– తెలంగాణలో మరిన్ని సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు వినతి
– రాష్ట్ర రాజకీయ పరిస్థితి, బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్న రాజ్ నాథ్ సింగ్
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ భేటీ అయ్యారు. కేంద్ర జల వనరుల విభాగం సలహాదారు వెదిరె శ్రీరాంతో కలిసి ఈరోజు రాజ్ నాథ్ సింగ్
ను కలిసిన బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు ఆమోదం తెలపడంపట్ల ప్రత్యేకంగా కృతజ్ఝతలు తెలిపారు.
రాష్ట్రంలో మరిన్ని సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ తెలంగాణలో రాజకీయ పరిస్థితిపై చర్చించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ చేస్తున్న కార్యక్రమాలను, ప్రజా సంగ్రామ యాత్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ ‘టీఆర్ఎస్ అవినీతి-కుటుంబ-నియంత పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన తొలిదశ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ విజయవంతమైందని, అందులో భాగంగా ఈనెల 14 నుండి రెండో విడత ‘ ప్రజా సంగ్రామ యాత్ర’ను చేపడుతున్నట్లు’ రాజ్ నాథ్ సింగ్ కు వివరించారు.