-రిపబ్లిక్, ఏబీపీ ఆనందపై కూడా
-నిషేధపు రోగం బెంగాల్‌కూ పాకింది
-దీని ఆద్యుడు వైఎస్సే
-వివాదమవుతున్న ఏపీ జెడిపై వేటు వ్యవహారం
-ఫైనాన్స్, సీఎంఓకు తెలియకుండానే మహిళా అధికారిపై వేటు
-కమిషనర్‌ను వదిలేసి జెడిపై చర్యలా?
(మార్తి సుబ్రహ్మణ్యం)
మీడియాను నిషేధించే రోగం ఒక్క తెలుగు రాష్ట్రాలకే కాదు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికీ పాకింది. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న టీవీ9, ఏబీపీ ఆనంద, రిపబ్లిక్ చానెళ్లను బహిష్కరిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఆ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ మూడు చానెళ్ల యజమానులపై దర్యాప్తులు, ఈడీ కేసులు, ఢిల్లీ జమిందార్లను సంతోషపెట్టాల్సిన అవసరాన్ని గుర్తించామని ఆ ప్రకటనలో పేర్కొంది. ఏబీపీ ఆనంద చర్చలో టీఎంసీ ఎంపీ కాకోలి ఘోష్, బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్రపాల్ గొడవ పెట్టుకున్న నేపథ్యంలో.. టీఎంసీ ఈ నిషేధ నిర్ణయాన్ని ప్రకటించింది.
నిజానికి ఈ మీడియా నిషేధాల రోగం ఇప్పటిదాకా ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాలకే పరిమితమన్న భావన ఉండేది. తెలంగాణలో బీఆర్‌ఎస్ అధినేత ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ను నిషేధించారు. తన పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే పత్రికలు, చానెళ్లలకు దారుణమైన లక్ష్మణరేఖ గీశారు. తనకు వ్యతిరేకంగా రాసే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేది లేదని, వ్యతిరేక మీడియాను పదడుగుల లోతున పాతరేస్తానని, నిర్భయంగా వేదికపైనే ప్రకటించారు. తన సొంత టీన్యూస్, నమస్తే తెలంగాణ పత్రికకే ఎక్కువ ప్రకటనలు విడుదల చేసేవారు.
ఏపీలో నాటి సీఎం జగన్ సైతం తన గురువు కేసీఆర్ దారిలోనే నడిచారు. తనకు వ్యతిరేకంగా వ్యవహరించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, ఈటీవీ, టీవీ 5పై నిషేధం విధించారు. జగన్ సర్కారు కొన్నేళ్లు ఈనాడుకు ప్రకటనలు ఇచ్చినప్పటికీ, వాటికి బిల్లులు విడుదల చేయలేదు. దానితో విసిగిపోయిన ఈనాడు.. తనకు ప్రభుత్వ ప్రకటనలు అవసరం లేదని లేఖ రాసి, నేరుగా జగన్ సర్కారుపై యుద్ధం ప్రకటించింది.
ఆ ఐదేళ్ల కాలంలో ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌కు నయాపైసా ప్రకటనలు ఇవ్వలేదు. ఫలితంగా ఆ సంస్థ ఆర్ధికంగా చాలా నష్టపోయింది. అయితే తన సొంత మీడియా సాక్షి పత్రిక-చానెల్‌కు మాత్రం వందల కోట్ల రూపాయల ప్రకటనలిచ్చింది. విచిత్రంగా జగన్ జమానాలో సాక్షికి చేతికి ఎముక లేకుండా ప్రకటనలు ఇచ్చిన నాటి కమిషనర్‌ను విడిచిపెట్టిన కూటమి సర్కారు.. ఆయన ఆదేశాలు పాటించిన మహిళా జాయింట్ డైరక్టర్ కస్తూరిని మాత్రం జీఏడీలో రిపోర్టు చేయమనడం ఆశ్చర్యం. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారన్నది ఆమెపై ఒక ఆరోపణ. అది నిజమే అయితే.. అసలు అదే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన పార్ధసారధి, సమాచారశాఖ మంత్రిగా ఉండటం మరో విచిత్రం.
నాటి కమిషనర్‌ను తిరిగి రాష్ట్రానికి తెప్పిస్తామని సమాచారశాఖ మంత్రి పార్ధసారధి అసెంబ్లీలో చెప్పినప్పటికీ, కమిషనర్ తిరిగి తన మాతృసంస్థ పీఐబీలో రిపోర్టు చేసి, ప్రస్తుతం కోల్‌కతాలో ఈస్ట్‌జోన్ డైరక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు.. ఆయన రిలీవ్ అంశంపై క్యాట్‌కు వెళ్లిన నేపథ్యంలో, తీర్పు ఆయనకు అనుకూలంగా రావడంతో, ఇక ఆయనను ఏపీకి పిలిపించే అవకాశం లేదు.
