Suryaa.co.in

Andhra Pradesh

రక్త దానం .. ప్రాణదానం

ప్రపంచ రక్త దాతల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని ప్రజలకు రక్తం విలువని తెలపాలనే ఉద్దేశంతో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఏటా జూన్‌14న నిర్వహిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి చెందినా మనిషి స్వతహాగా ఇప్పటి వరకు తయారు చేయలేని పదార్థాలలో రక్తం ఒకటి. మనదేశంలో ఏటా సుమారు ఐదు కోట్ల యూనిట్ల రక్తం అవసరమవుతుందని అంచనా.

కానీ రక్త దాతల నుంచి అందుబాటు అవుతున్నది మాత్రం దాదాపు 50 లక్షల యూనిట్లు మాత్రమే. రక్తదానం మీద ప్రచార కార్యక్రమాలు ఎంత చేపట్టినా రక్తదాతలలో వస్తున్న స్పందన మాత్రం సరిపోయినంత లేదన్నది ఒక వాస్తవం. ఒక వ్యక్తి చేసే రక్తదానం నాలుగు ప్రాణాలు కాపాడుతుంది. రక్తం మరియు ప్లాస్మా స్వచ్ఛంద దానం యొక్క క్లిష్టమైన అవసరం మరియు రోగుల జీవితాలపై వాటి ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. కొత్త వ్యక్తులను మరియు ఇప్పటికే ఉన్న దాతలను క్రమం తప్పకుండా రక్తాన్ని అందించమని ప్రోత్సహించాలి.

ఇది తగినంత రక్తాన్ని నిలువ ఉంచటంలో సహాయపడుతుంది. రక్తం ఇవ్వగానే దానిని వివిధ భాగాలుగా విభజిస్తారు. దాత నుంచి సేకరించే రక్తాన్ని హోల్ బ్లడ్ అంటారు. ఆ రక్తంలో ప్లాస్మా, ప్లేట్లెట్స్, తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాలు ఉంటాయి. వీటిని విడదీసి నలుగురికి ఈ రక్తాన్ని ఎక్కించవచ్చు. రక్తదాత నుంచి ప్లేట్లెట్స్ను, ప్లాస్మాలను విడదీయగల సాంకేతిక పరిజ్ఞానం నేడు అందుబాటులోకి వచ్చింది. ఒక వ్యక్తి ప్రతి మూడు నెలలకు ఒకసారి సాధారణ రక్తదానం చేయవచ్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ కానీ, ప్లాస్మానుగానీ దానం చేయవచ్చు. ఇబ్బందేమీ ఉండదు.

రక్తదానం చేస్తే భావిజీవితంలో కోలుకోలేని ఇబ్బందులు వస్తాయని చాలామంది ప్రజలు భయపడుతుంటారు. వాస్తవానికి రక్తదానంతో ఎలాంటి ఇబ్బందులూ రావు. రక్తదానం తరువాత రెండు మూడు గంటల్లో యథావిధిగా అన్నిరకాల పనులూ చక్కగా చేసుకోవచ్చు. రక్తదానానికి ముందు పరీక్షలు చేసి పూర్తి ఆరోగ్యవంతులని, సరిపోయినంత రక్తం ఉందని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే రక్తం తీసుకుంటారు. రక్తదానం తర్వాత ఆరు వారాల లోపు ఆ వ్యక్తిలో పూర్తిస్థాయిలో కొత్తరక్తం తయారవుతుంది. ఎలాంటి రక్తహీనత ఏర్పడదు. ఆధారంగా నిర్ణయించబడుతుంది.

సాధారణ మానవ శరీరం దాదాపు ఐదు లీటర్ల రక్తాన్ని కలిగి ఉంటుంది. ఒక్కసారి రక్త దానం చేసినప్పుడు మన శరీర బరువుని బట్టి 350ఎంఎల్ నుండి 450ఎంఎల్ రక్తం వరకూ తీసుకుంటారు.రక్తదానం ఎవరు చేయొచ్చు అంటే, 18-65 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు; బరువు 50 కిలోల పైన ఉన్నవారు; బిపి అదుపులో ఉన్నవారు; తీవ్రమైన వ్యాధులు, మూర్ఛ, మూత్రపిండ వ్యాధులు, అలర్జీ, అసాధారణ రక్తస్రావ లక్షణాలు, త్వరితగతిగా బరువు కోల్పోవటం, హృదయ సంబంధమైన వ్యాధులు, ఇతర ప్రమాదకరమైన వ్యాధులు ఇదివరకుగానీ ప్రస్తుతం గానీ లేకుండా ఉన్నవారు; రక్తపోటు, గుండె సంకోచించినప్పుడు (సిస్టాలిక్) 100-180 మి.మీ. వరకు, గుండె వ్యాకోచించినప్పుడు (డయాస్టాలిక్) 50-100 మి.మీ. వరకు ఉన్నవారు; హీమోగ్లోబిన్ 100మి.లీ. రక్తంలో 12.5 గ్రాముల కంటే ఎక్కువగా ఉన్నవారు ఇవ్వవచ్చు. 18 ఏళ్ల నుంచి క్రమం తప్పక రక్తదానం చేయగలిగితే, జీవిత కాలంలో దాదాపు 168 సార్లు రక్తదానం చేయవచ్చు.

