Suryaa.co.in

Editorial

ఏసీబీ కోర్టుకు బాబు?

– అంతకుముందు గుంటూరు సీఐడీ ఆఫీసుకు బాబు?
– ఎన్‌ఎస్‌జీ అధికారులు అందుకు అంగీకరిస్తారా?
-దానిపై న్యాయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు
– బాబు అరెస్ట్, రిమాండ్, వాదనలపై ఆసక్తి
– బెయిల్, రిమాండ్ రిజెక్టు పిటిషన్లు సిద్ధం చేసిన టీడీపీ లీగల్ సెల్
– బాబు కేసుపై సర్వత్రా ఉత్కంఠ
( మార్తి సుబ్రహ్మణ్యం)

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడును.. స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమాల కేసులో అరెస్టు చేసిన తదనంతర పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నంద్యాలలో తెల్లవారుఝామున అరెస్టు చేసిన పోలీసులు, ఆయనను వివిధ మార్గాల నుంచి రోడ్డు ద్వారా విజయవాడకు తీసుకువెళుతున్నారు. చట్టం ప్రకారం అరెస్టు చేసిన 24 గంటల్లోగా న్యాయమూర్తి ముందు హాజరుపరచాల్సి ఉంది.

ఆ ప్రకారంగా ఆయనను ముందుగా.. గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి బాబును తీసుకువెళతారన్న ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత అక్కడి నుంచి విజయవాడలోని, ఏసీబీ కోర్డు జడ్జి ముందు హాజరుపరుస్తారని తెలుస్తోంది. శనివారం కోర్టు సెలవు కావటంతో, బాబును ఏసీబీ కోర్టు ముందు హాజరుపరుస్తారని చెబుతున్నారు.

అయితే ఎన్‌ఎస్‌జీ భద్రత ఉన్న చంద్రబాబును, సీఐడీ కార్యాలయంలో ఉంచే అంశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్‌పీజీ నిబంధనల ప్రకారం.. చంద్రబాబును సీఐడీ కార్యాలయంలో ఉంచే అవకాశాలు లేవని, కొందరు న్యాయవాదులు వాదిస్తున్నారు. అయితే ఎన్‌ఎస్‌జీ అధికారుల సమక్షంలోనే ఆయనను సీఐడీ ఆఫీసులో ఉంచవచ్చని, కేసు-భద్రత వేర్వేరు అంశాలని మరికొందరు వాదిస్తున్నారు.

కాగా చంద్రబాబు అరెస్టుకు సంబంధించి టీడీపీ లీగల్ సెల్ ఈపాటికే న్యాయప్రక్రియ పూర్తి చేసింది. అందులో ఒకటి ఆయన రిమాండ్‌ను వ్యతిరేకించే పిటిషన్ కాగా, మరొకటి బెయిల్ పిటిషన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండా ఎలా అరెస్టు చేస్తారన్న అంశంతోపాటు.. ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరికి బెయిల్ మంజూరైన అంశాన్ని టీడీపీ లీగల్ సెల్ వాదించేందుకు సిద్ధమవుతోంది. ఆ మేరకు ప్రముఖ న్యాయవాదుల సలహాలు కూడా తీసుకుంటోంది. బాబు అరెస్టు వ్యవహారం సుప్రీంకోర్టు తీర్పులకు విరద్ధమని వాదిస్తున్నారు.

అయితే.. ఏసీబీ కోర్టు జడ్జి ముందు హాజరుపరిచే అంశంపై కూడా వివాదం నడుస్తోంది. ఈ కేసులో ఏసీబీకి సంబంధం లేనందున, ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అధికారం లేదని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. ఒకవేళ ఇది వివాదమవుతుందని భావిస్తే, జిల్లా జడ్జి ఎదుట హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ కేసులో జడ్జి.. చంద్రబాబుకు బెయిల్ ఇస్తారా? రిమాండ్‌కు ఆదేశాలిస్తారా? ఆమేరకు ఇరువర్గాల న్యాయవాదుల వాదనలు ఎలా ఉండబోతున్నాయి? అసలు విచారణ సమయంలో న్యాయమూర్తి వ్యాఖ్యలు ఏవిధంగా ఉండబోతున్నాయి? అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

LEAVE A RESPONSE