నిజానికి ఆయన ఎన్నికలకు ముందు.. తనకు మరో రెండేళ్లు ఏపీలో డెప్యుటేషన్ పొడిగించాలని కోరినప్పటికీ, మాతృశాఖ అంగీకరించలేదు. అయితే విచిత్రంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి సీఎస్.. కొత్త ప్రభుత్వ పదవీ స్వీకారం ఉన్నందున, సమర్ధుడైన ఆయన సేవలు అవసరం కాబట్టి, కమిషనర్‌ను వెనక్కి పంపించాలని స్వయంగా మూడు లేఖలు రాయడం మరో విశేషం.
ఈ క్రమంలో గత ఐదేళ్లు సాక్షికి ప్రకటనల వరద పారించి, టీడీపీ అనుకూల మీడియాకు ప్రకటనలివ్వని నాటి కమిషనర్, ఇప్పుడు ఎంచక్కా కోల్‌కతాలో ఉద్యోగం చేసుకుంటుండగా, ఆయన ఆదేశాలు పాటించిన జాయింట్ డైరక్టర్‌ను మాత్రం జీఏడీకి అటాచ్ చేయడమే వింత.
జాయింట్ డైరక్టర్లుగా ఎవరున్నా కమిషనర్ ఆదేశాలు పాటించడం అనివార్యం. సహజంగా జెడిలకు పనివిభజన కమిషనర్ ఆదేశాల మేరకే జరుగుతుంది. ఏయే విభాగాలు వారికి అప్పగించాలన్నది కమిషనర్ విచక్షణాధికారమే. ఒకవేళ వారి విభాగాల్లో అవినీతి జరిగితే అందుకు జెడిలతోపాటు, కమిషనరు కూడా బాధ్యులవుతారు. ఎందుకంటే కమిషనర్ల ఆదేశాలు లేకుండా జెడిలు సొంత నిర్ణయం తీసుకోవడం కుదరదు కాబట్టి.
ఒకవేళ విజిలెన్స్ అధికారులు పాత కమిషనర్‌ను విచారణకు పిలిపించినా.. తాను సీఎం ఆదేశాల మేరకే పనిచేశానని చెప్పడం సహజం. మరి అప్పుడు విజిలెన్స్ అధికారులు నాటి సీఎం జగన్‌ను విచారిస్తారా? అన్నదే ప్రశ్న. ఇప్పుడు వేటు పడిన మహిళా అధికారి సైతం.. అదే తరహాలో కమిషనర్ ఆదేశాలు పాటించానే తప్ప, తాను ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోలేదని చెబితే.. అప్పుడు విజిలెన్స్ ఎవరిపై చర్యలు తీసుకుంటుందన్నది మరో ఆసక్తికరమైన ప్రశ్న. అధికార వ్యవస్థ అనేది సమిష్టి బాధ్యతే అయినప్పటికీ, అధికారికంగా పైనుంచి వచ్చే ఆదేశాల మేరకే నడుస్తుంటుందన్న విషయం, ప్రభుత్వానికి తెలియకపోవడమే వింత.
ఏ ప్రభుత్వం వచ్చినా అధికారులు పైవారి ఆదేశాలు అమలుచేయాల్సిందే. అలా అమలుచేసిన వారే ఆ స్థానాల్లో ఉంటారన్నది బహిరంగ రహస్యం. ఇప్పుడు వెయిటి ంగ్‌లో ఉన్న 16మంది ఐపిఎస్, మరికొందరు ఐఏఎస్ అధికారులే నిదర్శనం.
నిజానికి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, సమాచార శాఖ కమిషనర్లు ముఖ్యమంత్రి ఆదేశాలు పాటించాల్సిందే. పాలకులు ఏ మీడియాకు ప్రకటనలు ఇవ్వాలని సూచిస్తే, వాటికి మాత్రమే ఇవ్వడం అనివార్యం. ఆ మేరకు కమిషనర్ ఆదేశాలను డిడి నుంచి డిపిఆర్‌ఓ వరకూ అమలు చేసి తీరాల్సిందే.
