Suryaa.co.in

Telangana

జాతీయోద్యమ స్ఫూర్తికి బిజెపి తూట్లు

స్వాతంత్ర పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న బిజెపి, ఆర్ఎస్ఎస్
బహుళజాతి సంస్థలకు దేశాన్ని దారాదత్తం చేస్తున్న మోడీ
మోడీ ప్రజావ్యతిరేక విధానాలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్
మధిర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎల్పీ నేత

కాంగ్రెస్ మహనీయులు ఏకజాతిగా నిర్మించిన భారత్ ను కులాలు, మతాలు, ప్రాంతాలుగా విభజించి జాతియోద్యమ స్ఫూర్తి కి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. 75 వ స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకొని సోమవారం మధిర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ, నెహ్రూ, మోతిలాల్, గోపాలకృష్ణ గోకులే, బెనర్జీ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్, ఇలా అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాల వారు నాయకత్వం వహించి ఒకటే జాతిగా దేశాన్ని నిర్మించి స్వాతంత్రం తీసుకొచ్చారని వివరించారు.

కానీ స్వాతంత్ర సంగ్రామ చరిత్రను అవగతం చేసుకుని బిజెపి, ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు స్వాతంత్ర పోరాట చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్రం తీసుకు వచ్చిన కాంగ్రెస్ దేశ వనరులు, సంపదను బహుళ జాతి సంస్థలు, ప్రైవేటు వ్యక్తుల పరం కాకుండా చూసిందన్నారు. దేశ సహజ వనరులైన భూమి, నీరు ఎవరీ గుత్తాధిపత్యంలో ఉండకూడదని భావించిన ప్రధాని ఇందిరా గాంధీ భూ సంస్కరణలు తీసుకువచ్చి లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశారని తెలిపారు. బొగ్గు, భూగర్భ గనులు, బహుళార్థక సాగునీటి ప్రాజెక్టులు, రవాణా, ప్రభుత్వ పరిశ్రమలను దేశ సంపదగా భావించి ప్రజల ఆస్తులుగా ఈ దేశంలో కాంగ్రెస్ ఉంచిందన్నారు.

కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ప్రధాని మోడీ బహుళ జాతి సంస్థల అధిపతులైన అంబానీ, ఆదానీలకు అతి తక్కువ ధరలకు అమ్మివేస్తూ ఆనాటి జాతీయోద్యమ లక్ష్యాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. ఇది దేశానికి, ప్రజాస్వామ్యానికి, సామాన్యులకు మరింత ప్రమాదకరమన్నారు. దేశ వనరులు ఆస్తులు, సంపద, భూమి బహుళ జాతి సంస్థల గుత్తాధిపత్యంలోకి వెళ్లడం వల్ల ప్రజల భవిష్యత్తు వారి చేతుల్లో బానిసత్వంగా మారే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆనాడు ఈస్టిండియా కంపెనీ దయాదాక్షిన్యాల మీద దేశ ప్రజలు బతికినట్టు మోడీ అనుసరిస్తున్న విధానాలతో బహుళ జాతి కంపెనీలపై ఆధార పడాల్సిన దుస్థితి నేడు మనకు వస్తున్నదన్నారు.

ఇది రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్య లక్ష్యాలకు పూర్తిగా వ్యతిరేకమని వివరించారు. మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసం ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. దేశ స్వాతంత్ర పోరాటంలో మదిర నియోజకవర్గం ప్రత్యేక భూమిక పోషించిందని గుర్తు చేశారు. ఆనాడు జరిగిన స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో నియోజకవర్గంలో పుట్టిన సమరయోధులు కీలక భూమిక పోషించారని తెలిపారు. జమలాపురం కేశవరావు, నల్లమల్ల గిరిప్రసాద్, శీలం సిద్ధారెడ్డి, ప్రతాపరెడ్డి, తదితర సమరయోధులు మధిర బార్డర్లో తెలంగాణ సమరయోధులకు శిబిరాలు ఏర్పాటు చేసి, ఆశ్రయం కల్పించి నిజాం నిరంకుశ పరిపాలన నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి ప్రధాన భూమిక పోషించారని వివరించారు.

LEAVE A RESPONSE