Suryaa.co.in

Telangana

తెలంగాణ వాటా కుదించి ఏపికి ఇచ్చిందే బీఆర్‌ఎస్

– మచ్చుమర్రి, మాల్యల ప్రాజెక్టులకు నీటిని తరలిస్తుంటే అడ్డుకోని బీఆర్‌ఎస్
– హరీష్‌రావు ఆరోపణలన్నీ మీడియా ప్రచారం కోసమే
– బనకచర్ల ప్రాజెక్టుపై తీవ్రంగా స్పందించిందే కాంగ్రెస్ ప్రభుత్వం
-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్: బనకచర్ల-గోదావరి ప్రాజెక్టును గట్టిగా ప్రతి ఘటించిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిధుల కోసం రాసిన లేఖపై తాను జనవరి 22 న రాసిన లేఖను ఆయన ఉటంకించారు

అధికారికంగా ఉన్న అభ్యంతరాలను లేవ నెత్తుతూనే జూన్ 13 నాటి పి.ఎఫ్.ఆర్ లను తిరస్కరించడంతో పాటు డి.పి.ఆర్ ప్రతిపాదనలను నివారించి టెండర్ల ను రద్దు చేయాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం న్యాయ పోరాటానికి సన్నద్ధంగా ఉందన్నారు

తెలంగాణా నీటి హక్కుల అంశంలో నాటీ బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఉదాసీనత తో ఉండడంతో నీటి కేటాయింపులలో మన హక్కులకు భంగం వాటిల్లిందన్నారు. వాస్తవానికి కృష్ణా జలాశయాలలో తెలంగాణా వాటా 724 ఉండగా 290 టి యం సీలకు కుదించి 512 టి.యం.సి ల నీటిని ఆంధ్రప్రదేశ్ కు అప్పగించిన ఘనత బి.ఆర్.ఎస్ పాలకులదన్నారు.

అదే ఈ రోజు రాష్ట్రంలో నీటి సంక్షోభానికి కేంద్ర బిందువుగా మారిందని ఆయన విరుచుకుపడ్డారు. మచ్చుమర్రి,మాల్యల ప్రాజెక్టులకు అక్రమంగా నీటిని తరలిస్తుంటే బి ఆర్ ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పధకం టెండర్ల ప్రక్రియ సాగుతుంటే నాటి ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ ను ఎందుకు ఆశ్రయించ లేదన్నారు. నాటి ఆంధ్రప్రదేశ్-తెలంగాణ ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్ మోహన్ రెడ్డి ల నిర్వకమే ఇందుకు కారణమన్నారు.

LEAVE A RESPONSE