కాకపోతే అవుట్‌డోర్, హోర్డింగ్స్, చిన్నపత్రికలకు ప్రకటనల విడుదలలో ఉన్న వెసులుబాటును వారు వినియోగించుకుంటారంతే. అంతకుమించి ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోలేరు. ఏ రాష్ట్రంలోనయినా జరిగేది ఇదే. అంటే ఏదైనా కమిషనర్ ఆదేశాలు, అనుమతి లేకుండా సమాచారశాఖలో పుల్ల కూడా ‘అధికారికంగా’ కదలదు.
కానీ ఏపీలో మాత్రం ఆదేశాలిచ్చిన కమిషనర్‌ను విడిచిపెట్టి, ఆయన ఆదేశాలు అమలుచేసిన మహిళా అధికారిపై వేటు వేయడమే ఆశ్చర్యం. అదే పద్ధతి ప్రాతిపదిక అయితే, సమాచారశాఖలో కమినషర్ నుంచి- ఫైళ్లపై సంతకాలు చేసిన ఏ ఒక్క అధికారి కూడా మిగిలే అవకాశం ఉండదు. అందరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం అనివార్యమవుతుంది.
అయితే ఏడాదిన్నర పాటు ప్రింట్‌మీడియా ప్రకటనల వ్యవహారం పర్యవేక్షించిన ఆమెను, జీఏడీలో రిపోర్టు చేయమని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. ఆ సమాచారాన్ని ఆర్ధికశాఖ, సీఎంఓ దృష్టికి తీసుకువెళ్లకుండా మంత్రి స్ధాయిలోనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సహజంగా జెడి స్థాయి అధికారిని జీఏడీలో రిపోర్టు చేయమని ఆదేశాలిచ్చిన తర్వాత, దానిని ఫైనాన్స్, సీఎంఓకు పంపించాలి.
అందుకు భిన్నంగా ఈ నిర్ణయం మంత్రి స్థాయిలోనే జరగడం విచిత్రమని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇటీవల విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకోవడం విచిత్రం. ఇదిలా ఉండగా ఒక సామాజికవర్గానికి చెందిన మీడియా ప్రతినిధులే, ఈ వ్యవహారంలో క్రియాశీల పాత్ర పోషించారన్న ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు అధికారం మారిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సాక్షికి ప్రకటనలు నిలిపివేసింది. అంతకుముందు నుంచే టీడీపీ సాక్షిని నిషేధించింది. ఇప్పుడు ఆ జాబితాలో.. గత ఐదేళ్లు తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన టీవీ9, ఎన్ టీవీ, 10 టీవీపై టీడీపీ నిషేధం విధించింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చివరి ఏడాది మినహా, అంతకుముందు నాలుగేళ్లు సాక్షికి ప్రకటనలు నిలిపివేసింది. ఈనాడు-ఆంధ్రజ్యోతికి సింహభాగం బడ్జెట్ కేటాయించింది.
ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో.. అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్‌ను తొలుత ఈటీవీకి ఇవ్వగా, ఆ తర్వాత ఏబీఎన్‌కి కేటాయించింది. జగన్ ఐదేళ్ల జమానాలో ఆయన అనుకూల ధాత్రి మీడియాకు ఆ బాధ్యత ఇవ్వగా, ఇప్పుడు టీడీపీ సర్కారు మళ్లీ ఏబీఎన్‌కు అప్పగించింది.
ఇలా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, వారి అనుకూల మీడియాకు పెద్దపీట వేస్తుండటం ఒక సంప్రదాయంగా మారింది. అయితే కొత్తగా ఇప్పుడు ‘బలిపశువుల’ వ్యవస్థ మొదలవడమే విచారం. ఇక్కడ జెడిలు, డిడిలు, డీపీఆర్‌ఓలు ఎవరన్నది పక్కనపెడితే.. పైవారి ఆదేశాలు పాటించిన కింది స్థాయి అధికారులు బలవడమే విచారకరం. ఇది ఏ మాత్రం శ్రేయస్కరం కాదు.
అసలు పాలకులు మీడియాపై లక్ష్మణరేఖ గీసిన సంప్రదాయం, వైఎస్ జమానా నుంచే మొదలయింది. ఈనాడు-ఆంధ్రజ్యోతినుద్దేశించి ఆయన ‘ఆరెండు పత్రికలు’ అంటూ వ్యాఖ్యానించేవారు. వైఎస్ సీఎం అయిన తర్వాత ఆంధ్రజ్యోతికి ప్రకటనలు నిలిపివేయగా, ఆ సంస్థ కోర్టుకు వెళ్లింది.