అమరావతి: సీఎం చంద్రబాబు కుటుంబం నుంచి మరొకరు రాజకీయాల్లోకి వస్తారని ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు జోరుగా ప్రచారం సాగింది. సీఎం కోడలు, మంత్రి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి రాజకీయ అరంగేట్రం చేస్తారని టీడీపీ నేతలు కూడా ప్రచారం చేశారు. విజయవాడ ఎంపీ లేదా, గుంటూరు స్థానం నుంచి బ్రాహ్మణి పోటీ చేసే అవకాశం ఉందని కూడా ప్రచారంలోకి వచ్చింది. పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. అయితే.. ఆమె ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితం అయ్యారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు.
అయితే.. తరచుగా మాత్రం నారా బ్రాహ్మణి రాజకీయ అరంగేట్రంపై చర్చసాగుతూనే ఉంది. తాజాగా ఈ విషయంపై ఆమె అత్త, సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణి ఎప్పటికీ రాజకీయాల్లోకి రాబోరని ఆమె తెలిపారు. ఆమెకు అసలు రాజకీయాలంటే ఇష్టమేలేదన్నారు. ముఖ్యంగా రాజకీయాలంటే బ్రాహ్మణికి అస్సలు పడదని.. ఈ నేపథ్యంలో ఆమె రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కూడా లేదని చెప్పారు. తనకు వ్యాపారం చేసుకోవడం, స్వతహాగా ఎదగడమే ఇష్టమని భువనేశ్వరి చెప్పారు.