Suryaa.co.in

Telangana

తెలంగాణలోనూ రాబోయేది బీజేపీ ప్రభుత్వమే

– డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని జనం కోరుకుంటున్నారు
– 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తీర్పే ఇందుకు నిదర్శనం
– కోతల కేసీఆర్ కు వాతల పెట్టేందుకు జనం సిద్ధమయ్యారు
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు

ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణలోనూ రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారని, ఐదు రాష్రాల ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం బండి సంజయ్ కుమార్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్, మాజీ అధ్యక్షులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, యువ, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్, గీతామూర్తి, రాష్ట్ర నాయకులు సీహెచ్.విఠల్, గూడూరు నారాయణరెడ్డి, జె.సంగప్ప, ఆకుల విజయ, డాక్టర్ పద్మ ఉమారాణి, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ…..

5 రాష్ట్రాల్లో ఓట్లేసిన ప్రజలకు, 4 రాష్ట్రాల్లో బీజేపీని గెలిపించిన వారందరికీ పార్టీ రాష్ట్ర శాఖ తరపున ధన్యవాదాలు. నరేంద్రమోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు ప్రత్యేక ధన్యవాదాలు .ఫలితాలు చూసిన తరువాత కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ఉత్సవాలు చేసుకున్నారు. ఎన్నికలకు ముందు, తరువాత కూడా చాలా సర్వే సంస్థలు, ప్రత్యర్ధి పార్టీలు బీజేపీ పనైపోయిందని చేసిన ప్రచారం తలకిందులైంది. 37 ఏళ్ల చరిత్రను తిరగరాసిన ఘనత యోగీ సర్కార్ దే. గూండారాజ్, మాఫియా రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించిన ఘనత యోగిదే..దేశవ్యాప్తంగా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ప్రజలు మరోసారి నిరూపించారు. అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా మోదీ పాలన కొనసాగుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ప్రజలు ఆశిస్తున్నారు. తెలంగాణలో కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నరు. కేంద్ర సంక్షేమ పథకాలను నీరు గారుస్తున్నరు. అభివ్రుద్ధి కార్యక్రమాలకు సహకరించడం లేదు. రాష్ట్ర వాటాను ఖర్చు చేయడం లేదు.సిగ్గుతో తలదించుకోవాల్సిన కేసీఆర్ ఫ్రభుత్వం మళ్లీ కేంద్రంపైనే దుష్ప్రచారం చేస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ బూచితో రాజకీయ లబ్ది పొందాలని చూస్తోంది.

2014 నుండి తెలంగాణలో బీజేపీ ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తోంది. గత ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఇక్కడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నరు.టీఆర్ఎస్ ప్రభుత్వ ఇంజన్ దారుస్సలాంకు తాకట్టు పెట్టారు. ఇంజన్ లేని సర్కార్ ముందుకు సాగదు. 4 రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాల స్పూర్తితో తెలంగాణలోనూ అధికారాన్ని కైవసం చేసుకుటాం. గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తాం.

విలేకరులు అడిగిన ప్రశ్నలకు…. చెల్లని రూపాయికి గీతలెక్కువ. కేసీఆర్ కు కోతలెక్కువ. దేశం మొత్తం తిరిగి టెంట్, ఫ్రంట్ పెడతానన్న కేసీఆర్ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారానికి ఎందుకు వెళ్లలేదు? ఆయనను ఎవరూ ఎందుకు పిలవలేదు? కేసీఆర్ పై ప్రజలకు నమ్మకం పోయింది. లీడర్లకు ఆయన సంగతి బాగా తెలుసు. అందుకే ఎవరూ పిలవడం లేదు.

కేసీఆర్ అవినీతి-నియంత-కుటుంబ పాలన పట్ల తెలంగాణ జనం విసిగిపోయారు. సరైన సమయంలో వాత పెట్టబోతున్నరు.ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటన విహార యాత్రలుగానే మిగిలిపోతాయి. టైం పాస్ యాత్రలే తప్ప ఆయనను రమ్మన పిలిచిన నాయకులు ఒక్కరూ లేరు.నిరుద్యోగ సమస్యపై బీజేపీ చేసిన ఉద్యమాల సెగ తాకడంతోనే సీఎం భయపడి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్లీ ఇతరుల పేరుతో కోర్టులో కేసులు వేయించి ఉద్యోగాల నోటిఫికేషన్ ఆగిపోయేలా చేసి జాప్యం చేయాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారు.

కేసీఆర్ కు చిత్తశుద్ది ఉంటే… ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు మళ్లీ ఎన్నికల్లోకి వెళ్లబోమని హామీ ఇవ్వాలి.కేటీఆర్… ఓ డ్రామా రావు. ఆయన మాటలు పట్టించుకునేదెవరు?కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం. అతి త్వరలో మీరే చూడబోతున్నరు. మాకంటే ప్రజలకు, మీకే (మీడియా) కేసీఆర్ లాంటి అవినీతి పరుడిని జైల్లో వేయాలని ఉత్సాపడుతున్నరు. సరైన సమయంలో జైలుకు పోవడం ఖాయం.
పార్టీలోకి ఎవరో వస్తారని మేం ఎదురు చూడం. పార్టీ సిద్ధాంతాలు, నరేంద్రమోదీ నాయకత్వాన్ని సమర్ధించే వాళ్లను మాత్రమే పార్టీలోకి వస్తానంటే స్వాగతిస్తాం.తెలంగాణపై జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. అమిత్ షా, జేపీ నడ్డా రాష్ట్రానికి వస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు.

రాజాసింగ్ మాట్లాడుతూ….
5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 4 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఇది ప్రజల గెలుపు. పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. వారందరికీ తెలంగాణ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నా. యూపీలో గూండా, మాఫియా రాజ్యాన్ని యోగి సర్కార్ ఖతం చేసింది. తెలంగాణలో కేసీఆర్ పాలనలో మాఫియా రాజ్యమేలుతోంది. భూకబ్జాలు జరుగుతున్నాయి. అవినీతి పెట్రేగిపోతోంది. ఈ అవినీతి పాలనను పెకలించి వేసేందుకు అమిత్ షా బండి సంజయ్ కు బాధ్యతలు అప్పగించారు. బండి సంజయ్ సారథ్యంలో తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయం కాబోతోంది.

డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ….
బీజేపీ కొనసాగిస్తున్న అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాలే గెలుపుకు కారణం. నేను స్వయంగా రెండు వారాల పాటు 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించాను. ప్రాంతీయ పార్టీలు కులాల పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం చేసినా అన్నింటినీ ప్రజలు తిరస్కరించారు. ప్రశాసన్, రేషన్ వంటి అంశాలకే పెద్ద పీట వేశారు. గూండారాజ్, మాఫియా రాజ్ ను ప్రజలు తిరస్కరించి యోగి ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టారు. ముస్లిం మహిళలు కూడా నరేంద్రమోదీని, యోగిని ‘రేషన్ బాబా’ అని అభివర్ణిస్తుంటారు. ఒకే ఒక్క కలం పోటుతో రూ.36 వేల కోట్ల రుణమాఫీని అమలు చేసిన ఘనత యోగి ప్రభుత్వానికే దక్కింది. చదువుకున్న యువతకు 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది. తెలంగాణలోనూ ఆ తరహా పాలన కావాలని ఇక్కడి ప్రజలు ఆకాంక్షిస్తున్నరు. ‘ఔర్ ఏక్ దక్కా… తెలంగాణ పక్కా’ నినాదంతో ముందుకు వెళతాం. అధికారాన్ని కైవసం చేసుకుంటాం.

LEAVE A RESPONSE