Suryaa.co.in

Political News

పురందరేశ్వరి పదవికి ముప్పు?

దగ్గుబాటి పురంధరేశ్వరి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అయినప్పటి నుండి ఒక క్రమ పద్ధతిలో వైఎస్ఆర్సిపి వారి అవినీతి, ప్రజా వ్యతిరేక చర్యల ను, అక్రమాలను ప్రసార మాధ్యమాల ద్వారా బహిర్గతం చేయడం, దానికి వైయస్సార్ పార్టీ వాళ్లు కలవరం చెందడం, చివరికి విజయసాయిరెడ్డి లాంటివాళ్ళు ఆమెను బెదిరించే విధంగా మాట్లాడడం, అలా మాట్లాడారో లేదో కొన్ని గంటల వ్యవధిలోనే విజయసాయిరెడ్డి ఆగడాలు, నేర ప్రవృత్తి గురించి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ వ్రాయటం,. ఆ లేఖలో ఇలాంటివారిని బెయిల్ పై బయట ఎలా ఉండనిస్తున్నారని, ఇది న్యాయవ్యవస్థ సూత్రాలకు కళంకం తెచ్చే విధంగా ఉందని వివరించటం జరిగింది.

ఈ నేపధ్యం లో …. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధిష్టానం వైఖరి ఏమిటి పురందరేశ్వరి పదవికేమయనా ముప్పు కలగవచ్చా ? అనే అభిప్రాయాన్ని కొందరు విశ్లేషకులు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా విశ్లేషణ చేస్తూనే, రెండవ వైపు పురందరేశ్వరి గారి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.

ఈ సందర్భంగా అసలు పురంధరేశ్వరి ఈ విధంగా aggressive గా రియాక్టుకు దిగటానికి కారణాలేమిటని విశ్లేషిస్తే …ఆమె 2004 రాజకీయాల్లోకి రాక పూర్వం, ఒక సాధారణ గృహిణి. , ఒకానొక సందర్భంలో ఎన్టీ రామారావు గారు పురందరేశ్వరి ని పిలిచి పర్చూరు అసెంబ్లీ నుండి పోటీ చేయమని అడగగా “పిల్లలు చిన్న వాళ్ళని నేను వాళ్ళను చూసుకోవాలని” చెప్పి, తండ్రి అభ్యర్థనను తిరస్కరించింది. ఏనాడూ పార్టీ వ్యవహారాలపై గానీ, రాజకీయాలపై గాని ఆసక్తి కనబరచని నేపథ్యం ఆమెది. తరువాత అనుకోని పరిస్థితుల్లో 2004 సంవత్సరంలో ఆమె కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా గెలిచి తర్వాత కేంద్ర మంత్రి అయింది.

మంత్రి అయిన నేపథ్యం….ఆనాటి ఒక సంఘటనను తెలుసుకుందాం ..
ఎంపీ అయిన తరువాత ఆమె మంత్రి పదవి కోసం ఏనాడు సోనియా గాంధీ దగ్గరకు కానీ, ప్రధాని మన్మోహన్ సింగ్ దగ్గరకు కానీ వెళ్లి అడగలేదు. కేవలం ఒక సంవత్సరం తిరగకుండానే ఎంపీగా పురందేశ్వరిచేసిన ప్రసంగాలు, పనితీరుతో అందరి మన్ననలు పొందిన నేపథ్యంలో, మన్మోహన్ సింగ్ చొరవతో కేంద్ర మంత్రివర్గంలో పురందరేశ్వరి చోటుచేసుకుంది.

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే ఒక వారం ముందు జరిగిన ఒక సంఘటన
ఆరోజు పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ లో లెజిస్లేటివ్ కౌన్సిల్ పునరుద్ధరణ బిల్లు పై చర్చ కొనసాగుతున్నది .రాత్రి 7:30 సమయం . ఇంకొక అరగంటలో ఓటింగ్ ఉంటుంది. ఆ సందర్భంలో చర్చ జరుగుతున్న సమయంలో, పురందరేశ్వరి ఓటింగ్ లో పాల్గొనకుండా సభ నుండి బయటకు వెళ్ళింది. కారణం .. ఆ చర్చలో తన పార్టీకే చెందిన కొందరు సభ్యులు మాట్లాడుతూ ఆనాడు ఎన్టీఆర్ కౌన్సిల్ రద్దు చేశాడని, అంతటి తోటి ఆగకుండా వారు తన తండ్రిని దుర్భాషలాడటం మొదలుపెట్టారు. అది సహించలేని పురందరేశ్వరి తను కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి , చర్చలో వారిని ఏమీ అనలేని నిస్సహాయ స్థితి. అందుచేత సభలో తన తండ్రిని తన పార్టీ వాళ్లు దూషిస్తూ ఉంటే, సహించలేక సభ నుండి బయటకు వెళ్లేందుకు సిద్ధమైంది.

