-1400 మంది యువకుల చావుకు కారకులు కాంగ్రెసోళ్లే కదా…
-ముందే తెలంగాణ ఇస్తే.. ఇన్ని చావులు జరిగేవే కాదు కదా..
-నా తెలంగాణ అమరుల రక్తపు మరకలను చూడటానికి ఉస్మానియాకు రావాలనుకుంటున్నవా?
-తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాకే ఉస్మానియాలో అడుగు పెట్టాలి
-వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు పట్టని కేసీఆర్..
-టీఆర్ఎస్ కు పోయే కాలం దాపురించింది…
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్…
‘‘ రేపో ఎల్లుండో కాంగ్రెస్ లో ఒకాయన ఢిల్లీ నుండి వచ్చి ఉస్మానియా వర్శిటీ పోతడట… ఆయన ఏ ముఖం పెట్టుకుని పోవాలనుకుంటున్నడు? తెలంగాణ ఉద్యమంలో 1400 మంది యువకులు సూసైడ్ చేసుకుని చనిపోయింది కాంగ్రెస్ పాలనలోనే కదా. ఆనాడే తెలంగాణ ఇచ్చి ఉంటే.. అంతమంది నా తమ్ముళ్ల ప్రాణాలు పోయేవి కాదు కదా… అయినా సిగ్గు లేకుండా ఉస్మానియాకు ఎందుకు వస్తున్నట్లు? బలిదానం చేసుకున్న 1400 మంది నా తమ్మళ్ల రక్తపు మరకలు చూడటానికి ఉస్మానియాకు రావాలనుకుంటున్నవా? తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు, కాళ్లు చేతులు విరగ్గొట్టుకుని భవిష్యత్ నే కోల్పోయిన నా వేలాది మంది యువకిశోరాల బతుకులను గెలిచేయడానికి వస్తున్నవా?’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు.
ఈనెల 6న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్న నేపథ్యంలో ఉస్మానియా వర్శిటీలో విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్న నేపథ్యంలో బండి సంజయ్ తీవ్రంగా స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 21వ రోజు మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాల సుబ్రమణ్యంతో కలిసి ధర్మాపురం గ్రామంలో రైతులు, స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ రాహుల్ పై ధ్వజమెత్తారు.
తెలంగాణ ఉద్యమంలో 1400 మంది బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు ద్వేషిస్తున్నారని, అందుకే తెలంగాణ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ కు తొడపాశం పెట్టి.. ఓడికొట్టారని దుయ్యబట్టారు. ఆ పార్టీ నుండి గెలిచిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ కు అమ్ముడు పోయారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లోని మరికొన్ని ముఖ్యాంశాలు….
21 రోజులుగా ఎర్రటి ఎండలో కుటుంబాలను వదిలేసి మీ కోసమే పాదయాత్ర చేస్తున్నాం. కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల జాడే లేదు. మోడీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై
ఇక్కడున్న అమ్మలు ఎంత చక్కగా మాట్లాడుతున్నరు. బీజేపీ వాళ్ళు ఎవరూ కూడా ఇంట్లో కూర్చో కూడదు అని, ప్రధాని మోదీ అందరికీ చెబితే… మేము మీ ముందుకు వచ్చి మీ బాధలు, సమస్యలు తెలుసుకుంటున్నం.
ఎన్నికలొస్తే కెసిఆర్ పిట్టకథలు చెబుతూ, సెంటిమెంట్ రగిలిస్తూ… ఓట్లకోసం ప్రజల ముందుకు వస్తాడు. మన పోరాటంతో ఫామ్హౌస్లో పడుకునే కేసీఆర్ ను… ప్రగతి భవన్ కు, అక్కడి నుంచి బయటికి తీసుకు వచ్చాము. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నాం.
మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి 1.40 లక్షల ఇండ్లను ఇస్తే…. కేసీఆర్ ఇక్కడ ఇల్లు కట్టకుండా డ్రామాలు ఆడుతున్నాడు. యూపీలో 40 లక్షల మందికి ఇండ్లు కట్టించిన యోగీ మళ్లీ గెలిచి సీఎం అయ్యిండు. పేదలకు ఇండ్లు ఇవ్వని కేసీఆర్… తనకు మాత్రం రూ.800 కోట్లు పెట్టి, ప్రగతి భవన్ కట్టించుకున్నాడు. మోడీ ఇల్లిస్తే… మీరెందుకు మాకు ఇవ్వడంలేదు అని టీఆర్ఎస్ వాళ్ళను గల్లా పట్టి అడగండి.
