు పోలీస్‌స్టేషన్లకు వెళ్లి తమ సమస్యలు చెప్పుకోలేరు కాబట్టి, వారి కోసం ప్రత్యేకంగా దిశ పోలీసు స్టేషన్లు పెడితే, వాటిపైనా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.
దిశ చట్టంలో ఐపీసీ కోడ్‌ ఉండడంతో, దానికి కేంద్రం అనుమతి, పార్లమెంటు ఆమోదం రావాల్సి ఉంది. దాని కోసం మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అదే సమయంలో దిశ చట్టం స్ఫూర్తిగా పోలీసులు చాలా వేగంగా కేసుల దర్యాప్తు చేస్తుంటే, ఆ చట్టం ప్రతులను తగలబెట్టి రాక్షసానందం పొందుతున్నారు. మీరు కాల్చింది కేవలం దిశ చట్టాన్ని మాత్రమే కాదు. మహిళల ఆత్మ గౌరవాన్ని కూడా కాల్చారు. మహిళల్లో ఉన్న ధైర్యం పోగొట్టాలన్న ప్రయత్నం మీది.
మీకు సిగ్గుందా?:
నేను కూడా కావాలంటే ఏ భాష అయినా మాట్లాడొచ్చు. కానీ మాకు సంస్కారం ఉంది. బట్టే అలా మాట్లాడలేకపోతున్నాం. అయితే మీరు మాట్లాడిన మాటలు చాలా దారుణం. మీతీరు అతి దారుణం.
లిక్కర్‌ షాపుల గురించి మాట్లాడుతూ, జగన్‌మోహన్‌రెడ్డిగారు సారా అమ్ముతున్నారని విమర్శించారు. అసలు మీకు సిగ్గుందా. రాష్ట్రంలో 43 వేల బెల్టుషాప్‌లు మూయించింది ఎవరు. ఒకవైపు బెల్టుషాపులు లేకుండా చేయడం, మరోవైపు మద్యం ధరలను బాగా పెంచితే వినియోగం తగ్గుతుందని, ఆ విధంగా తాగాలనుకున్న వారు కూడా క్రమంగా మానేస్తారన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పని చేస్తుంటే చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు.
స్వర్గీయ ఎన్టీ రామారావుగారు నాడు మద్య నిషేధం అమలు చేస్తే, ఆయనను వైశ్రాయి హోటల్‌ వద్ద చెప్పులతో కొట్టించి, ఆ తర్వాత పదవి కూడా లాక్కుని లిక్కర్‌ మాఫియాతో కుమ్మక్కైన మీరు మద్య నిషేధానికి తూట్లు పొడిచారు. అలాంటి మీరు ఇవాళ లిక్కర్‌ గురించి మాట్లాడుతున్నావు.
మటన్‌ మాల్స్‌ అంట. చేపలు కూడా అమ్ముతున్నారని మాట్లాడావు. అసలు నీకు ఏ మాత్రమైనా అవగాహన ఉందా. మీట్‌ ఫెడరేషన్, ఫిషరీస్‌ కార్పొరేషన్లు కొత్తగా ఏర్పాటు చేసినవా. గతంలో కూడా ఉన్నాయి కదా. మీ ప్రభుత్వ హయాంలో కూడా అవి ఉన్నాయి కదా. వాటి ద్వారా ప్రభుత్వమే కదా విక్రయాలు కొనసాగించింది. మరి కొత్తగా జగన్‌మోహన్‌రెడ్డి గారు చేస్తున్నారని ఏ మాత్రం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు.
అలాంటి చరిత్ర మీది:
మీకు ఏ మాత్రం సబ్జెక్ట్‌ ఉండదు. విలువలు అంత కంటే ఉండవు. ఏమీ ఉండవు. అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. పోలీస్‌ స్టేషన్లలో సారా అమ్మింది ఎవరు. మీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాదా. సారా అంటే పేరు బాగాలేదు అని చెప్పి దానికి వారుణవాహిని అని పేరు పెట్టి పల్లెల్లో సైతం అమ్మించారు. అలాగే పోలీస్‌ స్టేషన్లలో సారా అమ్మిన చరిత్ర మీ తెలుగుదేశం పార్టీది.
