– రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావుకు ఏసీబీ మరోసారి నోటీసులు ఇవ్వడాన్ని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. ఏసీబీ అధికారులు గతంలో ఒకసారి కేటీఆర్ ను సుదీర్ఘంగా విచారించి ఏమీ తేల్చలేకపోయిన సందర్భాన్ని ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు.
ఫార్ములా-ఈ రేస్ సజావుగా సాగిందని, ఇందులో ఎలాంటి అక్రమాలు జరుగకున్నా, ఎటువంటి అవినీతి చోటుచేసుకోకున్నా కేటీఆర్ ను విచారించడం చట్ట వ్యతిరేకమని ఎంపీ రవిచంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక హామీలను అమలుచేయలేక ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇటువంటి కుయుక్తులు పన్నుతున్నదని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేస్ నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నగరానికి ప్రత్యేక పేరు ఖ్యాతి లభించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడానికి దోహదపడిందని ఎంపీ వద్దిరాజు వివరించారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే వారిపై అధికార పక్షం అక్రమ కేసులు బనాయిస్తూ, కక్షపూరిత రాజకీయాలకు పాల్పడడాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ఎంపీ రవిచంద్ర చెప్పారు. ఇటువంటి కుట్రలు, కుయుక్తులకు బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడబోరని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు.