Suryaa.co.in

Telangana

బిజెపి, కాంగ్రెస్ లకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు

-బిజెపి, కాంగ్రెస్ కుట్ర
-కవిత అరెస్టుకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్త నిరసన
-బి ఆర్ ఎస్ పిలుపు
-మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బి ఆర్ ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే బిజెపి, కాంగ్రెస్ కలిపి కుట్ర చేసి అరెస్ట్ చేశాయని, దీనిపై రాజకీయంగా, న్యాయ పరంగా పోరాడటానికి సిద్దమని తెలిపింది.

కవిత అరెస్టు నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..”అరెస్ట్ అప్రజాస్వామికం, అక్రమం, అనైతికం. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టులో కేస్ పెండింగ్లో ఉండగా శుక్రవారం రోజు కావాలనే అరెస్ట్ చేశారు. శని, ఆదివారాల్లో కోర్టుకు సెలవు ఉంటుంది గనుక రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా కుట్రతో ఈరోజు బిజెపి మా శాసనమండలి సభ్యురాలిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.

రేపు పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పటికే ఈసీ ప్రకటన కూడా ఇచ్చింది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని తెలిసి ఈరోజు కవిత గారిని అరెస్టు చేయడం అంటే ఇది మా బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ని డి మోరలైజ్ చేసేటటువంటి ఒక ప్రయత్నం. తద్వారా ఈ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలని బిజెపి, కాంగ్రెస్ రాష్ట్రంలో కలిసి కుట్ర చేసాయి. సుప్రీం కోర్టులో అక్రమ అరెస్ట్ మీద కేసు వేసి లీగల్ గా ఫైట్ చేస్తాం.

సుప్రీం కోర్టులో చెప్పిన మాటకు విరుద్ధంగా శుక్రవారం సాయంత్రం అరెస్టు చేయడం అంటే ఇది కచ్చితంగా రాజకీయ కుట్ర. 19 వ తేదీ కేసు ఉంది కదా ఎందుకు అర్జెంట్ గా అరెస్ట్ చేయాలి?

ఈ చర్యలకు నిరసనగా, కవిత అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా రేపు అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ పిలుపు ఇస్తున్నది. రాజకీయ ప్రేరేపితమైన అరెస్టు ఇది. కాంగ్రెస్ బిజెపిల దుర్మార్గపు చర్య. బిఆర్ఎస్ పార్టీ దీన్ని ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటుంది. బిజెపి కాంగ్రెస్ లకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు. ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట అన్నారు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకొని వచ్చారు. ఒక ప్రణాళిక ప్రకారం చేశారు. కోర్టుకు కూడా వెళ్లే అవకాశం లేకుండా చేశారు. రేపు శనివారం ఎల్లుండి ఆదివారం. ఒక పథకం ప్రకారం చేశారు.

LEAVE A RESPONSE