– పోలీసులు ఇకనైనా రాజ్యాంగ బద్దంగా నడుచుకోవాలి
– పోలీసులు ఇకనైనా బుద్ధితెచ్చుకోవాలి. చట్టప్రకారం వారి అంతుతేలుస్తాం
– చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే న్యాయస్థానాల్లో వారి పనిపడతాం
– గుంటూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల వైయస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధుల సదస్సు అనంతరం గుంటూరులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు
గుంటూరు: సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుది అక్రమ అరెస్ట్ అంటూ సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పుతో అయినా సీఎం చంద్రబాబు కళ్ళు తెరవాలని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు హితవు పలికారు.
గుంటూరులో లీగల్ సెల్ ప్రతినిధుల సదస్సు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మెప్పుకోసం రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్న పోలీసులు మరోసారి తమ పనితీరుపై ఆలోచన చేయాలని అన్నారు. ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించే వారిని న్యాయస్థానాల్లో నిలబెడతామని హెచ్చరించారు.
కృష్ణంరాజు అనే ఎనలిస్ట్ చేసిన వ్యాఖ్యలకు బాధ్యుడిని చేస్తూ నిజాయితీపరుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు మీద కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. లోయర్ కోర్టులో బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. కానీ ఈ కేసు సుప్రీంకోర్టులో నిలబడలేదు. కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇది చంద్రబాబు నియంత వైఖరికి చెంపపెట్టులాంటిది.
కొమ్మినేనిని అరెస్ట్ చేసిన విధానం నుంచి ఆయన మీద నమోదు చేసిన కేసుల వరకు అన్నింట్లోనూ పోలీసులకు కోర్టు మొట్టికాయలు వేసింది. నవ్వితేనే అరెస్ట్ చేస్తారా అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నించారంటే ఎంత దుర్మార్గంగా పోలీసులు అరెస్టులు చేస్తున్నారని చెప్పడానికి వేరే ఉదాహరణలు అవసరం లేదు. సాక్షిలో పనిచేస్తున్నాడన్న కారణంతోనే ఆయన మీద అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు పగ సాధిస్తున్నాడు.
చేతిలో లాఠీ ఉంది కదా అని తెనాలిలో యువకులను నడిరోడ్డు మీదకి తీసుకొచ్చి కొట్టి హింసించారు. వారు ఏదైనా తప్పు చేసి ఉంటే శిక్షించే పని న్యాయస్థానాలు చూసుకుంటాయి. అది కూడా పోలీసులే చేస్తామంటే ఎలా? ఖాకీ చొక్కాలు తొడుక్కుని చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతో చట్టాలను యథేచ్చగా ఉల్లంఘిస్తున్న పోలీసులు ఇకనైనా బుద్ధితెచ్చుకోవాలి. చట్టప్రకారం వారి అంతుతేలుస్తాం. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఎంతోకాలం సాగవు.