Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు మ్యూజిక్ కు బీజేపీ డ్యాన్సులు

– చంద్రబాబుకు డోలు కొట్టడం కోసం పనిచేస్తున్న ఏపీ బీజేపీ
– దోమలతో యుద్ధం చేసే పైల్వాన్ లా బీజేపీ ఎంపీ జీవీఎల్ ఛాలెంజ్ లు
– రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నాడని బాబును నాడు ఐవైఆర్ ఎందుకు ప్రశ్నించలేదు?
– ప్యాకేజీ పేరుతో ఇచ్చిన రూ. 15 వేల కోట్లు, ప్రత్యేక హోదాకు సమానం అని బీజేపీ నేతలు చెప్పగలరా..?
– సుజనా చౌదరి తోలుబొమ్మలాటలో బీజేపీ నేతలు ఆట వస్తువులుగా మారారు
– కేంద్రం చేసిన లక్షల కోట్ల అప్పుల సంగతేంటి..?
– అమ్మ ఒడి, ఆసరా, చేయూత లాంటి పథకాలను కేంద్రం ఎక్కడైనా అమలు చేస్తుందా.. వీటిని స్టాంప్ పథకాలని అనగలరా..?
– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి

పార్థసారథి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలూ కష్టపడిన యువ నాయకుడు, రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అకాల మరణం చెందితే, రాష్ట్ర ప్రజలంతా బాధతో ఉన్న సందర్భంలో, ఆయనకు కన్నీటి వీడ్కోలు చెబుతున్న సందర్భంలో, తెలుగుదేశం, బీజేపీలు నిర్లజ్జగా, సంస్కారహీనంగా, కనీసం మానవత్వం లేకుండా మాట్లాడుతున్న మాటలు చూస్తే అసహ్యం వేస్తుంది. అసలు వీళ్లు మనుషులా? పశువులా? వీరికి కనీసం లజ్జ, బిడియం ఉన్నాయా? మానవత్వం అనేది ఏకోశాన అయినా ఉందా అనే అనుమానం వస్తోంది. 50ఏళ్ల వయసులోనే ఒక మంచి యువ నాయకుడు చనిపోవడం ఎవరికైనా బాధ కలిగిస్తుంది.

రాజకీయాల్లో సౌమ్యుడు, మృధు స్వభావి, ఆగర్భ శ్రీమంతుడు అయినా కూడా.. ఏ పేదవాడు తన ఇంటికి వెళ్లినా పక్కన కూర్చోపెట్టుకుని, చిరునవ్వుతో వారి సమస్యలను పరిష్కరించే వ్యక్తి చనిపోతే.. మానవత్వం ఉన్న మనుషులమే అయితే బాధను వ్యక్తపరచాల్సిన సమయం ఇది. ఇలాంటి సమయంలోనూ నీచ రాజకీయాలకు తెరతీస్తున్నారు. మంత్రి గౌతంరెడ్డి మరణంపై.. విశాఖలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు కల్లుతాగిన కోతిలా ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటలు వింటుంటే ఎవరికైనా అసహ్యం వేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి గౌతంరెడ్డి ఎంత సన్నిహితుడో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు.

సుజనా చౌదరి తోలు బొమ్మలాటలో బీజేపీ నేతలు తోలు బొమ్మల్లా వ్యవహరిస్తున్నారు. ఐవైఆర్‌ కృష్ణారావు వయసులో పెద్దలు, బాగా చదువుకున్న వ‍్యక్తి. అలాంటి వ్యక్తి కూడా.. రాష్ట్రానికి ఇ‍ప్పుడేదో నష్టం జరిగిపోతున్నట్లుగా మాట్లాడుతున్న మాటలు వింటుంటే నవ్వు వస్తుంది. ఇది చాలా సిగ్గుచేటు అయిన విషయం. నోరుంది కదా అని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నర్సింహరావు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

ప్రత్యేక హోదాకు బదులుగా, ప్యాకేజీలో భాగంగా, 15వేల కోట్లు విలువైన ఆరు ప్రాజెక్ట్‌లు రాష్ట్రానికి ఇచ్చామని చెబుతున్నారు. ఆ డబ్బుతోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోంది, రాష్ట్ర ప్రజలు బతుకుతున్నారన్నట్టు మాట్లాడుతున్నారు. తెలంగాణాలో ఒక సామెత చెబుతారు.. ‘మచ్చర్‌ పైల్వాన్’లా జీవీఎల్‌ రాష్ట్ర ఆర్థికమంత్రికి సవాల్‌ విసురుతున్నారు. అంటే, దోమలపై యుద్ధం చేసే వారిని మచ్చర్ పైల్వాన్ అంటారు. జీవీఎల్‌కు దమ్ముంటే రాష్ట్రానికి రావ్వాల్సిన విభజన హామీలు, ప్రత్యేక హోదా, నిధుల గురించి మీడియా ముందు చర్చకు రావాలి.