ప్రజలు ఛీకొట్టినా..:
రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసింది మీరు. అసలు రాష్ట్ర విభజనకు కారకుడు చంద్రబాబునాయుడు. ఆ తర్వాత కూడా పదేళ్ల పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా అవకాశం ఉన్నా, ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కోసం కోట్లు ఇస్తూ అడ్డంగా దొరికిపోయి రాత్రికి రాత్రి ఇక్కడికి పారిపోయి వచ్చావు. నాకు పోలీస్‌ ఉంది. నాకే ఏసీబీ ఉంది అంటూ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడి, ఇక్కడికి వచ్చి కృష్ణా కరకట్ట వద్ద నివాసం ఏర్పాటు చేసుకున్నావు. ఆరోజే ప్రజలు నిన్ను ఛీకొట్టారు. ఇవన్నీ అందరూ మర్చిపోయారనుకుంటున్నారా.
అసలు మీకు అర్హత ఉందా?:
ఇక్కడికి వచ్చి, కరకట్ట వద్ద నివాసం ఏర్పాటు చేసుకుని, రాష్ట్రానికి ఏమీ చేయకుండా, రాజధాని పేరుతో ప్రజలను భ్రమల్లో ఉంచావు. ఇంకా పుట్టమన్ను అని అది ఇదీ తెప్పించి పల్లెల్లో తిప్పి ప్రచారం చేసుకున్నావు. హెలికాప్టర్‌ నుంచి నీళ్లు చల్లి.. ఏదేదో ఆర్భాటం చేసి, అసలు రాజధానిలో ఏమీ చేయకుండా విపరీతంగా ప్రచారం చేసుకుని, రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసింది నీవు కాదా. అయినా సిగ్గు లేకుండా ఇవాళ మాట్లాడుతున్నావు. అసలు మీకు మాట్లాడడానికి ఏ అర్హత ఉంది.
కరోనా కష్టకాలంలోనూ:
ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడం కోసం, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోవడం కోసం ఏ మాత్రం ఆర్భాట ప్రచారం లేకుండా ఈ ప్రభుత్వం పని చేస్తోంది. మీరు చూస్తున్నారు. అన్ని రంగాలలో ఎగుమతులు పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతున్నాయి.
కరోనా పరిస్థితుల వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో మేము కొన్ని పనులు చేయలేకపోయాం. మా ఉద్దేశాలు, లక్ష్యాలలో చిత్తశుద్ధి ఉంది. అందుకే ఈ కరోనా కనుక లేకపోయి ఉంటే, ఈ రాష్ట్రాన్ని ఎన్నో రంగాలలో ఇంకా ఎంతో ముందుకు తీసుకుపోయి ఉండేవాళ్లం.
కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాలన్న తపనతో జగన్‌మోహన్‌రెడ్డి గారు పని చేస్తున్నారు. ఇవన్నీ చూస్తున్న మీరు ప్రజలు మిమ్మల్ని పాతర వేస్తున్నారని గుర్తించి, ప్రభుత్వంపై, సీఎంగారిపై విరుచుకుపడుతున్నారు. సీఎంగారిని కించ పరుస్తూ మాట్లాడుతున్నారు.
క్షమాపణ కోరాలి:
నోరు తెరిస్తే పులివెందుల రాజకీయం అంటారు. అసలు ఎవరండి అనైతిక రాజకీయాలు చేస్తోంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయినా, ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్నీ చేస్తున్నా దిగజారిపోయిన మీరు ప్రభుత్వంపై, సీఎంగారిపై అనైతికంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మీకున్న మీడియా బలంతో ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టాలని చూస్తున్నారు.
నిజానికి నాడు సీఎంగా చంద్రబాబు కృష్ణా కరకట్టమీద అక్రమ నివాసంలో ఉంటూ, అక్కడి నుంచే ఎన్నో ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు తమ పార్టీ వారిని ఏం చేయొద్దని నిర్దేశించారు. ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకోవాలి. మనిషి అన్న వాడు బాధ్యతగా వ్యవహరించాలి.
అయితే మీరు ఎంతలా దిగజారినా మేము సంయమనం పాటిస్తాం. మీ మాదిరిగా మాట్లాడం. ఇప్పటికైనా చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు తాము చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలి. అలాగే దిశ చట్టం ప్రతులు తగలబెట్టి మహిళల ఆత్మగౌరవాన్ని కించపర్చిన లోకేష్‌ కూడా క్షమాపణ కోరాలి. లేకపోతే చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు.. అని చీఫ్‌ విప్‌ స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE