– రంగా బిల్లా, బీఆర్ఎస్ నాయకులు వస్తే వాతలు పెట్టండి
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు
– మైత్రీవనంలో అన్న నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం
– వెంగళరావు నగర్ కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్
హైదరాబాద్: రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఉంటాయి. అవకాశం వచ్చినప్పుడు మనతో ఉండే వారిని గెలిపించుకోకుంటే చారిత్రక తప్పిదం అవుతుంది. బీఆర్ఎస్ నేతలు సెంటిమెంట్ అంటున్నారు. ఉపాధి కోసం నగరానికి వచ్చిన పేదలకు అండగా నిలిచిన నాయకుడు పి.జనార్దన్ రెడ్డి.
ఆయన మరణించినప్పుడు ఆయన కుటుంబ సభ్యుడిని నిలిపితే, ప్రతిపక్ష బీజేపీ నాయకులు, టీడీపీఅధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పోటీ లేకుండా ఏకగ్రీవానికి ఒప్పుకున్నారు. కానీ ఏకగ్రీవానికి ఏమాత్రం అంగీకరించనది బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ కాదా? నగరానికి గోదావరి నీరు తెచ్చిన ఘనత పీజేఆర్ ది.
కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిచిన శ్రీగణేష్ ఏడాదిలోనే 4 వేల కోట్ల అభివృద్ధి చేశారు. గత పదేళ్లు మున్సిపల్ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నది బీఆర్ఎస్ నాయకులు ఏం చేశారు? ఇక్కడ అభివృద్ధిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు.
బీజేపీ- బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధం. బీఆర్ఎస్ అవయవదానం చేసి బీజేపీ ని గెలిపించారు. ఏనాడైనా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ ఇక్కడకు వచ్చారా? కార్పెట్ బాంబింగ్ చేస్తామని బీజేపీ నాయకులు అనడం సిగ్గుచేటు. పదేళ్లలో సన్న బియ్యం ఇచ్చా రా? బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చారా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారు
బీఆర్ఎస్ కు ఓటు వేస్తే కార్డులు, సన్న బియ్యం, ఉచిత బస్సు ప్రయాణం రద్దు అవుతుంది. ఓట్లు అడగడానికి రంగా బిల్లా, బీఆర్ఎస్ నాయకులు వస్తే వాతలు పెట్టండి. మూడుసార్లు గెలిచిన నాయకుడు ఏ రోజైనా అసెంబ్లీలో మాట్లాడాడా?నవీన్ యాదవ్ గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. మాటిస్తే తప్పేది లేదు. మడమ తిప్పేది లేదు.
మీరు ఒక్క ఓటు వేస్తే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అవుతారు.ఇప్పటికే అజారుద్దీన్ మంత్రి అయ్యారు. వాళ్ళిద్దరు అభివృద్ధి చేస్తారు. ఇక్కడ నవీన్ యాదవ్ ని గెలిపిస్తే అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడ వర్షం, వరదలు వస్తే ముఖ్యమంత్రి హోదాలో నేను వచ్చి సమస్యలు పరిష్కరించా. పదేళ్లు మంత్రిగా ఉన్న వ్యక్తి ఏనాడైనా ఇక్కడకు వచ్చాడా?
గంజాయి, డ్రగ్స్ పై పోరాడుతుంటే అడ్డుకుంటున్నారు. మైత్రీవనంలో అన్న నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. నవీన్ యాదవ్ ని భారీ మెజారిటీతో గెలిపించండి.