( మార్తి సుబ్రహ్మణ్యం)
అవయవదానం ద్వారా మనిషి మరణించినా జీవించవచ్చని చెబుతుంటారు. కానీ కనుమూసేవరకూ వామపక్ష భావజాలాన్ని నరనరానా జీర్ణించుకుని, కడపటి సమయంలో కాంగ్రెస్‌తో దోస్తానా చేసిన ప్రజాగాయకుడు గద్దర్ మాత్రం.. అవయవదానం చేయకుండానే ప్రజల్లో జీవిస్తున్నారు. తూప్రాన్ బిడ్డ గుమ్మడి విఠల్‌రావు అనే గద్దర్‌కు, కేంద్రం పద్మ అవార్డు ఇవ్వకపోవడంతో జరుగుతున్న గత్తరే దానికి కారణం.
పద్మ అవార్డుకు తాము గద్దర్ పేరు సిఫార్సు చేసినప్పటికీ, కేంద్రం తమ సిఫార్సును బుట్టదాఖలు చేసిందన్నది సీఎం రేవంత్-డిప్యూటీ సీఎం మల్లు, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేస్తున్న వాదన. పరేడ్‌గ్రౌండ్‌లో ప్రధాని సభకు గద్దర్ హాజరుకాలేదా? ఆయనను మోదీ పొగడలేదా? గద్దర్ బీజేపీ నేతలను ఆలింగనం చేసుకోలేదా? నక్సలిజం నా అజెండా అని ప్రకటించిన ఈటలను ఎలా పార్టీ చేర్చుకున్నారు? ఇప్పుడు ఆ వామపక్ష భావజాల ఈటలకు, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎలా ఇవ్వబోతున్నారు? బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలున్న వారికే అవార్డులు ఇస్తారా? అని ఎంపి చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలసి, టిఎస్‌పిసిసి దళపతి మహేష్ కడిగిపారేశారు.
అయితే ‘‘వామపక్ష తీవ్రవాది అయిన గద్దర్ పీపుల్స్‌వార్‌లో ఉండగా, అనేకమంది పోలీసులను, బీజేపీ- ఏబీవీపీ కార్యకర్తలను, చివరకు కాంగ్రెస్‌లో పనిచేసిన స్పీకర్ శ్రీపాదరావు, అప్పట్లో కాంగ్రెస్‌లోనే ఉన్న డికె అరుణ తండ్రి చిట్టెం నర్శిరెడ్డి, టీడీపీ నేత ఎలిమినేటి మాధవరెడ్డితోపాటు, ఎంతోమంది బీజేపీ-ఏబీవీపీ కార్యకర్తలను మర్డర్ చేయించి పాటలుపాడిన వ్యక్తికి ఎట్లిస్తమన్న అవార్డు? బరాబర్ ఇయ్యం. అనేకమంది పోలీసులను ఎన్‌కౌంటర్‌లో చంపించిన గద్దరుకు ఎట్లిస్తమన్న? ఇచ్చేదేలే. అసలు ఆయన భావజాలమేంది? నక్సల్ భావజాలం ఉన్న ఆయనకు అవార్డు ఇవ్వమని కాంగ్రెస్ ఎట్ల అడుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన వారందరికీ కేంద్రం అవార్డులు ఇయ్యాలని రూలేమీ లేదు. మేము బరాబర్ చెబుతున్నం. గద్దర్‌కు అవార్డు ఇచ్చేదేలే. దీనిమీద ఎక్కడిదాకానయినా కొట్లాడతాం. అయినా నక్సల్స్ భావజాలం ఉండి, నక్సలైట్లతో కలసి పనిచేసిన గద్దర్ పేరు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా సిఫార్సు చేస్తుంది’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ సీఎం రేవంత్ సర్కారుపై అంతే ఘాటుగా ఒంటికాలితో లేచారు. దీనితో గద్దరన్న కేంద్రంగా రాజకీయ గత్తరకు తెరలేచింది.
