– బండి సంజయ్ కు సమస్యలు మొర పెట్టుకున్న మెదక్ ప్రజలు
– పాదయాత్రకు విశేష స్పందన
– బోనాలు హారతులతో మహిళల స్వాగతం
– వేలాది మందితో కాషాయవర్ణమైన మెదక్ పట్టణం
‘‘అన్నా….హల్ది వాగు – కొంటూరు చెరువు ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించి దశబ్దాలు దాటినా పూర్తి కాలేదు. భూములిచ్చి నష్టపోయినం. ఈ ప్రాజెక్టు పూర్తయితే 7 గ్రామాల రైతులకు లబ్ది చేకూరేది. 3 వేల ఎకరాలకు సాగు నీరొచ్చేది. ఇప్పుడు ఎటూ కాకుండా పోయినం. మీరే న్యాయం చేయాలి’’ బండి సంజయ్ కు కొంటూరు చెరువు ఆయకట్టు రైతుల మొర ఇది.
‘‘అన్నా…ఈ ప్రభుత్వానికి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్న ఫలితం లేదు. సొంతిల్లు లేక కిరాయిలు కట్టలేక నానాగోస పడుతున్నం. మీరే ఏదైనా దారి చూపాలి.’’ మెదక్ పట్టణంలో బండి సంజయ్ ను కలిసిన మహిళలు, కూలీల ఆవేదన ఇది.
‘‘బిడ్డా…మేం వ్యవసాయం చేసి బతుకున్నం. అప్పు చేసి మా పిల్లలను పెద్ద చదువులు చదివించినం. కానీ ఏం లాభం వాళ్లకు ఉద్యోగాలు రాకపోయే. నోటిఫికేషన్లు లేకపాయే. అప్పులు తీర్చలేక మేం చస్తున్నం. వయసు మీద పడుతున్నా ఉద్యోగం రావడం లేదని మా పిల్లలు ఏడుస్తుండ్రు. ఏం చేయాలో పాలుపోతలేదు.’’ పాదయాత్ర గ్రామాల్లో రైతులు బండి సంజయ్ ఎదుట వెలిబుచ్చిన ఆవేదన ఇది.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్రలో ప్రజల నుండి వినతులు వెల్లువెత్తున్నాయి. ఎవరిని కదిలించినా సమస్యలే చెబుతున్నారు. ఏడేళ్ల కేసీఆర్ పాలనలో కష్టాలు కన్నీళ్లే మిగిలాయయని వాపోతున్నారు. 18వ రోజు మంబోజుపల్లిలోని గీతాంజలి స్కూల్ నుండి ప్రారంభమైన పాదయాత్ర మెదక్ పట్టణం మీదుగా శాలిపేట వరకు కొనసాగింది. దారిపొడువునా ప్రజలు బండి సంజయ్ కు బ్రహ్మరథం పట్టారు. మహిళలు బోనాలు ఎత్తుకుని బండి సంజయ్ వెంట నడిచారు. యువత టపాసులు పేల్చి బండి సంజయ్ కు స్వాగతం పలికారు. బీజేపీ కార్యకర్తలు, నాయకుల ఆనందానికి అవధుల్లేవు. గజ మాలలు, పూల వర్షంతో బండి సంజయ్ కు స్వాగతం పలికారు. యువత, కార్యకర్తలు బండి సంజయ్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. మెదక్ జిల్లాలో అపూర్వ స్పందన లభిస్తోంది.
ఇక దారి పొడవునా ప్రజలు బండి సంజయ్ కోసం ఓపికగా ఎదురు చూశారు. ఆయన రాగానే తమ గోడు వెళ్లబోసుకున్నారు. సాయంత్రం పొద్దు పోయాక కూడా పాదయాత్ర సాగిన ప్రాంతాల్లో జనం ఓపికగా సంజయ్ రాకకోసం ఎదురు చూస్తుండటం గమనార్హం. వివిధ వర్గల ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. గొల్ల కురుమ సంఘం నాయకులు బండి సంజయ్ కి మేక పిల్ల ను బహూకరించి పాదయాత్రకు తమ సంఘీభావాన్ని తెలిపారు. ముదిరాజులు మత్స్యకారులు చేపలు పట్టే వలలతో పాదయాత్రలో బండి సంజయ్ ని కలిసి మద్దతు ప్రకటించారు. మెదక్ పట్టణంలోని ట్రాక్టర్ షోరూమ్ మారుతి సుజుకి షోరూం కార్మికులు ఉద్యోగులు బండి సంజయ్ ని కలిసి పాదయాత్రకు వారి సంఘీభావం తెలిపారు.
మెదక్ పట్టణంలో పాదయాత్రను చూసేందుకు వచ్చిన మహిళల తో మాట్లాడిన బండి సంజయ్ కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు మీకు ఏమైనా చేసిందా? అని అడిగి తెలుసుకున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన ఏడేళ్లలో మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అని ఇవ్వలేదని బండి సంజయ్ కి మహిళలు తెలిపారు. మెదక్ పట్టణంలోని కార్పెంటర్ కార్మికుల తో మాట్లాడుతున్న బండి సంజయ్. వృత్తిరీత్యా వడ్ల కమ్మరి పని చేసుకుంటున్నా ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి రుణ సదుపాయం కల్పించడం లేదని కార్పెంటర్ లు బండి సంజయ్ దృష్టికి తీసుకువచ్చారు.
మెదక్ పట్టణంలో రైతులతో బండి సంజయ్ కూర్చొని హల్దీ వాగు కింద పోయిన భూముల బాధితులతో చాలాసేపు మాట్లాడారు. వారి బాధలను ఓపికిగా విన్నారు. మెదక్ ఆటోనగర్ వద్ద మహిళలు బోనాలతో హారతులతో బండి సంజయ్ కి స్వాగతం పలికారు. ఆటోనగర్ నల్ల పోచమ్మ కాలనీ వద్ద ప్రజలతో మాట్లాడుతున్న బండి సంజయ్. జనసంద్రమైన మెదక్. బండి సంజయ్ కుమార్ పాదయాత్రను చూసేందుకు, సంఘీభావం తెలిపేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు. మెదక్ పట్టణంలో పాదయాత్ర చేస్తూ దారి వెంట ఇస్త్రీ చేస్తున్న మహిళను కలిశారు. తను కొద్దిసేపు ఇస్త్రీ చేస్తూ ఆమె పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. మెదక్ వ్యవసాయ మార్కెట్ వద్ద కూర్చున్న రైతుల తో మాట్లాడారు.
మెదక్ పట్టణంలో అడుగడుగున ప్రజల సమస్యలు వింటూ వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు. అనంతరం మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా కు వేలాది మంది జనం రావడంతో వారిని ఉద్దేశించి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మధ్యాహ్నం 4 గంటలకు భోజనం చేసి కొద్దిసేపు విరామం తీసుకున్న బండి సంజయ్ సాయంత్రం 6 గంటలకు పాదయాత్రను తిరిగి కొనసాగించారు. సాయంత్రం పొద్దుపోయాక సైతం దారి పొడవునా జనం వేచి ఉన్నారు. సంజయ్ తో కలిసేందుకు, సెల్ఫీలు దిగేందుకు, తమ సమస్యలను విన్పించేందుకు పోటీ పడ్డారు.