ఆ సమయంలో ఆమెకు దగ్గరలో కూర్చొని ఉన్న సహచర పార్లమెంటు సభ్యులు జ్యోతిరావు సింధియా, జయరాం రమేష్, సచిన్ పైలెట్లు ఆమె చర్య ను గమనించి ఆమెను నివారించే ప్రయత్నం చేస్తూ.. వారం రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరగనున్నది, జాబితాలో నీ పేరు ఉంది , నీవు గనక ఈరోజు ఓటింగ్ లో పాల్గొనకపోతే ఆ కారణంతో నీ పేరును మంత్రివర్గ జాబితా నుండి తీసివేసే అవకాశం ఉందని, అందువలన బయటకు వెళ్ళవద్దని వారందరూ వారించారు . కానీ పురందరేశ్వరి వారి మాటలను పట్టించుకోకుండా ఓటింగ్ లో పాల్గొనకుండా సభ నుండి బయటకు వచ్చింది.

ఇదంతా పార్లమెంట్లో మీడియా గ్యాలరీ నుండి వీక్షిస్తున్న నాటి ఆంధ్రజ్యోతి ప్రతినిధి కృష్ణారావు హైదరాబాదులో ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు కి ఫోన్ చేసి, అక్కడ జరిగిన విషయాన్ని తెలియజేసి, ఈ విషయాన్ని పేపర్లో రిపోర్ట్ చేస్తే మేడం కి ఇబ్బంది కలుగుతుందేమోనని చెప్పగా … ఏమీ పర్వాలేదు తండ్రి మీద ఉన్న గౌరవం ముందు, ఆమెకు మంత్రి పదవి ఒక లెక్క కాదు . నిర్భయంగా మీరు రిపోర్టు చేసుకోవచ్చని వెంకటేశ్వరావు చెప్పారు. ఆ మరుసటి రోజు ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో “కౌన్సిల్ పై ఓటింగ్ లో పాల్గొనని పురందరేశ్వరి” అనే హెడ్డింగ్ తో వార్త ప్రచురుతమయింది. తర్వాత జయరాం రమేష్ లాంటి వారు పురందరేశ్వరి ని ఒకసారి సోనియా గాంధీ ని కలిసి వివరణ ఇస్తే నీ మంత్రి పదవికి ఢోకా ఉండదని చెప్పినప్పటికీ, పురంధరేశ్వరి సోనియా గాంధీ ని కలిస్తే నేనేదో పదవి కోసం ప్రాకులాడుతున్నట్లు ఉంటుందని కలవలేదు.

కేంద్ర మంత్రిగా పురందరేశ్వరి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, ధన్యవాదాలు తెలిపేందుకు సోనియా గాంధీ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా పురందరేశ్వరి పై తమ పార్టీ వాళ్లు ఏ విధంగా ఫిర్యాదులు చేశారో సోనియా గాంధీ చెప్పగా, వెంటనే పురందరేశ్వరి అన్న మాట “నా చర్య గనుక అభ్యంతరకరంగా మీరు భావించినట్లయితే , నా మంత్రి పదవికి రాజీనామా చేయడానికి అయినా నేను సిద్ధమే” అనగానే సోనియాగాంధీ ప్రతిస్పందిస్తూ , ఈ విషయం నా దృష్టికి వచ్చిందని మాత్రమే మీకు చెబుతున్నాను. రాజీనామా చేయవలసిన అవసరం లేదని చెప్పి పంపించారు. దీనిని బట్టి పురందరేశ్వరి గారి వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయవచ్చు.

