Suryaa.co.in

Political News

ఫలితాలతో బిజెపి ఫుల్ జోష్..

– ఇక మహారాష్ట్ర, ఝార్ఖండ్ లపై దృష్టి

హర్యానా, జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీలో కొత్త జోష్‌ను నింపాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ గతంలో కంటే మెరుగైన ఫలితాలను సాధించింది. దానితో త్వరలో జరగనున్న మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతోంది.

హర్యానాలో విజయంతో 2029 సార్వత్రిక ఎన్నికల సన్నాహాలను ఉత్సాహంగా ప్రారంభించాలన్న ఇండియా కూటమి ఆశలపై బీజేపీ నీళ్లు చల్లినట్లయింది. లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా మెజార్టీ మార్క్‌ చేరుకోలేక మిత్రపక్షాల సాయంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతాపార్టీకి హరియాణా, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి.

ఈ రెండు చోట్ల బిజెపి అంచనాలకు మించి రాణించింది. ముఖ్యంగా హిందీ హార్ట్‌ల్యాండ్‌కు తాళంగా భావించే హరియాణాలో పట్టు నిలుపుకోవడం కమలం పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చింది. ఇప్పటికే హిమాచల్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పాలనలో ఉండగా హరియాణాను కూడా కోల్పోతే ఆ ప్రభావం మిగిలిన వాటిపై పడుతుందని ప్రతిపక్షాలు ఆశలు పెట్టుకొన్నాయి. కానీ, ఈ విజయంతో బీజేపీ ఖాతాలోకి 13వ రాష్ట్రం చేరినట్లైంది.

హరియాణా చేజారితే, కేంద్రంలో బీజేపీ సర్కారుకు ఎల్‌జేపీ, జనతాదళ్‌(యూ) వంటి మిత్రపక్షాల నుంచి కూడా ఒత్తిడి ఎదురయ్యేది. ఇప్పుడు ఆ ప్రమాదం నుంచి కమలదళం బయటపడినట్లైంది. పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి అనేక ప్రతికూల అంశాల మధ్య హరియాణాలో బీజేపీ సాధించిన విజయం ఆ పార్టీలో కొత్త జోష్‌ను నింపింది.

2014, 2019 హరియాణా అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం గమనార్హం. మరోవైపు జమ్ముకశ్మీర్‌లోనూ బీజేపీ బలమైన శక్తిగానే ఆవిర్భవించింది. 2014 జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 25 సీట్లకే పరిమితమైన కమలదళం ఈ సారి 29 స్థానాలను తన ఖాతాలో వేసుకొంది. సీట్ల పరంగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తర్వాత అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది.

ఓటింగ్‌ శాతం పరంగా చూస్తే నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కంటే బీజేపీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. గవర్నర్‌ నామినేట్‌ చేసే ఐదుగురు సభ్యుల మద్దతు బీజేపీకి దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో పొత్తులు లేకపోయినా, భవిష్యత్తులో జమ్ము ప్రాంతంలో విస్తరించాలని భావించే పార్టీలు కచ్చితంగా బీజేపీ జట్టుకట్టే అవకాశం ఉంటుంది.

నియోజకవర్గాల పునర్విభజనలో జమ్ము ప్రాంతానికి ప్రాధాన్యం పెంచడం బీజేపీకి కలిసొచ్చిన అంశం. దీనికి తోడు ఎల్జీ పాలనలో వేర్పాటు వాదులను బలంగా అణచివేయడం వల్ల కశ్మీర్‌తో పోలిస్తే ప్రశాంతంగా ఉండే జమ్ములో బీజేపీ ఇమేజ్‌ బలపడింది. కశ్మీర్‌ కేంద్రంగా పనిచేసే ఎన్సీ, పీడీపీ వంటి పార్టీలు జమ్ముకు ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది.

భవిష్యత్తులో కశ్మీర్‌లో పగ్గాలు చేపట్టే పార్టీ ఏకపక్షంగా వేర్పాటు వాదాన్ని వెనకేసుకొచ్చే పరిస్థితి ఉండే అవకాశం లేదు. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లలో కూడా త్వరలోనే ఎన్నికల నగారా మోగనుంది. మహారాష్ట్రలో కమలదళం ఇప్పటికే సర్వశక్తులు ఒడ్డి పోరాడేందుకు సిద్ధమవుతోంది. ఝార్ఖండ్‌పై కూడా ఇప్పటికే బీజేపీ గురిపెట్టింది.

ప్రధాని మోదీ స్వయంగా పలు మార్లు ఆ రాష్ట్రాన్ని సందర్శించారు. బంగ్లాదేశీయుల చొరబాట్లు, హిందువులపై దాడులు వంటి అంశాలను ఝార్ఖండ్‌లో బీజేపీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. దీనికి తోడు హేమంత్‌ సొరెన్‌ అవినీతి కేసులో అరెస్టు కావడం వంటివి కూడా ఇండియా కూటమికి ప్రతికూలంగా మారవచ్చు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో కలిసి కాంగ్రెస్‌కు జమ్ముకశ్మీర్‌లో అధికారం దక్కినా కీలకమైన హరియాణాలో రాణించకపోవడం హస్తం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బనే చెప్పాలి.

(నిజం టుడే సౌజన్యంతో)

LEAVE A RESPONSE