Suryaa.co.in

Telangana

రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్రలు..

– రాజ్యాంగాన్ని నిలబెట్టుకుంటేనే మనందరికీ భవిష్యత్తు
– రాజ్యాంగం ఒక పుస్తకం కాదు అద్భుత గ్రంథం
– సామాజిక న్యాయ సూత్రం ఎజెండాగా రాష్ట్రంలో పరిపాలన
– ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపగడపకు తీసుకువెళ్లండి
– ప్రజల కోసమే ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది
– ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్: ఈ దేశంలో ప్రస్తుతం ఒక సైదాంతిక పోరాటం జరుగుతుంది రాజ్యాంగాన్ని రక్షించాలని కాంగ్రెస్, ఇండియా కూటమి ఒక పక్కన, రాజ్యాంగాన్ని మార్చాలని బిజెపి, ఎన్డీఏ కూటమి మరో పక్కన పోరాటం చేస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ఆయన ఎల్బీ స్టేడియంలో పిసిసి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సామాజిక న్యాయ సభలో ప్రసంగించారు. గ్రామ శాఖ అధ్యక్షులతో సాక్షాత్తు ఏఐసిసి అధ్యక్షులు నేరుగా మాట్లాడేందుకు పిసిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయని తెలిపారు. భారత రాజ్యాంగం అంటే అది కేవలం ఒక పుస్తకం కాదు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఈ దేశ ప్రజల ఆలోచనలు, పూజ్య బాపూజీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే ఆలోచనలని రాజ్యాంగంలో పొందుపరిచి ప్రజల అవసరాల కోసం రూపొందించిన ఒక అద్భుత గ్రంథం భారత రాజ్యాంగం అని తెలిపారు.

భారత రాజ్యాంగమే లేకపోతే ఈ దేశంలో పేదలు ,సామాన్యులు, గిరిజనులు, దళితులకు, బలహీన వర్గాలకు ఎటువంటి హక్కులు ఉండేవి కావు హక్కులు కేవలం రాజులు, రాజ్యాధికారం అనుభవించే కొద్ది మంది పెద్దలకు మాత్రమే దక్కేవి అన్నారు. అటువంటి పరిస్థితుల్లో దేశంలోని ప్రతి పౌరునికి సమాన హక్కులు, గౌరవాన్ని కల్పిస్తూ ఈ దేశ సంపద, అవకాశాలు దేశంలోని ప్రజలందరికీ సమానంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీజీ, బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన అద్భుత గ్రంథం రాజ్యాంగం అన్నారు.

ఇంతటి పవిత్ర గ్రంధాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ముందుకు పోతున్నారు, రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవడమే మనందరి భవిష్యత్తు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

భారత రాజ్యాంగానికి చిన్న ఇబ్బంది జరిగిన దేశంలోని సామాన్యులు హక్కులు కోల్పోయే పరిస్థితి ఈ దేశంలో దాపురిస్తాయి అన్నారు.
అద్భుత గ్రంథమైన రాజ్యాంగ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ప్రజల అందరి ఆశీర్వాదంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈరోజు వరకు ఆ సామాజిక న్యాయ సూత్రాన్ని అమలు చేసేందుకు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రంలో తీసుకువచ్చిందని డిప్యూటీ సీఎం వివరించారు.

రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి వచ్చిన పార్టీ నేతలు ప్రజా ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.

పది సంవత్సరాలపాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన టిఆర్ఎస్ అడ్డగోలుగా దోపిడీకి పాల్పడింది, బిజెపి ఈ రాష్ట్ర ప్రజలను పట్టించుకోలేదు ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జీర్ణించుకోలేక అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు.
కొన్ని లెక్కల ద్వారా ఆ రెండు పార్టీలకు సరైన సమాధానం చెప్తామన్నారు.

2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు ప్రకటిస్తే అపహాస్యం చేసిన వారికి బుద్ధి చెప్పేలా
రాష్ట్ర రైతాంగ సోదరులను రుణ విముక్తులను చేసేందుకు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రెండు లక్షల రుణమాఫీ కింద 69 లక్షల రైతు కుటుంబాల పక్షాన 21,832 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు చెల్లించిందని తెలిపారు.

రైతు భరోసా కింద అన్నదాతలకు

పెట్టుబడి సాయం కోసం కేవలం తొమ్మిది రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశాం అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.

