–హామీలు అమలు చేయమన్న పాపానికి ఇంత నిర్బంధమా?
–ఇందిరమ్మ రాజ్యమంటేనే అప్రకటిత ఎమర్జెన్సీ
–నిరుద్యోగుల అరెస్టులు దారుణం
–బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
హైదరాబాద్: ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నయవంచనకు పాల్పడిన కాంగ్రెస్ సర్కారు మోసాన్ని నిలదీసిన నిరుద్యోగుల చేతులకు సంకెళ్ళు వేస్తారా?అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు , ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు.
హామీలు అమలు చేయమన్న పాపానికి ఇంత నిర్బంధకాండను అమలు చేయడం నిరంకుశ ఇందిరమ్మరాజ్యంలో భాగమేనని, రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని ఆయన శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్ అధిష్టానం చేసిన ద్రోహంపై నిలదీసేందుకు వచ్చిన నిరుద్యోగులను అరెస్టు చేయడం అత్యంత హేయమైన చర్య అని జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తమ ప్రజాపాలనలో సెక్రటేరియట్ తలుపులు ఎప్పుడూ బార్లా తెరిచే ఉంటాయని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల వెతలు కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు.
బీ ఆర్ఎస్ హయాంలో 95శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కేలా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకున్న విషయాన్ని జీవన్ రెడ్డి గుర్తు చేశారు.