ఇంకొక సంఘటన….
తాను కేంద్ర మానవనుల శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు అర్జున్ సింగ్ క్యాబినెట్ మంత్రి. తన మంత్రిత్వ శాఖలో ఏఐసిటి చాలా ప్రధానమైనది. ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలకు చాలా డిమాండ్ ఉండేది. ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు ఇచ్చే సంస్థ ఇది. కళాశాలల యాజమాన్యాలు కోట్లాది రూపాయలు లంచాలు ఇవ్వడానికి సిద్ధపడేవారు. ముఖ్యంగా ఏఐసిటి చైర్మన్ ఈ చర్యలకు పాల్పడే వాడు.. . అతడు అర్జున్ సింగ్ కు చాలా సన్నిహితుడు. ఎడాపెడా లంచాలు తీసుకొని అనుమతులు ఇచ్చేవారు.

తన శాఖలో ఇంత అవినీతి జరుగుతుంటే సహించలేని స్థితిలో పురందరేశ్వరి.. ఒకరోజు ప్రధాని మన్మోహన్ సింగ్ కి తన శాఖలో జరుగుతున్న అవినీతిని గురించి లేఖ ద్వారా వివరించారు. తన శాఖ పై సీబీఐ ద్వారా విచారణ కూడా జరిపించవలసినదిగా ఆ లేఖ ద్వారా ఆమె ప్రధానమంత్రి ని కోరారు. ఆ లేఖను మన్మోహన్ సింగ్ చదివిన వెంటనే పురందరేశ్వరి ని తన కార్యాలయానికి రావలసినదిగా కబురు పంపారు.

వారు వచ్చిన తరువాత ప్రధాని ఈ విధంగా అడిగారు “మీరు ఈ విధంగా లెటర్ రాశారు. అర్జున్ సింగ్ పార్టీలో నాకన్నా సీనియర్. నేనే నీ చేత లెటర్ వ్రాయించానని అపోహ పడే ప్రమాదం ఉంది. అందువలన దయచేసి మీరు ఈ లేఖ నాకు రాసినట్లుగా ఎవరికి చెప్పవద్దని, అసలు ఈ విధంగా ఎప్పుడూ లెటర్ వ్రాయెద్దని చెప్పి పురందరేశ్వరి ని పంపించారు. తర్వాత నెల రోజుల్లో సిబిఐ వారు ఎఐసిటి కార్యాలయం మీద రైడ్ చేయడం , చైర్మన్ దగ్గర కోట్లాది రూపాయల నగదు దొరకడం, చైర్మన్ ను అరెస్టు చేసి జైలుకు పంపడం కూడా జరిగింది .

ఇదండీ పురందరేశ్వరి నడవడిక. ఇదే గనక ఇంకొకరైతే ఎంత ప్రచారం చేసుకునేవారు? తన శాఖ పైనే సీబీఐ చేత ఎంక్వైరీ వేయించుకొని అవినీతిని నిర్మూలించడం ఇంకొకరికి సాధ్యమేనా?

ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం..
అది 2014 రాష్ట్ర విభజన సమయం. కేంద్ర ప్రభుత్వం , సోనియాగాంధీలు రాష్ట్రం విభజించడానికి నిర్ణయం తీసుకున్నారని అందరికీ తెలుసు…. ఈ విషయం చాలామందికి తెలిసి కూడా లగడపాటి రాజగోపాల్ , కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వారు మరియు రాష్ట్రంలో కొన్ని ప్రచారం మాధ్యమాలు, తాము ఎలాగైనా రాష్ట్ర విభజనను ఆపగలమనే ధీమాతో ఉన్నారు. ఎవరైనా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏదైనా అడుగుదామంటే అడగనీయని పరిస్థితి. అంతేకాకుండా అడిగే వారిపై దుమ్మెత్తి పోస్తూ, వారిని ఆంధ్ర ద్రోహులుగా చిత్రీకరించే పరిస్థితి . ఆ సమయంలో రాష్ట్ర విభజన జరగడం తద్యం కాబట్టి రాష్ట్రానికి అవసరమయ్యే, అవసరాలు గురించి అడగాలంటే భయపడే పరిస్థితి.

