Suryaa.co.in

Editorial

కమలం కోర్‌ కమిటీ భేటీలు ఉన్నట్టా? లేనట్టా?

– ప్రత్యక్ష పద్ధతి ఇక వద్దంటున్న రాష్ట్ర నాయకత్వం?
– ఇకపై ఫోన్‌లో ముఖ్యులతోనే ముచ్చట్లకు పరిమితం?
– మోదీ మీటింగ్‌ లీక్‌ సాకుతో కోర్‌ కమిటీకి తెర?
– ఢిల్లీకి ఫిర్యాదు చేసిన బీజేపీ సీనియర్లు?
– కోర్‌ కమిటీ భేటీ ఎందుకు జరపడం లేదని ఢిల్లీ నేతల ప్రశ్న
– కచ్చితంగా కోర్‌ కమిటీ భేటీలు ఉండాల్సిందేనని స్పష్టీకరణ
– కోర్‌ కమిటీపై రాష్ట్ర అధ్యక్షుడి పెత్తనం లేదని వ్యాఖ్య?
– అయినా ఇప్పటికీ అతీ గతీ లేని కోర్‌ కమిటీ భేటీ
– రాష్ట్ర ఇన్చార్జి, సంఘటనా మంత్రి తీరుపై అసంతృప్తి
– ఇంకా చక్రం తిప్పతున్న మాజీ సంఘటనా మంత్రి?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ బీజేపీలో ఇక కోర్‌ కమిటీ భేటీలు కొండెక్కినట్టేనా? కీలక నేతలతో పక్షం రోజులకోసారి జరగాల్సిన కోర్‌ కమిటీ భేటీలు ఇక ప్రత్యక్ష పద్ధతిలో జరగవా? కేవలం ‘కావలసిన నేతల’తో ఫోన్‌ ముచ్చట్లకే పరిమితమా? ఢిల్లీ నాయకత్వం చెప్పినా.. ఇప్పటిదాకా కోర్‌ కమిటీ భేటీ కాలేదంటే.. ఆ అంశంపై రాష్ట్ర నాయకత్వం పెత్తనమే నడుస్తుందా?.. అసలు పార్టీలో కోర్‌ కమిటీ వ్యవస్థ ఉందా? లేదా?.. ఇవీ ఏపీ బీజేపీలో కొత్తగా తెరపైకి వచ్చిన ప్రశ్నలు.

బీజేపీకి సంబంధించి చేపట్టబోయే పార్టీ కార్యక్రమాలు, కొత్త వ్యూహాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించే కోర్‌ కమిటీ సమావేశాలు ఇకపై జరిగే అవకాశాలు కనిపించడం లేదు. జాతీయ, రాష్ట్ర పార్టీ ప్రముఖులు, రాష్ర్టానికి ఇన్చార్జి అయిన కేంద్రమంత్రి, రాష్ట్రంలోనే ఉండే కో ఇన్చార్జి, రాష్ట్ర సంఘటనా మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉండే కోర్‌ కమిటీలో వివిధ అంశాలపై చర్చిస్తారు. వాటిపై అందరి అభిప్రాయాలు తీసుకుని, తుది నిర్ణయం ప్రకటిస్తారు.

ఆ సమాచారాన్ని జిల్లా పార్టీలకు పంపిస్తారు. మళ్లీ అవి జరిగిన వైనంపై, తర్వాత జరిగే కోర్‌ కమిటీలో చర్చిస్తుంటారు. ఒక్కోసారి ఈ కోర్‌ కమిటీ భేటీలకు.. జాతీయ ప్రధాన కార్యదర్శి, లేదా జాతీయ సహ ప్రధాన కార్యదర్శి వంటి కీలక నేతలు కూడా హాజరవుతుంటారు. ఈ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలన్నది రాష్ట్ర అధ్యక్షుడు నిర్ణయిస్తుంటారు. సహజంగా ఏ రాష్ట్రంలోనయినా జరిగే ప్రక్రియ ఇది. గతంలో కంభంపాటి హరిబాబు, కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు, నెలకోసారి సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించేవారు. కన్నా హయాం చివరలో 15 రోజులకోసారి నిర్వహించి, ఇకపై ప్రతి 15 రోజులకోసారి తప్పకుండా కోర్‌ కమిటీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

కానీ సోము వీర్రాజు అధ్యక్షుడయిన తర్వాత, ఈ ప్రక్రియ విధానం మారిపోయింది. ఆయన నిర్ణయించినప్పుడే కోర్‌ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆయన కోరుకున్న వారికే, ఆహ్వానాలు పంపించే విధానంపై విమర్శలు వెల్లువెత్తాయి. సీనియర్‌ నేతలు ఈ విధానంపై ఢిల్లీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు.