నిజానికి గద్దరన్న పేరు 80-2000 దశకాల్లో మార్మోగిపోయేది. ఆయన పాటకు యువతరం ఉర్రూతలూగేది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో.. చదువుకుని ఉద్యోగాలు రాని యువకులు డజన్ల మంది, కేవలం ఆయన పాటలకే ఆకర్షితులై పీపుల్స్‌వార్‌లో చేరడం అతిశయోక్తికాదు. ఆ రకంగా వేలాదిమంది యువత, ప్రధానంగా పీజీలు చేసి గోల్డ్‌మెడల్స్ అందుకున్న నిరుద్యోగ యువత, అడవిబాట పట్టేందుకు గద్దరన్న వంటి ఒకరిద్దరు స్ఫూర్తిప్రదాతన్నది మనం మనుషులం అన్నంత నిజం.
ఆ విధంగా తమ మాట-పాటలతో వేలాదిమందిని ఆ ర్షితులను చేసి.. ఉద్యమబాట పట్టించిన వామపక్ష నేత గద్దరయినా, మరొక బీసీ, ఇంకో దళిత నేత అయినా.. తమ వారసులను మాత్రం అదే ఉద్యమాలకు దూరంగా ఉంచి, ఉన్నత చదువులకోసం పక్క రాష్ట్రాలు, పరాయి దేశాలకు పంపించడమే ఆశ్చర్యం. ఇది ఎప్పటికీ సజీవంగా ఉండే చర్చనే. దాని గురించి ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై.. సదరు ఉద్యమ నేతలు కన్నెర్ర చేసి, వారిని ఉద్యమ వ్యతిరేక శక్తులుగా చూపిన సందర్భాలు కోకొల్లలు.
రాజకీయ నేతల వారసులు రాజకీయ నాయకులుగా..సినిమా యాక్టర్ల వారసులు సినిమా యాక్టర్లుగా.. డాక్టర్ల వారసులు డాక్టర్లుగా.. పోలీసు అధికారుల వారసులు పోలీసులుగా.. ఏఐఎస్ అధికారుల వారసులు ఐఏఎస్‌లుగా మారుతున్నప్పుడు.. ఉద్యమకారుల వారసులు, ఉద్యమకారులుగా ఎందుకు మారరు? వారంతా తమ వారసులను.. తమతో పాటు ఉద్యమాల్లోకి ఎందుకు తీసుకురారన్న ప్రశ్నలకు, ఇప్పటివరకూ సమాధానం దొరకడం లేదు. దొరకదు కూడా. గట్టిగా నిలదీస్తే మా ఇష్టాలు, భావజాలాన్ని వారిపై బలవంతంగా రుద్దలేము కదా అని తప్పించుకుంటారేమో?! అది వేరే విషయం.
ఇది చాలా ఏళ్ల క్రితం ముచ్చట. నేను విద్యార్ధిగా ఆర్‌ఎస్‌యులో పనిచేస్తున్న రోజుల్లో, సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఒక గ్రామంలో ఆ ఊరు కరణంగారింట్లో రహస్య శిక్షణ శిబిరాలు జరిగేవి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్‌ఎస్‌యు విద్యార్ధులకు ఒక్కోసారి ఆయన ఇంట్లో, ఒక్కోసారి ఆయన పొలంలో క్లాసులు జరిగేవి. అప్పట్లో ప్రపంచ బ్యాంకు విధానాలపై తీవ్ర వ్యతిరేకత ఉండేది.