సన్నధాన్యం సాగు చేసే రైతులకు ప్రోత్సాహకంగా క్వింటాకు 500 చొప్పున బోనస్ చెల్లించాం, రైతుల ఖాతాలో డబ్బులు వేశామని తెలిపారు.
రాష్ట్రంలోని 42 లక్షల మంది రైతాంగ సోదరులకు ఇన్సూరెన్స్ కోసం రైతుల పక్షాన ప్రభుత్వమే 2,181 కోట్లు చెల్లించిందని తెలిపారు.

అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే పది సంవత్సరాలపాటు పరిపాలించిన టిఆర్ఎస్ నేతలు పట్టించుకోలేదు కానీ ప్రజా ప్రభుత్వం రాగానే 260 కోట్లు విడుదల చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు.

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకువచ్చింది ఈ పథకం కింద రాష్ట్రంలో 29 లక్షల పంప్ సెట్ల గాను రైతుల పక్షాన ప్రభుత్వం ఇప్పటివరకు 17 వేల కోట్లు విద్యుత్ సంస్థలకు కట్టింది అన్నారు.

భూమిలేని నిరుపేద ప్రజానీకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం 12,000 వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని వివరించారు.

చేయూత పథకం కింద వివిధ రకాల పెన్షన్ దారులకు 43 లక్షల మందికి ఇప్పటివరకు ప్రజా ప్రభుత్వం 17,958 చెల్లించిందని తెలిపారు.
రాష్ట్రంలో ప్రతి పేదవానికి ఇల్లు ఉండాలన్న ఆలోచనతో ఐదు లక్షల రూపాయలు వెచ్చించి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నామని తెలిపారు. మొదటి దశలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం అన్నారు.

200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ వాడుకునే గృహజ్యోతి పథకంతో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని 80% మందికి కరెంటు బిల్లు కట్టే పని లేకుండా పోయింది అన్నారు. గృహ జ్యోతి పథకం కింద పేదల పక్షాన ప్రభుత్వం 2,110 కోట్లు విద్యుత్ సంస్థలకు చెల్లించిందని డిప్యూటీ సీఎం తెలిపారు.

500 కే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 641 కోట్లు పేదల పక్షాన గ్యాస్ సంస్థలకు చెల్లించిందని తెలిపారు.
పేదలు, బడుగు బలహీన వర్గాలు అనారోగ్యానికి గురైతే వైద్యం అందక ఇబ్బందులు పడొద్దు అనే ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల పరిమితిని 10 లక్షలకు పెంచాం, ఈ పథకం కింద రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు ఉచితంగా వైద్య సహాయం అందుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు.
రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వడ్డీ లేని రుణాలను డ్వాక్రా మహిళలకు పంపిణీ చేస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి సంవత్సరం 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు అందించాం అన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నాం.. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది పేదల పక్షాన ప్రభుత్వమే ఈ పథకం కోసం 13,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తున్నాం, ఒక్కో పాఠశాలను 25 ఎకరాల్లో 200 కోట్లు వెచ్చించి నిర్మిస్తున్నామని తెలిపారు. ఒకేసారి 105 స్కూల్స్ మంజూరు చేశాం రాష్ట్ర చరిత్రలో ఈనాడు ఇలాంటి సంఘటనలు జరగలేదని తెలిపారు.

అటవీ హక్కుల చట్టం కింద రాష్ట్రంలోని పేద గిరిజనులకు 6.70 లక్షల ఎకరాలను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేయగా ఆ భూములన్నిటిని సాగులోకి తెచ్చేందుకు ఇందిరా సౌర గిరిజన వికాస పథకం కింద 12,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ పథకం కింద గిరిజన రైతులకు సోలార్ పంప్ సెట్లు, డ్రిప్పు, స్ప్రింక్లర్లను ఏర్పాటుచేసి ఉద్యాన పంటలు సాగు చేసేందుకు మొత్తం ఉచితంగా రైతులకు అందజేస్తున్నామని తెలిపారు.

కేవలం సంవత్సరంన్నర కాలంలో ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తట్టుకోలేక ఏడుస్తూ విమర్శలు చేసే వారి గురించి కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం చేయాలి, ప్రజల కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు.

LEAVE A RESPONSE