దానితో దేశంలోనే తొలిసారిగా.. కోర్‌ కమిటీలో ఎవరెవరు ఉండాలో నిర్ణయిస్తూ, వారి పేర్లను ఢిల్లీ నుంచే పంపించడం చర్చనీయాంశమయింది. ఇంతకుముందు ఈవిధంగా బీజేపీ నాయకత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవు. అంటే దీన్నిబట్టి ఏపీలో.. కోర్‌ కమిటీ వ్యవహారం ఎంత అడ్డగోలుగా సాగుతుందో, చివరకు జాతీయ నాయకత్వానికీ తెలిసిపోయిందన్న మాట.

నిజానికి, కోర్‌ కమిటీ ఏర్పాటు, నిర్వహణ వంటి కీలక అంశాలన్నీ ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి వచ్చిన పార్టీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పర్యవేక్షించాలి. పార్టీ పరిభాషలో ఆయనను సంఘటనా మంత్రిగా వ్యవహరిస్తుంటారు. రాష్ర్టాలకు పార్టీ అధ్యక్షులున్నప్పటికీ, ఆయా రాష్ర్టాల్లో పార్టీని దిశానిర్దేశం చేసి, నేతలను నడిపించేది మాత్రం సంఘటనా మంత్రి ఒక్కరే. అంత శక్తివంతమైన సంఘటనా మంత్రి కూడా, ఇలాంటి కీలక అంశాలపై బెల్లం కొట్టిన రాయిలా ఉండటం సీనియర్లను అసంతృప్తికి గురిచేస్తోంది.

ఇటీవల ఆరుగురు జిల్లా అధ్యక్షులను ఆకస్మికంగా తొలగించినవైనంపై వివాదం తలెత్తింది. అయినా వారిని పిలిచి బుజ్జగించడంలో, సంఘటనా మంత్రి మధుకర్‌జీ విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి రాష్ట్ర ఇన్చార్జి-కేంద్రమంత్రి మురళీధరన్‌ పార్టీని పట్టించుకోవడం లేదని, అసలు ఆయన సమయం కూడా ఇవ్వడం లేదన్న ఫిర్యాదు లేకపోలేదు. దానితో రాష్ట్ర కో ఇన్చార్జి సునీల్‌ దియోధర్‌, సంఘటనా మంత్రి మధుకర్‌జీ, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి ఒక వర్గంగా ఏర్పడి, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఫిర్యాదులు ఢిల్లీకి పార్టీకి వెళ్లాయి.

గతంలో సంఘటనా మంత్రిగా పనిచేసి.. ప్రస్తుతం వేరే రాష్ట్రంలో ఉన్న ఓ కీలకనేత మార్గదర్శకత్వంలోనే, వీరంతా పనిచేస్తున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. సదరు నాయకుడే.. ఢిల్లీ పార్టీలో తనకు సన్నిహితులయిన ముఖ్య నేతల ద్వారా, తన వర్గాన్ని కాపాడుతున్నారన్న చర్చ బహిరంగంగానే జరుగుతుండటం విశేషం.

ఇప్పుడు కోర్‌ కమిటీ సమావేశాలు ఇకపై టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా కూడా కాకుండా, వన్‌ టు వన్‌ పద్ధతిలో జరుగుతాయంటూ జరుగుతున్న చర్చపై, సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇటీవల ప్రధాని మోదీ విశాఖలో నిర్వహించిన కోర్‌కమిటీ సమావేశ వివరాలు.. పొల్లుపోకుండా మీడియాలో వచ్చినందున, ఈ పద్ధతి అమలుచేస్తున్నామని రాష్ట్ర నాయకత్వం వివరణ ఇచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం.

