– జూన్ 4,5 తేదీల్లో కడపలో నవసంకల్ప్ చింతన్ శిబిర్”
– ఎపిసిసి ప్రధాన కార్యదర్శి పరసా రాజీవ్ రతన్
విజయవాడ : మత విద్వేషాలతో బీజేపీ రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తోందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పరసా రాజీవ్ రతన్ ఆరోపించారు. ఎనిమిదేళ్ళ బిజెపి పాలన చూస్తే నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ సామాజిక మాధ్యమాల్లో ఏ విధంగా ట్రోల్ అవుతుందో చూస్తున్నామని పరసా రాజీవ్ రతన్ అన్నారు.
మంగళవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 4,5 తేదీల్లో కడపలో “నవసంకల్ప్ చింతన్ శిబిర్” నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల రాజస్థాన్ లో జరిగిన చింతన్ శిబిర్ లో కాంగ్రెస్ పార్టీ వివిధ అంశాలపై చర్చించి కమిటీలు వేశారని, అందులో భాగంగా జూన్ 4, 5 తేదీల్లో కడపలో నవసంకల్ప్ చింతన్ శిబిర్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర విభజన, విభజన హామీలపై మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగిస్తారని వెల్లడించారు. సంక్షేమ ఆంధ్ర ప్రదేశ్ గా చెప్పుకుంటున్న వైకాపా, సంక్షేమం కాదు సంక్షోభ ఆంధ్రోప్రదేశ్ దిశగా వెళ్తుందని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఆగస్ట్ 9 న రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర ప్రారంభిస్తారని, రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలపై మాట తప్పరని, యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేయాలని చూస్తున్నారని వివరించారు.
రైతులకు విద్యుత్ మీటర్లు తొలగించి వారికి సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఏఐసీసీ నియమించిన కమిటీలతో చర్చించి ఆయా విభాగాల్లో ఇంకా ఏమన్నా కార్యక్రమాలు చేపట్టాలో నిర్ణయిస్తామని రాజీవ్ రతన్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పెనుమార్పు ను చూస్తారని తప్పకుండా చెప్పగలమని స్పష్టం చేశారు.