* ప్రజల పక్షాన కాంగ్రెస్‌ను నిలదీస్తేనే ఇలా నోటీసులు
* డైవర్షన్ పాలిటిక్స్ క తెరలేపిన కాంగ్రెస్
* ఫార్ములా -ఈ రేసుల వల్ల పెరిగిన హైదరాబాద్ ఖ్యాతి
* ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వ సంస్థల వినియోగం
* తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్
హైదరాబాద్: పరిపాలనలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ కావాలనే ప్రతిపక్ష నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించి విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మండిపడ్డారు. ఫార్ములా – ఈ రేసు కేసులో మళ్లీ కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్ సర్కార్ 18నెలలుగా రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారెంటీలు ఇంకా అమలు కాలేవని వాటిని ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ మీద ఇలా రాజకీయ కక్ష్యలో భాగంగా నోటీసులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సర్కార్ కు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారని తెలిపారు.
పదే పదే కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకొని నోటీసులు ఇవ్వడం పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేసిన చర్య అని దుయ్యబట్టారు. ఇది రాజకీయంగా వేధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకున్న మార్గమన్నారు. ఫార్ములా – ఈ రేసు వంటి గ్లోబెల్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించి నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టిన ఘనత కేటీఆర్‌కు దక్కుతుందన్నారు.
ఈనెల 20-21 తేదిల్లో ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో జరుగనున్న ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం నిర్వహించే సదస్సులో ముఖ్యవక్తగా కేటీఆర్‌ను ఆహ్వానించడంతో రేవంత్ రెడ్డికి కండ్లు మండుతున్నాయని దుయ్యబట్టారు. అందుకే ఇలా నోటీసులు పేరుతో రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు.
ఫార్ములా -ఈ రేసు మీద దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వారు హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రపంచ అందాల పోటీలకు రాష్ట్ర ఖజానా నుంచి రూ. 300 కోట్లు ఖర్చుపెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఈవెంట్ వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనమని అడిగారు.