ఆ సమయంలో ఇప్పటి ప్రజానీకానికి ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ, పురందరేశ్వరి నడుము కట్టి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, విజయవాడ మురళి ఫార్చునర్ హోటల్లో నగర ప్రముఖులతో ఒక సమావేశము, అదేవిధంగా విశాఖపట్నంలో ఒక సమావేశం ఏర్పరిచి, ఆంధ్రప్రదేశ్ కు కావలసినటువంటి వాటి గురించి చర్చిస్తుంటే.. పురందేశ్వరి ఆంధ్రకు వ్యతిరేకని గోల చేశారు.

అయినా పురందరేశ్వర విమర్శలను లెక్క చేయకుండా, ఆంధ్రాకు పోలవరం, ఐఐటి, ఎన్ఐటి, ఎయిమ్స్, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీ వంటి పది సంస్థలను ఏర్పాటు చేయాలని సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్లగా, ఆ సమయంలో వీటన్నింటిని ఏపీ రీ ఆర్గనైజేషన్ బిల్లులో పొందుపరచడం జరిగింది. ఆంధ్రకు ఆ పది సంస్థలు రావడం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదని ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ, ఈ రకంగా తనపై అపవాదం వస్తున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ సాహసానికి ఒడిగట్టింది అనేది ఆమెకే చెల్లుబాటు అయింది. తను వ్యక్తిగతంగా అభిశంసనకు గురైనా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను వమ్ము చేయక ఆమె అనుసరించిన పాత్ర గొప్పది. వారి మనస్తత్వం గురించి చెప్పాలంటే.. ఇలా ఎన్నో సంఘటనలు ఉన్నాయి.

ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నపాలనా విధానాన్ని, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండ కట్టటం….అందువలన తన పదవి ఉంటుందా లేదా అనేటువంటి ఆలోచన కూడా ఆమె చేయదు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. నేటి రాజకీయాలకు ఈ రకమైనటువంటి చర్యలు భిన్నం…నేటి రాజకీయం లో మనం సహజంగా ఇలాంటి చర్యలు చూడం. పురంద్రీశ్వరి గారు నేటి రాజకీయవేత్త కాదు అని చెప్పటానికి ఇవి కొన్ని నిదర్శనాలు కాబట్టే ఈ విధంగా చేయగలుగుతుందనేది నాలాంటి వాళ్ళ అభిప్రాయం.

నేను జర్నలిస్టుగా గత 30 సంవత్సరాలుగా దగ్గుబాటి పురందరేశ్వరి ని, వారి కుటుంబ సభ్యులను దగ్గరగా చూసిన వ్యక్తిగా, వారితో ఎంతో అనుబంధం ఉన్న నేపథ్యంలో వారి గురించి స్వయంగా తెలుసు కాబట్టే ఈ విషయాలన్నీ చెప్పగలుగుతున్నాను.

పురందరేశ్వరి కేంద్ర మాజీ మంత్రిగా, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నప్పటికీ ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, కనీసం గన్మెన్లు కూడా లేకుండా నిత్యం ప్రజల్లోనే మమేకమై ఉంటున్నారు.

ప్రస్తుతం చిన్నాచితక నాయకులు కూడా, ఎక్కడికి వెళ్లాలన్న స్పెషల్ ఫ్లైట్లోనే వెళుతున్నారు. కానీ పురందేశ్వరి మాత్రం అవేమి లేకుండా నేటికీ రైళ్లలో కూడా ప్రయాణం చేస్తున్నారు. గత 35 సంవత్సరాలుగా వారు హైదరాబాద్ బంజారాహిల్స్ లో కేవలం 380 గజాలు స్థలంలో నిర్మించిన ఇంటిలోనే నివాసముంటున్నారు. ఎన్టీఆర్ కుమార్తె అయి ఇంతటి సాధారణ వ్యక్తిత్వంతో రాజకీయాల లో మరొకరిని చూడగలమా ..

ఆమె పేరు కూడా ఉచ్చరించడానికి అర్హత లేని కొందరు నాయకులు.. అవాకులు, చవాకులు పేలుతున్న నేపథ్యంలో పురందరేశ్వరి వ్యక్తిత్వాన్ని గురించి ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో ఈ పోస్టు పెడుతున్నాను.

– సందిరెడ్డి కొండలరావు
ఎడిటర్ , గుండ్లకమ్మ – అద్దంకి

LEAVE A RESPONSE