రాష్ట్రంలోని సమస్యల గురించి పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీని ప్రశ్నిస్తే ఆ ఎంపీల ఇంటికి ఈడీ, సిబిఐలను పంపిస్తారనే భయం నేటి వైసీపీ ఎంపీలకు కలుగుతోందని రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. అవనిగడ్డలో జరిగిన టీడీపీ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రం నుంచి వైసీపీ కోట్లకు పడగలెత్తిన వారికి సీట్లు ఇచ్చి గెలిపించుకోవటంతో వారెవ్వరూ నేడు కేంద్రాన్ని ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. టీడీపీ, ఎన్టీఆర్ ఏనాడూ ఇలాంటి కుబేరులకు టికెట్లు ఇవ్వలేదన్నారు. సామాన్యులకు టికెట్లు ఇచ్చి గెలిపించిన పార్టీ టీడీపీ అన్నారు. నేడు ధనబలం లేకుండా ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేకపోవడం విచారకరం అన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ఉండే వారు కూడా నేడు ఎన్నికల్లో ధనబలం లేకపోతే గెలిచే పరిస్థితి లేదన్నారు.
గత ఎన్నికల్లో పార్టీకి దూరమైన వర్గాలకు చేరువై ఈసారి ఎన్నికల్లో గెలిచేందుకు కృషి చేద్దామన్నారు.