ఆనాడు రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినప్పుడు… విజభనలో భాగస్వాములైన మీరు … ఆరు ప్రాజెక్ట్‌లు, రూ.15వేల కోట్లు ఇచ్చి, ప్రత్యేక హోదాకు మీరు ఇచ్చిన ప్యాకేజీ సమానమని చెప్పగలరా…?. మీరు ఇచ్చిన రూ. 15 వేల కోట్లు పోలవరం ప్రాజెక్ట్‌కు సమానం అని చెప్పగలరా..?. రాష్ట్రానికి ఇంకేమీ చెయ్యనక్కరలేదని చెప్పండి. కేంద్రం నుంచి రావాల్సిన వాటి గురించి మాట్లాడకుండా, మీ పార్టీ అగ్రనాయకత్వం మీద పోరాటం చేయకుండా మా మీద విమర్శలా? పార్లమెంట్‌ సాక్షిగా చేసిన విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని పోలవరం, ఇతర ప్రాజెక్టులు, ఉత్తర భారతదేశానికి సమానంగా ఇస్తామన్న ప్యాకేజీలు, వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఉపసంహరణ, పోర్టులకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టాలని జీవీఎల్‌, సోము వీర్రాజును మేము డిమాండ్‌ చేస్తున్నాం. ఇ‍ష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న మీకు ఈ రాష్ట్ర ప్రజలు ఏదో ఒకరోజు బడితె పూజ చేస్తారని చెబుతున్నాం.

ఐవైఆర్‌ కృష్ణారావు కూడా టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. అప్పటి ప్రభుత్వం రూ. 3లక్షల 56వేల కోట్లు అప్పు చేస్తుంటే, ఆరోజు మీకు కనిపించలేదా? చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి తోస్తున్నారని మీరు ఎందుకు ప్రశ్నించలేదని అడుగుతున్నాం. ‘బడ్జెట్‌ అంటే కేంద్ర ప్రభుత్వానిది… బడ్జెట్‌ కానిది అంటే ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌’ అని చెబుతున్న ఐవైఆర్‌గారు… కేవలం, ఇద్దరు, ముగ్గురు బడా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ, పెంచి పోషించే బడ్జెట్‌ కేంద్ర బడ్జెట్‌ అయితే.. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, నిరుపేదలు తలెత్తుకుని జీవించగలిగేలా ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ ఉందని తెలియచేస్తున్నాం.

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎంకు లోబడే చేస్తున్నామని మీకు తెలియదా? కేంద్ర ప్రభుత్వం కూడా లక్షల కోట్లు అప్పులు చేసింది. దాన్ని మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు. కరోనా పరిస్థితుల్లో దేశం, రాష్ట్రమే కాదు, ప్రపంచ ఆర్థిక పరిస్థితి అంతా ఛిన్నాభిన్నం అయిందన్న విషయం చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. ఒక్క రాష్ట ఆర్థిక పరిస్థితే కాదు, దేశ, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నం అయిన విషయం తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో కేంద్రం ప్రజలను ఆదుకున్నదానికన్నా మిన్నగా ఈ రాష్ట్రంలో జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజలను ఆదుకున్న విషయం ఎవరిని అడిగినా చెబుతారు.

తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్లు ఓపెన్‌ చేస్తే దాదాపు లక్షమంది వరకూ స్కూళ్ల మానేసినట్లు ఆ రాష్ట్రంలో ఓ ప్రధాన దినపత్రికలో చదివాను. కారణం ఏంటంటే.. కరోనాతో ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అవడంతో పిల్లల్ని స్కూల్‌కు పంపించడం కంటే, వారిని ఎక్కడైనా పనికి పెట్టుకుంటే బాగుంటుదనే ఉద్దేశంతో స్కూళ్లకు పంపించడం లేదని ఈనాడు పత్రికలోనే రాశారు. కానీ ఈ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు. దాదాపు ఈ మూడేళ్లలో లక్షన్నర కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా, పేద ప్రజలందరికీ కుల, మత, రాజకీయాలతో సంబంధం లేకుండా నేరుగా వారి ఖాతాల్లో వేయడం వల్లే కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం.

