– వైయస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
రాజమహేంద్రవరం: వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే, చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ పేదలకు ఇంటి కోసం సెంటు స్థలం కూడా కేటాయించిన పాపాన పోలేదని వైయస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వ హయాంలో 72 వేల ఎకరాలు సేకరించి, వాటిలో 17 వేల కాలనీల్లో పూర్తి మౌలిక వసతులతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని, అందు కోసం ఏకంగా రూ.1.27 లక్షల కోట్లు ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు.
వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోందని ఊరూరా తిరిగి తప్పుడు ప్రచారం చేశారు. రాష్ట్రం అప్పులపై కూటమి నాయకులంతా కలిసిమెలిసి ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. తాను అధికారంలోకి వస్తే 40 ఏళ్ల అనుభవంతో సంపద సృష్టించి రాష్ట్రాన్ని గాడిలో పెడతానని చంద్రబాబు నమ్మబలికాడు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పుకుని.. తీరా అధికారంలోకి వచ్చాక బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ అనేలా పాలన సాగిస్తున్నాడు. ఇప్పటికే కరెంట్ బిల్లుల రూపంలో ప్రజలపై రూ.19 వేల కోట్ల భారం మోపాడు.
రాష్ట్రం అప్పులు రూ. 14 లక్షల కోట్లని చెబుతూనే చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలిచ్చారు. ఈరోజు వాస్తవ అప్పులు రూ. 4.6 లక్షల కోట్లే అని తెలిసినా హామీలు అమలు చేయలేక చేతులెత్తేయడం ఆయన అసమర్థతకు నిదర్శనం. తాజాగా ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువలు 50 శాతం పెంచబోతున్నట్టు ప్రకటించారు. ఆదాయార్జనే ధ్యేయంగా ప్రజల నడ్డి విరచడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది.