జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు సయ్యద్ షాహెజాది
అమరావతి, డిశంబరు 10: మైనారిటీల బడ్జెట్ ను మైనారిటీల సంక్షేమానికే వినియోగించాలని, ఇతర పథకాల అమలుకై ఆ నిధులను దారి మళ్లించ కూడదని జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు శ్రీమతి సయ్యద్ షాహెజాది అన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం రాష్ట్రంలో ప్రధాన మంత్రి కొత్త 15 పాయింట్ల కార్యక్రమం అమలు తీరును సమీక్షించేందుకు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర స్థాయి సమావేశం ఆమె అద్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి కొత్త 15 పాయింట్ల కార్యక్రమాన్ని కేంద్ర అమలు పరుస్తున్నదని, ఈ పథకాన్నిరాష్ట్రంలో పటిష్టంగా అమలు పర్చాలని లైన్ డిపార్టుమెంట్ అధికారులను ఆమె ఆదేశించారు.
మైనారిటీల ఆర్థిక పరిస్థితులను మెరుగు పర్చేందుకు పెద్ద ఎత్తున ఎంఎస్ఎమ్ఇ లను పెట్టుకునేలా వారిని ప్రోత్సహించాలన్నారు. మైనారిటీల్లో బాల కార్మికులు ఎక్కువగా ఉంటారని, అటు వంటి విధానాన్ని ప్రోత్సహించే వ్యక్తులు, సంస్థలపై పెద్ద ఎత్తున కేసులు పెట్టాలన్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మైనారిటీ యువతులు యుక్తవయస్సులోనే గర్భధారణ ఎక్కువ ఉంటుందనే విషయాన్ని ఆమె తెలుసుకుని, ఇటు వంటివి పునరావృతం కాకుండా వారిలో సరైన అవగాహన కల్పించాలని, అందుకు అవసరమైన అవగాహన కార్యక్రమాలను ఆషా, ఆరోగ్య కార్యకర్తలతో నిర్వహించాలని అధికారులకు ఆమె సూచించారు. ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం క్రింద చేపట్టిన పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, వసతి గృహాల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు.
అదే విధంగా ప్రధాన మంత్రి కొత్త 15 పాయింట్ల కార్యక్రమం అమల్లో భాగంగా మైనారిటీలకు విద్య అవకాశాలను మెరుపర్చాలని, ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధిలో సమాన వాటా కల్పించాలని, మైనారిటీల జీవన స్థితిగతులను మెరుగుపరచడంతో పాటు మతపరమైన అల్లర్ల నివారణ & నియంత్రణకు పటిష్టమైన చర్యలను చేపట్టాలని అధికారులకు ఆమె సూచించారు.
ఇతరులతో సమానంగా ICDS సేవలు మైనారిటీలకు కూడా లభ్యం అయ్యేలా చూడాలని, పాఠశాల విద్యను అందుబాటులోకి తేవాలని, ఉర్దూ భాషను బోధించడానికి ఎక్కువ అవకాశాలను కల్పించాలని, మదర్సా విద్యను ఆధునీకరించాలని, మైనారిటీ వర్గాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేయాలని మరియు మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా విద్యా మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని ఆదేశించారు. పే
దలకు స్వయం ఉపాధి మరియు వేతన ఉపాధి కల్పించాలని, సాంకేతిక శిక్షణ ద్వారా నైపుణ్యాలను పెంపొందించాలని, ఆర్థిక కార్యకలాపాలకు మెరుగైన క్రెడిట్ మద్దతును కల్పించాలని, రాష్ట్ర మరియు కేంద్ర సర్వీసులకు నిర్వహించే రిక్రూట్మెంటుల్లో మైనారిటీలు కూడా పెద్ద ఎత్తున పోటీపడే విధంగా ప్రోత్సహిస్తూ శిక్షణా అవకాశలు కల్పించాలని సూచించారు. గ్రామీణ గృహనిర్మాణ పథకంలో సమానమైన వాటా కల్పించాలని, మైనారిటీ వర్గాల వారు నివసించే మురికివాడల పరిస్థితిని మెరుగుపర్చాలని, మతపరమైన ఘర్షణలను నివారించాలని, మతపరమైన నేరాలకు ప్రాసిక్యూషన్ చేయాలని, మత అల్లర్ల బాధితులకు పునరావాసం కల్పించాలని అధికారులకు ఆమె సూచించారు.
తొలుత రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ చిత్తూరి శ్రీధర్ మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమం కోసం రాష్ట్రంలో అమలు చేయబడుచున్న పలు పథకాల ప్రగతిని పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు శ్రీమతి సయ్యద్ షాహెజాది కి వివరించారు. అదే విధంగా లైన్ డిపార్టుమెంట్లు అమలు పర్చే కార్యక్రమాల వివరాలను సంబందిత శాఖల అధికారులు ఆమెకు వివరించారు.
రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి కె.హర్షవర్థన్, వక్ఫ్ సర్వే కమిషనర్ షేక్ షరీన్ బేగమ్, మైనారిటీస్ ఫైనాస్సు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ యాకూబ్ బాషా, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ప్రతినిధి మెహ్మద్ ఆలీ, రాష్ట్ర ఉర్థూ అకాడమీ డైరెక్టర్ డా.మెహ్మద్ మస్తాన్, రాష్ట్ర మైనారిటీస్ కమిషన్ సెక్రటరీ నిజాఉద్దీన్, రాష్ట్ర నూర్ భాషా, దూదేకుల కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌస్పీర్, రాష్ట్ర క్రిష్టియన్ ఫైనాన్సు కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ తదితరులతో పాటు లైన్ డిపార్టుమెంట్ అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.