చంద్రబాబు మ్యూజిక్‌కు డ్యాన్సులు వేసే రాష్ట్ర బీజేపీ నాయకులకు ఈ విషయం కనిపించడం లేదు. జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక, రూపొందించిన సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థల వల్ల కరోనాను చాలా సమర్ధవంతంగా ఎదుర్కోగలిగారని స్వయాన దేశ ప్రధాని నరేంద్ర మోదీగారే చెప్పారు. అవకాశం ఉంటే ఇతర రాష్ట్రాలు కూడా ఏపీలో ఏర్పాటు చేసిన వ్యవస్థలను, చర్యలను అనుసరించాలని ఆశిస్తున్నామంటూ చెప్పిన మాటలు జీవీఎల్‌, ఐవైఆర్‌ కృష్ణారావులకు వినిపించ లేదా?

మీరు చంద్రబాబుకు తాళాలు, మద్దెల దరువు వేయడానికి వచ్చేరే తప్ప, రాష్ట్ర పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నారా? కేంద్ర ప్రభుత్వ పథకాలకు మేము స్టాంప్‌లు వేసుకుంటున్నామని చెబుతున్నారే? అవేంటో చెప్పండి? అమ్మ ఒడి, వైయస్సార్‌ ఆసరా, చేయుత లాంటి కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాలలోగానీ, మరే ఇతర రాష్ట్రాల్లోగానీ, కేంద్రంలో గానీ ఉన్నాయా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం.

బియ్యం సరఫరా అంటున్నారే.. మీరు ఎంతమందికి బియ్యం ఇస్తున్నారు? మీ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ఎంతమందిని పేదలుగా గుర్తించారో చెప్పండి? మా ప్రభుత్వం ఎంతమంది పేదలకు రేషన్‌ ఇస్తుందో సమాధానం చెప్పండి. రైతు భరోసా పథకాన్ని మీరు ఎంతమందికి అమలు చేస్తున్నారు? మీరు కేవలం రూ.6వేలు ఇస్తే… రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 50లక్షల 58వేల మందికి రూ.13,500 చొప్పున ఇస్తోంది. ఎక్కడ మీ పథకాలకు మేము స్టాంప్‌ వేసుకున్నది అని అడుగుతున్నాం.

కేవలం చంద్రబాబు నాయుడుకు మేలు చేయడం కోసమే రాష్ట్ర బీజేపీ పనిచేస్తోంది. కేంద్రాన్ని ఒప్పించి, సాక్షాత్తూ పార్లమెంటు ఆమోదించిన విభజన చట్టాన్ని కూడా అమలు చేయించడానికి మీరు ఎందుకు ప్రయత్నించడం లేదని అడుగుతున్నాం. చట్టం చేసిన కేంద్ర ప్రభుత్వానికి ఆ చట్టాన్ని అమలు చేయాల్నిన బాధ్యత ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నాం. ఆ చట్టం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన లక్షల కోట్ల రూపాయిలను ఎందుకు రాకుండా అడ్డుకుంటున్నారు.

ఆంధ్రా-తెలంగాణ మధ్య తాంబులం ఇచ్చాం… తన్నుకు చావండి.. అన్న రీతిలో వ్యవహరిస్తూ బాధ్యతల నుంచి పిరికిపందల్లా పారిపోతున్నారు తప్పితే, ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలనే బాధ్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. మీకు ఆ బాధ్యత ఉంటే చట్టానికి లోబడి ఆంధ్రప్రదేశ్‌కు చేయాల్సిన మేలు ఎందుకు చేయడం లేదు.

క్యాపిటల్‌ ఎక్స్‌పెండించర్‌ ఎక్కడ అంటూ ఐవైఆర్‌ కృష్ణారావు రాజకీయ లబ్ది, స్వార్థంతో తన మేధావితనాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నారు. అంబానీలకో, అదానీలకో, మీ కార్పొరేట్ వ్యక్తులకు లాభం చేసేలా, క్యాపిటల్‌ వర్క్స్‌ చేస్తేనే క్యాపిటల్‌ ప్రాజెక్ట్‌లుగా గుర్తిస్తారా అని అడుగుతున్నాం. మీకు అనుకూలమైన వ్యక్తులకు లాభం చేకూర్చేలా, పవర్‌ ప్లాంట్లు, ఆరు లైన్ల రహదారులు, వేలకోట్ల కాంట్రాక్టులు ఇచ్చే పథకాలు చేస్తేనే క్యాపిటల్‌ ఎక్స్‌పెండించర్‌ అని భావిస్తారా?

