Home » లబ్దిదారులతో గ్రామసభలు నిర్వహించండి: తలసాని

లబ్దిదారులతో గ్రామసభలు నిర్వహించండి: తలసాని

గొర్రెల యూనిట్ల పంపిణీ కి అర్హులైన లబ్దిదారులతో గ్రామ సభలు నిర్వహించి లబ్దిదారుల వాటాధనంకు సంబంధించిన DD లను సేకరించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి అధికారులను ఆదేశించారు. బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయం నుండి అన్ని జిల్లాల పశువైద్యదికారులతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, TSLDA CEO మంజువాణి, షీఫ్ ఫెడరేషన్ MD రాంచందర్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1.25 లక్షల రూపాయలు ఉన్న గొర్రెల యూనిట్ ధర ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 1.75 లక్షలకు పెంచారని తెలిపారు. యూనిట్ ధర పెరిగినందున లబ్దిదారుల వాటా కూడా 12,500 రూపాయలు పెరుగుతుందని మంత్రి వివరించారు. DD లు చెల్లించి పెండింగ్ లో ఉన్న లబ్దిదారులకు కూడా పెరిగిన ధరలు వర్తిస్తాయని గ్రామ సభల ద్వారా లబ్దిదారులకు వివరించాలని సూచించారు. ఇప్పటికే DD లు చెల్లించిన 595 మంది లబ్దిదారులకు వచ్చే వారంలో గొర్రెల కొనుగోలు చేసి ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. కొనుగోలు చేసిన గొర్రెల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ పోర్టల్ (ఈ లాబ్) లో తప్పనిసరిగా నమోదు చేయాలని మంత్రి DVAHO లను ఆదేశించారు.
గొర్రెల పంపిణీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. గొర్రెలు మరియు మేకల అమ్మకాలు, కొనుగోలు సులభతరంగా నిర్వహించేందుకు అన్ని జిల్లాల లో మౌలిక వసతులతో గొర్రెల మార్కెట్ ల నిర్మాణం చేట్టడం నిర్ణయించడం జరిగిందని తెలిపారు. మార్కెట్ ల నిర్మాణానికి అవసరమైన 5 ఎకరాల భూమిని కేటాయించాలని జిల్లా కలెక్టర్ లకు ఇప్పటికే లేఖలు వ్రాయడం జరిగిందని చెప్పారు. DVAHO లు జిల్లా కలెక్టర్ ల సహకారంతో అవసరమైన భూమిని గుర్తించాలని చెప్పారు. ఇప్పటికే స్థలాలను గుర్తించిన చోట నిర్మాణ పనులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా వారంలో 2 రోజులు గ్రామాలలో పర్యటించాలని అన్నారు. మాంసం ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం ఉమ్మడి జిల్లాల వారిగా స్థలాలను గుర్తించాలని అన్నారు.
గొర్రెల మార్కెట్ లకు ఈ ప్రాసెసింగ్ యూనిట్ లకు అనుసంధానం చేయడం ద్వారా వచ్చే మాంసం ను స్థానిక వినియోగదారులకు అందించే విధంగా ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్లు వివరించారు. క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి వాటికి సంబంధించిన వివరాలు అందజేయాలని గతంలోనే ఆదేశించడం జరిగిందని అన్నారు. కొన్ని జిల్లాల DVAHO లు మాత్రమే వివరాలు అందజేశారని, నేటి వరకు ఇంకా కొన్ని జిల్లాల అధికారులు ఆ సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరు, సిబ్బంది పనితీరు పై రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించడం వలన పూర్తిస్థాయి అవగాహన కలుగుతుందని అన్నారు.
నాణ్యమైన పశుసంపదను పెంపొందించేందుకు చేపట్టిన కృత్రిమ గర్భధారణ కార్యక్రమం పై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని అన్నారు. మొదటి దశలో 5.12 లక్షల పశువులకు గాను 5.6 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ నిర్వహించడం జరిగిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. కృత్రిమ గర్భధారణ కార్యక్రమం వివరాలను ఏ రోజుకు ఆరోజు సంబంధిత వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2 కోట్ల 12 లక్షల 29 వేల గొర్రెలకు నట్టల నివారణ మందు త్రాగించడం జరిగిందని, మిగిలిన గొర్రెలకు కూడా వెంటనే త్రాపించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పటి వరకు అనేక జిల్లాలలో వీటికి సంబంధించి పూర్తిస్థాయిలో వెబ్ సైట్ లో వివరాలు అప్ లోడ్ చేయలేదని, ఈ నెల 22 వ తేదీ లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా వ్యాక్సిన్ పంపిణీ అన్ని జీవాలకు పూర్తిస్థాయి అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యాక్సినేషన్ కు సంబంధించిన వివరాలను కూడా ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాల అమలు లో గోపాలమిత్ర ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. జీవాలకు అవసరమైన మందులను కొనుగోలు చేసి అన్ని పశువైద్య శాలల్లో అందుబాటులో ఉంచాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. రాష్ట్రంలో జీవాల సంఖ్య పెరగడంతో హాస్పిటల్స్ కు డిమాండ్ పెరుగుతుందని అన్నారు. ఈ సంవత్సరం రాష్ట్రంలోని దేవరకద్ర, మిర్ దొడ్డి, జగిత్యాల, వనపర్తి, సత్తెనపల్లి తదితర ప్రాంతాలలో 7.53 కోట్ల రూపాయల ఖర్చుతో 12 నూతన పశువైద్యశాలల నిర్మాణం చేపట్టడం జరిగిందని వివరించారు.
పనులు వేగంగా జరిగేలా పర్యవేక్షించాలని ఆయా జిల్లాల DVAHO లను మంత్రి ఆదేశించారు. ఇంకా అవసరం ఉన్న మరికొన్ని ప్రాంతాలలో వచ్చే సంవత్సరం చేపడతామని చెప్పారు. జీవాల వద్దకే వెళ్ళి వైద్య సేవలు అందించే ఉద్దేశంతో ప్రారంభించిన సంచార పశువైద్య శాలల పనితీరు పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపాలని అన్నారు. మేకలు, గొర్రెలలో వచ్చే బ్రూ సెల్లో సిస్ వ్యాధి నివారణ కు టీకాలు వేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అన్నారు. పశుసంవర్ధక, డెయిరీ, TSLDA లకు చెందిన ఖాళీ స్థలాలలో పశుగ్రాసం పెంపకం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. 24 జిల్లాలలో 72 పశువైద్య శాలల్లో భూమిని గుర్తించడం జరిగిందని తెలిపారు. విజయ డెయిరీ, DLDA, గొర్రెల మార్కెట్, కృషి విజ్ఞాన్ కు చెందిన 70 ఎకరాలలో పశుగ్రాసం పెంపకం చేపట్టేందుకు గుర్తించినట్లు చెప్పారు. తెలంగాణ విజయ డెయిరీ, TSLDA, పశుసంవర్ధక శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి పశుసంరక్షణ అందించాలైన మెరుగైన వైద్య సేవలు, పశుగ్రాసం పెంపకం, పాల ఉత్పత్తిని మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.

Leave a Reply