Suryaa.co.in

Andhra Pradesh

ఎమ్మెల్సీలుగా హరిప్రసాద్, సీఆర్

– జనసేనకు ఒకటి కేటాయించిన బాబు
– నమ్ముకున్న హరిప్రసాద్‌కు న్యాయం చేసిన పవన్
– పూర్వాశ్రమంలో జర్నలిస్టుగా పనిచేసిన హరిప్రసాద్
– ఎమ్మెల్సీగా అనర్హత వేటు పడ్డ రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ
– పిఠాపురం వర్మ, బీద, మంతెన, జంగా, ఇక్బాల్‌కు నిరాశ

అమరావతి: శాసనమండలిలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీలను సీఎం చంద్రబాబునాయుడు భర్తీ చేశారు. ఆ మేరకు ఎన్నికలముందు పార్టీలో చేరిన సి.రామచంద్రయ్య, జనసేనాధిపతి పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్‌ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీరిద్దరూ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ఎమ్మెల్సీ ఎంపికలో చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీలలో ఒకటి జనసేనకు కేటాయించారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా.. ఎన్నికల ముందు పార్టీలో చేరిన సి.రామచంద్రయ్యను ప్రకటించారు. రాజీనామా చేయకుండా టీడీపీలో చేరిన ఆయనపై శాసనమండలి చైర్మన్ అనర్హత వేటు వేయగా, ఆయనతోపాటు వైసీపీలో చేరిన మరో ఎమ్మెల్సీ ఇక్బాల్ మాత్రం తన పదవికి రాజీనామా చేసి, టీడీపీలో చేరారు. ఇప్పుడు రామచంద్రయ్యకు సీటు ఇవ్వడం చర్చనీయాంశమయింది. అయితే పార్టీలో చేరి అనర్హతకు గురైనందున, ఆయనకు తిరిగి ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా న్యాయం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నిజానికి గత ఎన్నికల్లో సమన్వయకర్తలుగా పనిచేసిన బీదా రవిచంద్రయాదవ్, మంతెన సత్యనారాయణరాజు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన జంగాకృష్ణమూర్తి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మలో.. ఇద్దరికి ఎమ్మెల్సీ సీట్లు ఇస్తారని పార్టీ వర్గాలు భావించాయి. పవన్ గెలుపు కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన వర్మకు, ఎమ్మెల్సీ ఇస్తారన్న హామీ లభించిందన్న చర్చ కూడా అప్పట్లో వినిపించింది. ఇక టీడీఎల్పీ ఇన్చార్జి కోనేరు సురేష్ కూడా ఎమ్మెల్సీ సీటు అభ్యర్ధించారు.

కాగా జనసేన స్థాపించిన నాటి నుంచి.. వెంట ఉన్న తన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా, పవన్ కల్యాణ్ ఆయనకు న్యాయం చేశారు. పూర్వాశ్రమంలో జర్నలిస్టు అయిన హరిప్రసాద్, జనసేన మీడియా వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా.. తనను నమ్ముకున్న వారికి పవన్ న్యాయం చేస్తారని రుజువు చేశారని, జనసేన వర్గాలు వ్యాఖ్యానించారు. హరిప్రసాద్ కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందని, పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాగా హరిప్రసాద్ ప్రవేశంతో జనసేన తొలిసారి శాసనమండలిలో అడుగుపెడుతున్నట్టయింది.

LEAVE A RESPONSE