రాష్ట్రంలో పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు నాడు-నేడు కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. బడులు, ఆసుపత్రులకు సంబంధించి, పాడుబడిన భవనాలను వేలకోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఏవిధంగా తీర్చిదిద్దామో కళ్లు పెట్టి చూస్తే అర్థం అవుతుంది. నాడు-నేడు కార్యక్రమానికి మీరేమైనా ఆర్థిక సాయం చేస్తున్నారా? లేదు కదా? 28లక్షల మంది పేదలకి వేల కోట్లు ఖర్చుపెట్టి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. అదంతా పేదలకు మేలు చేయడం కోసం చేసిన ఖర్చే కదా? చంద్రబాబు లా ఆర్భాటంగా ప్రచారం చేయడానికి కాదు కదా? 28లక్షల కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుస్తూ, ఒక భరోసా కల్పించడంతో పాటు, ముఖ్యమంత్రి జగన్‌ స్థిరాస్తి ఏర్పాటు చేశారని పేదలంతా ఆనందంగా ఉన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి అథోగతి పాలు చేస్తోందని చెబుతున్నారు. ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతిపైసాకు లెక్కలు చెప్పగల సత్తా ఈ ప్రభుత్వానికి ఉంది. చంద్రబాబు నాయుడు సర్కార్‌ చేసిన మూడున్నర లక్షల కోట్ల అప్పులకు రాష్ట్ర ప్రజలకు ఇది చేశాం, ప్రాజెక్ట్‌లు కట్టామని చెప్పగల సత్తా ఉందా అని అడుగుతున్నాం. చేసిన అప్పులు ఏవిధంగా పేదవారికి చేర్చామో మేము చెప్పగలం. వారికి ఆస్తులు సమకూర్చేలా, పర్‌ క్యాపిట, జీఎస్టీని పెంచేలా ఏవిధంగా ఈ అప్పులు ఉపయోగపడ్డాయో మేము ప్రతి అణాపైసాకు లెక్కలు చెప్పగల సత్తా ఉంది. మా ప్రభుత్వం అనేక రంగాల్లో నంబర్‌ వన్‌, నంబర్‌ టూ స్థానాల్లో ఉందంటే అది జగన్‌ మోహన్‌ రెడ్డిగారి సుపరిపాలన వల్లే సాధ్యం అయింది.

రాష్ట్రంలో కోట్లాదిమంది పేదలు తలెత్తుకుని జీవించేలా, వారి బంగారు భవిష్యత్‌ కోసమే ఈ ప్రభుత్వం ప్రతి పైసా ఖర్చుపెడుతోందని అందరూ భావిస్తున్నారు. పేదవాళ్లు ఎక్కడ తలెత్తుకుని తిరుగుతారో, పేదవాళ్ళు ఎక్కడ సాధికారిత సాధిస్తారో… అని తెల్లకాలర్‌ వేసుకున్ననాయకులు, పెట్టుబడిదారులు, వ్యాపారస్తులకు కంటగింపుగా ఉందేమో కానీ, రాష్ట్ర ప్రజలు మాత్రం సంతోషంగా ఉన్నారు. సంక్షేమం- అభివృద్ధి సమ పాళ్ళల్లో జరుగుతోందని చెప్పగలం.

అన్ని ప్రాజెక్ట్‌లు నిర్మాణం చేస్తున్నాం. పదివేల కోట్లతో రోడ్ల నిర్మాణానికి కూడా బడ్జెట్‌ కేటాయింపులు, పనులు ప్రారంభం అయ్యాయి. అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేసేది లేదు. కేవలం చంద్రబాబుకు డోలు కొట్టడానికే రాష్ట్ర బీజేపీ పనిచేస్తున్నట్టుగా విమర్శలు చేయడం విడ్డూరం.

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిగి దోషులకు కఠినంగా శిక్ష పడాలని మా ప్రభుత్వం కోరుకుంటోంది. ఈ కేసును రాజకీయ లబ్ది కోసం ప్రతిపక్షాలు వాడుకుంటున్నాయి.

LEAVE A RESPONSE