పార్టీల అంతర్గత సమావేశ వివరాలు మీడియాలో రావడం సహజమని, ఇది అన్ని రాష్ర్టాల్లో జరుగుతున్నదేనని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన మీటింగ్‌లో .. జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌జీ చెప్పినవన్నీ, మీడియాలో వచ్చిన వైనాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. కేవలం ప్రధాని పాల్గొన్న కార్యక్రమం లీక్‌ పేరిట, కోర్‌ కమిటీని ప్రత్యక్ష పద్ధతిలో రద్దు చేయడం అసంబద్ధమని సీనియర్లు వాదిస్తున్నారు. ఈ పేరుతో పార్టీలో జరిగే వాటిని ప్రశ్నించకుండా, తమను నిరోధించే ఎత్తుగడ అని విశ్లేషిస్తున్నారు.

కాగా కోర్‌ కమిటీ భేటీ అంశాన్ని పలువురు సీనియర్లు, ఢిల్లీ పార్టీ దృష్టికి తీసుకువెళ్లినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఫిర్యాదులు విన్న జాతీయ సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్‌జీ కూడా, విస్మయం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. కోర్‌ కమిటీ భేటీ క్రమం తప్పకుండా, ప్రత్యక్ష పద్ధతితోనే నిర్వహించాలని ఆయన, రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం. కోర్‌ కమిటీ భేటీపై రాష్ట్ర నాయకత్వానికి, ఎలాంటి అధికారం లేదని ఆయన స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి జరిగే సమావేశానికి తేదీ నిర్ణయించి, ఆ సమాచారం తనకు ఇవ్వాలని కూడా ఆయన ఆదేశించినట్లు సమాచారం.

అయినప్పటికీ.. ప్రధాని మోదీ పాల్గొన్న విశాఖ కోర్‌ కమిటీ భేటీ తర్వాత, ఇప్పటివరకూ ఒక్క సమావేశం కూడా నిర్వహించకపోవడంపై, సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా.. జగన్‌ సర్కారు అవినీతిపై చార్జిషీట్‌ వేయమని మోదీ ఆదేశించారు. అయినా దాని విధివిధానాలను చర్చించేందుకు… ఇప్పటిదాకా, రాష్ట్ర నాయకత్వం కోర్‌ కమిటీ ఏర్పాటుచేయలేదు.

ఒకవేళ దానిపై కోర్‌ కమిటీలో చర్చిస్తే.. జగన్‌ సర్కారు వల్ల లబ్ధిపొందుతున్న కొందరు నేతలకు ఇబ్బంది కలుగుతుందన్న ముందుజాగ్రత్తతోనే, ఇప్పటిదాకా చార్జిషీట్‌ అంశంపై ఎవరూ మాట్లాడటం లేదని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. ఇక విశాఖ జిల్లాలో జరిగిన స్మార్ట్‌-రూర్బన్‌ యోజన ఉద్యోగాల కుంభకోణం పార్టీని కుదిపేసింది. అందులో పార్టీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి.

దానిపై అనకాపల్లి పార్లమెంటు జిల్లా కమిటీ త్రిసభ్య కమిటీ వేసి, ఆ నివేదిక రాష్ట్ర నాయకత్వానికి ఇచ్చింది. అయినా ఆ నివేదికను రాష్ట్ర కమిటీ కోర్‌ కమిటీ ముందు ఉంచలేదు. ఇలాంటి కీలక అంశాలు అనేకం కోర్‌ కమిటీలో చర్చించాల్సి ఉంది. బహుశా వాటిపై చర్చించాల్సి వస్తుందన్న ముందు జాగ్రత్తతోనే కోర్‌ కమిటీ సమావేశాలు నిర్వహించడం లేదని సీనియర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఢిల్లీ నాయకత్వం తమకు చెప్పాల్సింది తమకు చెబుతూ.. రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పాల్సింది ఆయనకు చెబుతూ.. ఇద్దరినీ సంతృప్తిపరిచే వ్యూహం అనుసరిస్తున్నట్లు సీనియర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఇకపై కోర్‌ కమిటీ భేటీ ఉంటుందా? ఉండదా అన్న అంశంపై స్పష్టత లేకుండా పోయిందని వ్యాఖ్యానిస్తున్నారు.

LEAVE A RESPONSE