గర్భవతులు; ప్రసవానంతరం ఆరు నెలల వరకు, బిడ్డకు పాలిచ్చినంత కాలం; బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం జరిగే పరిస్థితుల్లో స్త్రీలు; టీకాలు వేసుకున్న రెండు వారాల లోపు; జంతువుల కాట్లకు గురైన ఏడాది లోపు; టిటానస్ (ధనుర్వాతం), డిప్తీరియా (కంఠవాపు), గ్యాస్ గ్యాంగ్రీన్ కోసం మందులు వాడినవారు, ఆఖరి మోతాదు (డోస్) మందులు వాడిన నాలుగునెలల వరకు; గడచిన ఏడాది కాలంలోపు పచ్చకామెర్లు వ్యాధి ఉన్నవారు, ధూమపానం, మద్యపానం సేవించిన వాళ్ళు రక్తదానం చేయకూడదు. అలాగే మీరు తీసుకుంటున్న లేదా ఇటీవల తీసుకున్న ఏవైనా మందులు రక్తదానం చేయకుండా మిమ్మల్ని నిరోధిస్తాయో లేదో డాక్టరుకు చూపించి తనిఖీ చేయించుకోవాలి.

ఇన్సులిన్పై ఉన్న మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నవారు, క్యాన్సర్ శస్త్రచికిత్స చేయించుకున్నవారు, గుండెపోటుకు గురైనవారు, మూర్ఛవ్యాధి ఉన్నవారు, ఎయిడ్స్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, సిఫిలిస్ లాంటి అంటువ్యాధులు ఉన్నవారు, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నవారు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నవారు ఎప్పుడూ రక్తదానం చేయకూడదు.

ఈ రోజుల్లో రక్తదానం చేస్తామని ముందుకు వచ్చే వారి సంఖ్య తగ్గుతూ ఉంది. జనాభాలో చాలా తక్కువ మంది మాత్రమే ముందుకు వస్తున్నారు. ఇలా సరఫరా ఒకపక్క తగ్గిపోతుంటే మరొక పక్క రక్తం యొక్క డిమాండ్ పెరిగి పోతోంది. కృత్రిమంగా రక్తం తయారుచేయడానికి అనేక ప్రయోగాలు జరుగుతున్నా అవేవీ ఇంతవరకు సఫలీకృతం కాలేదు. ఈ సమస్యకు ప్రస్తుతం ఉన్న ఏకైక పరిష్కారం రక్తదానమే !

దానం చేసిన ప్లేట్లెట్స్ను ఐదు రోజులలోపు ఉపయోగించాలి. ఎర్ర రక్త కణాలను సేకరించిన తేదీ నుండి 42 రోజులలోపు ఉపయోగించాలి. ప్లాస్మా, క్రయోప్రెసిపిటేట్ వంటి రక్త ఉత్పత్తులను ఘనీభవించిన స్థితిలో నిల్వ చేస్తారు. ఈ ఉత్పత్తులను ఒక ఏడాది వరకు ఉపయోగించవచ్చు. రక్త దాతలు మరియు రక్తం కావలసిన వాళ్ళు విశాఖపట్నం లో ఉన్న లయన్స్ బ్లడ్ సెంటర్ (బ్యాంక్) ను సంప్రదించవచ్చు.

మన దగ్గర్లో రక్తం అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వం e- RaktKosh (www.eraktkosh.in) అని వెబ్సైట్ ఏర్పాటు చేసింది. అందులో ఏ బ్లడ్ గ్రూపు రక్తం ఎంత అందుబాటులో ఉంది, అందుబాటులో ఉంటే ఎన్ని యూనిట్లు ఉన్నాయి.. అనే వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. “రక్తదానం చేద్దాం, ఆశలను కల్పిద్దాం: కలిసి ప్రాణాలను కాపాడుదాం”.

ఆచార్య వెలగపూడి ఉమామహేశ్వరరావు
– మాజీ రిజిస్ట్రార్, ఆంధ్ర విశ్వవిద్యాలయం,
లయన్స్ జిల్లా గవర్నర్ (2000-2001), మేనేజింగ్ ట్రస్టీ, లయన్స్ కాన్సర్ మరియు జనరల్ హాస్పిటల్
విశాఖపట్నం.

LEAVE A RESPONSE