కరోనా టైమ్ నుంచి 5 కిలోల బియ్యాన్ని మోడీ ఫ్రీగా ఇస్తున్నారు. తెలంగాణలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇస్తున్నది మోడీనే. ఉపాధి హామీ పథకం కింద రూ.277 కూలీ కేంద్రం ఇస్తోంది. కేంద్రం ఇస్తున్న ఉపాధి హామీ పథకం నిధులను కేసీఆర్ ఎందుకు కూలీలకు సకాలంలో ఇవ్వడంలేదు?. వారానికి ఒకసారి ఉపాధిహామీ కూలి చెల్లించాలి.
దళితులకు 3 ఎకరాల భూమి హామీ ఏమైంది? కేసీఆర్ మాత్రం మూడు వందల ఎకరాలు సంపాదించుకున్నాడు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఊసే లేదు. కేసీఆర్ కుటుంబం లో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలు వచ్చాయి. నెలకు ఇరవై ఐదు లక్షలు జీతం తీసుకుంటున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు మాత్రం ఇవ్వరు. కెసిఆర్ కు తాగుడు తప్ప ఏమీ తెలీదు. కెసిఆర్ దొంగ దీక్ష చేసి సీఎం అయ్యాడు.
తలాపున తుంగభద్ర నది ఉన్నా… మీకు మాత్రం నీళ్ళు రావడంలేదు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి తన ఫాంహౌస్లో వ్యవసాయానికి కాలేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు తెచ్చుకున్నాడు. వరి వేస్తే ఉరే అంటాడు. పంట కొంటారా కొనరా అనే క్లారిటీ లేదు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. ఇప్పటికే 75 శాతం మంది రైతులు నష్టానికి ధాన్యాన్ని అమ్ముకున్నారు. అకాల వర్షాలతో పంట పొలాల్లో ఉన్న ధాన్యాన్ని రైతన్నలు కోల్పోయారు… దీంతో తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన రైతన్నలను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
తుపాకీ రాముడు(రాహుల్ గాంధీ) ఉస్మానియా యూనివర్సిటీకి పోతాడట. తెలంగాణ రాష్ట్రాన్ని ఆలస్యంగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కారణంగానే… 1400 మంది అమరులయ్యారు. ఏం మొహం పెట్టుకుని రాహుల్ గాంధీ ఉస్మానియా కి వస్తాడు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్లంతా కూడా పేద వాళ్లే… పెద్దోళ్ళు కాదు. 1400 మంది అమరుల రక్తపు మరకలను చూడటానికి వస్తున్నాడా? ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని, కాళ్లు చేతులు విరిగి భవిష్యత్ ను కోల్పోయిన వేలాది మంది నా తమ్ముళ్లను హేళన చేయడానికి వస్తున్నవా? ముందు నా తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆ తరువాతే ఉస్మానియాలో అడుగుపెట్టాలి.
పేదోళ్లు చచ్చిపోతే వచ్చిన తెలంగాణలో… పెద్దోడు రాజ్యమేలుతున్నాడు. కెసిఆర్ పేదోళ్ల రక్తాన్ని తాగుతున్నాడు. పేదల ఓట్లు పైసలు ఇచ్చి కొంటా… మళ్లీ అధికారం లోకి వస్తా అని అనుకుంటున్నాడు కేసీఆర్. తెలంగాణలో వచ్చేది పేదోళ్ల ప్రభుత్వమే. రాష్ట్రంలో దళిత బంధు దళితులకు రాదు… ఒకవేళ వచ్చినా టిఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే వస్తుంది. కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాల పేరుతో ప్రజలను చీల్చి, రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడు కేసీఆర్. కెసిఆర్ కు బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైంది. వచ్చే ఎన్నికల్లో ప్రజలే కేసీఆర్ కు బుద్ధి చెబుతారు.