Suryaa.co.in

Editorial

ఎన్నికల బరిలోకి బీజేపీ రాజ్యసభ ఎంపీలు

– లోక్‌సభకు పోటీ చేయాలని మోదీ ఆదేశం
– ఒక్కో రాజ్యసభ సభ్యుడిని లోక్‌సభను ఎంచుకోవాలని సూచన
– పార్టీ ఎంపీ ఉన్న చోట మినహాయింపు
– ఎంపీ లేని చోట రాజ్యసభ ఎంపీలకు ప్రాధాన్యం
– విశాఖలో అప్పుడే పని ప్రారంభించిన ఎంపీ జీవీఎల్
– కుల సంఘాలు, ఉత్తరాది వారితో ఆత్మీయ సమావేశాలు
– కేంద్రప్రభుత్వ ఉద్యోగులతో తరచూ సమావేశాలు
– పథకాల అమలుకు బ్యాంకర్లతో భేటీలు
– కిషన్‌రెడ్డి అసెంబ్లీకి పోటీ చేస్తే లోక్‌సభకు లక్ష్మణ్?
– లేకపోతే మరొక లోక్‌సభను ఎంపిక చేసుకోవల్సిందే
– లక్ష్మణ్ పోటీ కూడా అనివార్యమే
– ఇప్పటికే విజయవాడలో సేవాకార్యక్రమాల నిర్వహణలో సుజనా చౌదరి
– నియోజకవర్గాల్లో రైతులకు మిర్చి పరదాల పంపిణీ
– సుజనా ఫౌండేషన్‌తో సేవా కార్యక్రమాలు
– మల్కాజిగిరి నుంచి పోటీకి సిద్ధమవుత్ను గరికపాటి
– వరంగల్ జిల్లా వాసులతో భేటీలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

రానున్న లోక్‌సభ ఎన్నికల బరిలో బీజేపీ రాజ్యసభ సభ్యులను కూడా రంగంలోకి దింపే వ్యూహం సిద్ధమవుతోంది. ఆ మేరకు ప్రధాని మోదీ, రాజ్యసభ సభ్యులకు విస్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ ఎంపీలు ప్రాతినిధ్యం లేని లోక్‌సభ నియోజకవర్గాలను ఎంచుకోవాలని, ప్రధాని మోదీ ఆ మేరకు రాజ్యసభ సభ్యులకు సూచించినట్లు సమాచారం.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం… వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ సభ్యుల ప్రాతినిధ్యం లేని లోక్‌సభ నియోజకవర్గాలలో, రాజ్యసభ సభ్యులను బరిలోకి దింపాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. ప్రధానంగా రెండుసార్లు రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన వారంతా, తప్పనిసరిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని, వారికి మరో అవకాశం ఇవ్వబోమని మోదీ నిర్మొహమాటంగా చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు ప్రధాని మోదీ ఇప్పటికి రెండుసార్లు పార్టీ వైఖరిని, రాజ్యసభ సభ్యులకు స్పష్టం చేసినట్లు తెలిసింది.

ఆ ప్రకారంగా ఆయా రాష్ట్రాల రాజ్యసభ సభ్యులు ఎంపిక చేసుకున్న లోక్‌సభ నియోజకవర్గ వివరాలను, ముందస్తుగా నాయకత్వానికి సమాచారం ఇస్తున్నారు. రాజ్యసభ సమావేశాలు, స్టాండింగ్ కమిటీ భేటీల సమయంలో తప్ప, మిగిలిన సమయాల్లో సదరు రాజ్యసభ సభ్యులు.. తాము ఎంపిక చేసుకున్న లోక్‌సభ నియోజకవర్గాలోనే, పూర్తి స్థాయిలో పనిచేయాలని నాయకత్వం ఆదేశించింది. ఆ మేరకు పలువురు రాజ్యసభ ఎంపీలు, ఈపాటికే తాము ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో క్యాంపు ఆఫీసులు ప్రారంభించారు.

ఆయా లోక్‌సభ పరిథిలోని ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ రాజ్యసభ సభ్యులు.. వివిధ కేంద్రప్రభుత్వ పథకాలను, లబ్థిదారులకు చేరవేసే ప్రణాళిక ప్రారంభిస్తున్నట్లు సమాచారం. ముద్ర సహా ఇతర కేంద్రప్రభుత్వ పథకాలను పార్టీ కార్యకర్తలతోపాటు, నియోజకవర్గంలోని వివిధ తటస్ధ వర్గాలకు అందేలా, బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

వివిధ వర్గాల ప్రజలకు కేంద్రం అందిస్తున్న పథకాల వివరాల కరపత్రాలను, తాము ఎంచుకున్న లోక్‌సభ నియోజకవర్గ పరిథిలో పంపిణీ చేస్తున్నారు. కులసంఘాలతో తరచూ సమావేశమవుతున్నారు.

