Suryaa.co.in

Telangana

పంతం నెగ్గించుకున్న బీజేపీ

– వెనక్కి తగ్గిన కేసీఆర్ సర్కార్

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ బీజేపీ సికింద్రాబాద్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమం ఆద్యంతం హైడ్రామా మధ్య ముగిసింది. ర్యాలీని అడ్డుకోవాలన్న ప్రభుత్వం చివరి నిమిషంలో తలొగ్గింది. షరతుల ప్రాతిపదికన బీజేపీ దళపతి నద్దా కార్యక్రమానికి అనుమతించాల్సి వచ్చింది. అయితే తాము ర్యాలీ నిర్వహించి తీరతామని బీజేపీ నేతలు పట్టుపట్టారు. ఈ దశలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జోక్యం చేసుకోవడంతో కార్యకర్తలు శాంతించారు. దానితో నద్దా సికింద్రాబాద్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నద్దా హాజరవుతున్నారన్న సమాచారం రావడంతో దాదాపు 2 వేల మంది బీజేపీ కార్యకర్తలు సికింద్రాబాద్ చేరుకున్నారు. దీనితో పోలీసులు ముందుజాగ్రత్తగా వాహనాలు నిలిపివేసి, అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే పంపించారు.

బండి సంజయ్‌ అరెస్టుకు నిరసనగా భాజపా చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. పోలీసులు ర్యాలీకి అనుమతి లేదని హెచ్చరించినా.. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి తీరుతామని, ప్రజాస్వామ్య

హక్కులను ఎవరూ హరించలేరని జేపీ నడ్డా స్పష్టం చేశారు. కమలనాథులు చెప్పినట్టుగానే శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్‌ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ కొనసాగింది.

అనంతరం జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా నేతలు గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా భాజపా శ్రేణులు పెద్ద ఎత్తున సికింద్రాబాద్‌ చేరుకుని, చేతిలో నల్ల జెండాలు, నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. బండి సంజయ్‌ను విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. ప్యారడైజ్‌ కూడలి నుంచి ఎంజీ రోడ్డు వరకు పోలీసులు భారీగా మోహరించారు.

బండి సంజయ్‌ అరెస్టుకు నిరసనగా భాజపా నేతలు నల్లమాస్కులు ధరించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రాజాసింగ్‌, పార్టీ నేతలు వివేక్‌, విజయశాంతి, ప్రేమేందర్‌రెడ్డి, రామచంద్రరావు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాజపా నేతల లక్ష్మణ్‌ మాట్లాడుతూ… ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం సాగిద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బండి సంజయ్‌ అరెస్టుకు నిరసనగా 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. నిరంకుశ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE