Suryaa.co.in

Telangana

యుద్ద గుర్రాలుగా మారండి….

-ఎన్నికల ఏడాదిలో ఉన్నాం…. ఇకపై కఠినంగా ఉందాం
-రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుందాం
-బీజేపీ వివిధ మోర్చాల సమావేశంలో తరుణ్ చుగ్ స్పష్టీకరణ
-మీరంతా యాక్టివ్ గా ఉంటే పార్టీ అంతగా బలోపేతమవుతుంది
-కేసీఆర్ లో అహంకారం పెరిగింది
-10 వేల మందితో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి త్వరలో నిరుద్యోగ మార్చ్
-మే నాటికి అన్ని జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తాం
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వెల్లడి

‘‘ఎన్నికల ఏడాదిలో ఉన్నాం. మీరంతా యుద్దంలో పాల్గొనే గుర్రాల్లా మారాలి. ఇప్పుడు పెండ్లి ఊరేగింపు గుర్రాలతో పెద్దగా ప్రయోజనం ఉండదు.’’అని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వివిధ మోర్చాల నాయకుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చాలామంది కష్టపడి పనిచేస్తున్నారని… మిగిలిన వాళ్లు కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశానికి తరుణ్ చుగ్ తోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, డాక్టర్ పద్మ, వేముల అశోక్, ఆకుల విజయ సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, యువ, కిసాన్, మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు, నాయకలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీ కార్యక్రమాలను సీరియస్ గా తీసుకోవాలని ఆదేశించారు. రాబోయే నవంబర్ నుండి మే వరకు రివర్స్ ప్లాన్ లో కార్యక్రమాలను రూపొందించుకునేలా రోడ్ మ్యాప్ రెడీ చేయాలని కోరారు. అందులో భాగంగా 9,10,11 తేదీల్లో వివిధ మోర్చాలు సమావేశం కావాలని చెప్పారు. మండల స్థాయిలో క్రియాశీలంగా పనిచేస్తున్న వాళ్లెవరు? అంటీముట్టనట్లుగా ఉన్నవాళ్లెవరనే వివరాలు సేకరించి తమకు అందజేయాలని సూచించారు. ఈనెల 15, 16 తేదీల్లో మళ్లీ మోర్చాలతో సమావేశమవుతామని స్పష్టం చేశారు. ‘‘ఇకపై కఠినంగా ఉంటాం. ఎవరినీ ఉపేక్షించబోం. మీరు కూడా కార్యక్రమాల అమలు విషయంలో అట్లనే ఉండాలి. అధికారమే లక్ష్యంగా పనిచేయాలి. ఎన్నికల ఏడాదిలో ఉన్నందున యుద్దం చేసే గుర్రాల్లా మారాలి. పెళ్లిల్లో ఊరేగించే గుర్రాలతో ఇప్పుడవసరం ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోండి’’అని స్పష్టం చేశారు. ఇకపై మోర్చాలు చేసే ప్రతి కార్యక్రమాన్ని సరళ్ యాప్ లో లోడ్ చేయాలని సూచించారు.

అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ…. సికింద్రాబాద్ పరేడ్ బహిరంగ సభ సక్సెస్ చేసిన వాళ్లందరికీ అభినందనలు తెలిపారు. మోర్చాలు ఎంత యాక్టివ్ గా ఉంటే పార్టీ అంతగా బలోపేతమవుతుందనే విషయాన్ని గుర్తుంచుకుని కింది స్థాయి నుండి మోర్చాలను బలోపేతం చేసే దిశగా రోడ్ మ్యాప్ రూపొందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లో అహంకారం పెరిగిందని, 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను ప్రమాదంలో పడ్డా కనీసం నోరు విప్పడం లేదన్నారు. నిరుద్యోగుల పక్షాన మే నాటికి అన్ని ఉమ్మడి జిల్లాల్లో భారీ ఎత్తున ’’నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తాం’’ అని పేర్కొన్నారు. అతి త్వరలో 10 వేల మందితో వరంగల్ జిల్లాలో నిరుద్యోగ మార్చ్ నిర్వహించేందుకు సిద్ధమయ్యామన్నారు.

LEAVE A RESPONSE