జిల్లాల పెంపు ప్రస్తుతం ఉప్పుకి,ఉపకారానికి పనికిరాని పెంపు

-ప్రభుత్వ వైఫల్యాలను, ఉద్యమాల స్ఫూర్తిని పక్కదారి పట్టించేందుకే జిల్లాల పెంపు ఎత్తుగడ
– కర్నూలుకు దామోదరం సంజీవయ్య జిల్లా పేరు పెట్టాలి
– అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య

ఎలాంటి ఉపయోగం లేకపోయినా, ఉప్పుకీ, ఉపకారానికీ పనికి రాకపోయినా రాష్ట్రంలో అన్ని సమస్యలను పక్కదారి పట్టించేందుకు, జిల్లాల పెంపు విభజనను రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా ఆన్లైన్ పద్ధతిలో 13 జిల్లాలను 26 జిల్లాలు చేసిందని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య విమర్శించారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ జనగణన మార్గదర్శకాలను,త్వరలో జరగనున్న నియోజకవర్గాలు పునర్విభజన వంటి అంశాలను కూడా పక్కన పెట్టి ఆకస్మికంగా, అసంబద్ధంగా, అశాస్త్రీయంగా ప్రభుత్వం జిల్లాలను ముందుకు తెచ్చినట్లు చెప్పారు.అయితే కొత్త జిల్లాలకు అన్నమయ్య, సత్యసాయి, ఎన్టీఆర్ వంటి పేర్లు గుర్తు పెట్టుకున్న ప్రభుత్వానికి ఉమ్మడి ఏపీ దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు ను మరిచిపోవడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు.

కవి చక్రవర్తి గుర్రం జాషువా పేరును కూడా మరచిపోయారన్నారు. అమరావతి ప్రాంతంలో స్వయంగా బుద్ధుడే వచ్చిన చారిత్రక ఆధారాలు ఉన్నాయని,రాజధాని గ్రామాలు ఉన్న జిల్లాకు బుద్దిస్టు మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. దళిత సంఘాలు, మేధావులు ముక్త కంఠంతో కర్నూలను దామోదరం సంజీవయ్య జిల్లాగానూ,రాజధాని ప్రాంతానికి అంబేద్కర్ జిల్లాగాను ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వం కళ్లు తెరిపించాలని బాలకోటయ్య పిలుపునిచ్చారు.

Leave a Reply