Suryaa.co.in

Andhra Pradesh

ఇది మంచి మద్యం కాదంటున్న బాబు..ఈ మూడు నెలలు అవే బ్రాండ్లు ఎందుకు అమ్మారు?

– కొత్త మద్యం పాలసీ ప్రజలకు అనర్థం
– ముడుపుల కోసమే ఈ మద్యం పాలసీ
– ప్రైవేటు రంగంలో మద్యం విక్రయాలు సరికాదు
– మళ్లీ సిండికేట్‌లు. దోపిడీలు మొదలవుతాయి
– మద్యం అమ్మకాలపై నియంత్రణ ఉండదు
– లిక్కర్‌మాల్స్‌ ఆలోచన కూడా సరి కాదు
– మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి స్పష్టీకరణ

తాడేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ‘గాంధీ జయంతి రోజున తెచ్చిన బ్రాందీ పాలసీ’ ప్రజలకు అనర్థమని, కేవలం ముడుపుల కోసమే కొత్త మద్యం పాలసీ ప్రకటించారని వైయస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆక్షేపించారు. ప్రైవేటు రంగంలో మద్యం విక్రయాలు ఏ మాత్రం సరికాదన్న ఆమె, దాని వల్ల సిండికేట్‌లు ఏర్పడి, దోపిడీ మొదలవుతుందని చెప్పారు.

మద్యం విక్రయాలు పెంచాలని ఈ ప్రభుత్వం ఎందుకు అనుకుంటున్నదో అర్ధం కావడం లేదన్న వరుదు కళ్యాణి, గత వి«ధానాన్ని రద్దు చేయడం వెనక లక్ష్యం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు గుప్పించిన కూటమి పెద్దలు, ఏవీ నిలుపుకోలేదని.. కానీ ఈ మద్యం పాలసీ వల్ల ఆడవారి పసుపు కుంకుమలకు గ్యారెంటీ లేకుండా పోవడమే కాకుండా, ఇంటింటికీ ప«థకాలు కాకుండా, ఇంటింటికీ మద్యం సరఫరా అవుతుందని స్పష్టం చేశారు.

దారుణంగా మండుతున్న నిత్యావసర సరుకుల ధరలు పట్టించుకోకుండా, రూ.99 కే క్వార్టర్‌ బాటిల్‌ మద్యం ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. అదేనా ప్రభుత్వ విధానం అని వరుదు కళ్యాణి నిలదీశారు. ఓవైపు అన్ని ఛార్జీలు పెంచుతూ, మరోవైపు మద్యాన్ని తక్కువ ధరకే ఇస్తామని చెప్పడం ఏమిటని దుయ్యబట్టారు.

షాపింగ్‌ మాల్స్‌ మాదిరిగా, లిక్కర్‌ మాల్స్‌ తీసుకొస్తామనడం దారుణం అన్న వరుదు కళ్యాణి, అదుపు లేని మద్యం విక్రయాల వల్ల, మహిళలకు భద్రత లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడున్నది మంచి మద్యం కాదంటున్న చంద్రబాబు, మరి ఈ మూడు నెలలు ఎందుకు అమ్మారు? దీనికి సమాధానం చెప్పగలరా? అని సూటిగా ప్రశ్నించారు.

LEAVE A RESPONSE