అందులో భాగంగా విశాఖ లోక్‌సభను ఎంచుకున్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. ఆ మేరకు తన కార్యాచరణ ప్రారంభించారు. ఇప్పటికే అక్కడ నివసిస్తున్న ఆయన, కార్యాలయం కూడా ఏర్పాటుచేసుకున్నారు. ఇటీవలి కాలంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించిన జీవీఎల్.. కేంద్రప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలు చేయకపోతే, పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడం గమనార్హం. ఫలితంగా జీవీఎల్ క్యాంపు ఆఫీసు, లబ్థిదారులు తీసుకువచ్చే దరఖాస్తుదారులతో సందడిగా కనిపిస్తోంది.

కేంద్రప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా నివసించే విశాఖలో.. తరచూ ఆయా ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఉత్తరాది వారి సంఖ్య ఎక్కువగా ఉన్న విశాఖలో, వారి సంఘాలతో నెలకు రెండుసార్లు సమావేశాలు నిర్వహిస్తున్నారు. హిందీపై బాగా పట్టుండటం కూడా ఆయనకు కలసివస్తోంది. బ్రాహ్మణ, యాదవ, వైశ్య, కాళింగ వైశ్య, గవర, తూర్పు కాపు సంఘాలతో ప్రతి నెల సమావేశమయి వారికి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.

లోక్‌సభ నుంచి గెలిచిన విశాఖ వైసీపీ కంటే, రాజ్యసభ ఎంపీగా ఉన్న జీవిఎల్ ఒక్కరే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్న చర్చ తీసుకువచ్చే పరిస్థితి ఏర్పడింది. అంటే దీని ప్రకారం.. గెలుపు-ఓటములను పక్కనబెడితే, రాజ్యసభ ఎంపీలను లోక్‌సభకు పోటీ చేయించాలన్న మోదీ వ్యూహం ఫలిస్తున్నటే కనిపిస్తోంది.

ఏపీ నుంచి జీవీఎల్, తెలంగాణ నుంచి డాక్టర్ లక్ష్మణ్ రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మోదీ ఆదేశాల ప్రకారం.. తెలంగాణలో లక్ష్మణ్ కూడా లోక్‌సభకు పోటీ చేసి తీరాలి. అయితే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వైఖరి బట్టి, లక్ష్మణ్ నిర్ణయం ఆధారపడి ఉంటుంది.

కిషన్‌రెడ్డి ఒకవేళ మళ్లీ సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి పోటీ చేస్తే, లక్ష్మణ్ మరొక లోక్‌సభ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. కిషన్‌రెడ్డి అంబర్‌పేట అసెంబ్లీ నుంచి పోటీ చేస్తే, లక్ష్మణ్ సికింద్రాబాద్ లోక్‌సభకు పోటీ చేయడం అనివార్యంగా కనిపిస్తోంది.

అటు రాజ్యసభ మాజీ ఎంపి, కేంద్రమాజీ మంత్రి సుజనాచౌదరి కూడా విజయవాడ లోక్‌సభను ఎంపిక చేసుకున్నట్లు కనిపిస్తోంది. అయిత ఆయన ప్రధానంగా సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తుండటం విశేషం. కరోనా కాలంలో రోగులకు ఉచిత సేవలందించడంతోపాటు, తన పంక్షన్ హాల్‌ను క్వారంటైన్ సెంటర్‌గా మార్చారు. విజయవాడ లోక్‌సభ పరిధిలోని పలువురు నాయకులు, ఆయనతో ఈపాటికే టచ్‌లో ఉన్నారు.

జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ నియోజకవర్గాల్లో రైతులకు మిర్చి పరదాలు, స్కూలు పిల్లలకు నోట్‌బుక్, హెల్త్‌క్యాంప్స్‌లో మందులు.. తన ఫౌండేషన్ నుంచి పంపిణీ చేస్తున్నారు. విజయవాడ లోక్‌సభ పరిథిలో సొంత సామాజికవర్గ బలం ఎక్కువగా ఉండటం, వివాదరహితుడైనందున అన్ని వర్గాలతో సత్సంబంధాలుండటం, సుజనాకు ప్లస్‌పాయింట్‌గా చెప్పవచ్చు. టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసినందున.. రైతు, కార్మిక, వ్యాపార, ఉద్యోగ వర్గాలతో ఉన్న సంబంధాలు కూడా సుజనాకు కలసివచ్చే అంశమే. సుజనా తన రాజ్యసభ ఎంపీ ఫండ్స్‌ను, కృష్ణా జిల్లా అభివృద్ధికే కేటాయించిన విషయం తెలిసిందే.

ఇక ఇటీవల రిటైరైన రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, మల్కాజిగిరి లోక్‌సభను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా వాసులు ఎక్కువ సంఖ్యలో ఉండ టం.. సొంత సామాజికవర్గ సంఖ్య కూడా పెద్ద సంఖ్యలోనే ఉండటం.. టీడీపీలో ఉన్నప్పుడు నేతలతో ఉన్న సత్సంబంధాలు, ఆయనకు కలసివచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి.

LEAVE A RESPONSE