నాగార్జునసాగర్ వద్ద అణువిద్యుత్ కేంద్రం ప్రతిపాదనపై వ్యతిరేకత నెలకొంది. నిర్బంధాలు, ఎన్‌కౌంటర్లు ఉధృతంగా జరుగుతున్న కాలమది. వాటికి వ్యతిరేకంగా ఏపీసీఎల్‌సి న్యాయపోరాటం చేసేది. హెబియస్‌కార్పస్ పిటిషన్లు వేయడం ద్వారా, తమ అదుపులో ఉన్న పీపుల్స్‌వార్, ఆర్‌ఎస్‌యు కార్యకర్తలను పోలీసులు అనివార్యంగా అరెస్టు చూపి, కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అనివార్య పరిస్థితి.అలా చాలామంది ఎన్‌కౌంటర్ పేరుతో చనిపోకుండా, పౌరహక్కుల సంఘాల్లోని లాయర్లు కాపాడేవారు.
ఆ సందర్భంలో నిర్వహించిన క్లాసులలో రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజా సమీకరణ, ప్రజాఉద్యమ నిర్మాణాలు, మైదానప్రాంతాల్లో ఉంటూ పీపుల్స్‌వార్‌కు సహకరించే మేధావులు, లాయర్లతో కలసి విద్యార్ధి ఉద్యమాల నిర్మాణం, దానికోసం అనుసరించాల్సిన ఎత్తుగడ వివరించేవారు. గతితార్కిక భౌతిక వాదం, ప్రపంచ బ్యాంకు సంస్కరణలతో ప్రజలకు వచ్చే నష్టాల గురించి కూలంకషంగా చర్చించేవారు. వీటన్నింటికంటే పాటలు పాడేవారిని, రాసేవారిని, ఉద్వేగపూరితంగా ప్రసంగించేవారిని తయారుచేసి ప్రోత్సహించేవారు.
ఆరకంగా అందరూ రాత్రి వేళ కాలేజీ హాస్టళ్లకు వెళ్లి, ప్రభుత్వ ప్రజా-విద్యార్ధి వ్యతిరేక విధానాలకు వ్యతిరేంగా ప్రసంగించేవారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గోడపత్రికలు కార్డుబోర్డు పేపర్‌పై రాసి, కాలేజీ నోటీసు బోర్డులు, టీస్టాళ్ల వద్ద అతికించేవారు. గ్రామాలకు తరలండి నినాదంతో విద్యార్ధులను గ్రామాలకు పంపించేవారు. ఆ తర్వాత వారిని పీపుల్స్‌వార్ వివిధ స్థాయిలో రిక్రూట్ చేసేది.
ఆ శిక్షణ శిబిరానికి హాజరయిన సందర్భంలో, గద్దరన్న ఆ కరణం గారింట్లో ప్రత్యక్షమవడం మాలాంటి యువకులలో ఉత్సాహం నింపింది. ఆ సందర్భంలో గద్దరన్న.. రాజ్య లక్షణాలు, పోలీసుల దురాగతాలు, తండాల్లో తాగునీరు లేక తల్లడిల్లుతున్న గిరిజనుల దుస్థితి, రాజకీయ నాయకుల అవినీతి, కాంట్రాక్టులు, సారా డిపోల మూసివేత అవసరం, నిరక్షాస్యత నిర్మూలన, పల్లెల్లో అగ్రుకులాల దాష్టీకంపై అనర్గళంగా చేసిన ప్రసంగం గుండెల్లో నాటుకుపోయింది. ఈ సమస్యలకు పోరాటం ఒక్కటే మార్గమని, అందుకోసం త్యాగాలకు సిద్ధంగా ఉండాలని, కుటుంబం కంటే ప్రజలే ముఖ్యమని నూరిపోస్తూ పాడిన పాటలు, విపరీత ప్రభావం చూపాయి.
ఆ తర్వాత కాలంలో వారిలో నాలాంటి ఒకరిద్దరు మినహా, మిగిలిన వారంతా పీపుల్స్‌వార్‌లో చేరినవారే. వారిలో చాలామంది ఎన్‌కౌంటర్లలోనో, అనారోగ్యంతోనో మృతి చెందగా, అతి తక్కువమంది లొంగిపోయారు. తర్వాతికాలంలో నేను హైదరాబాద్‌లో స్ధిరపడి, ఆంధ్రభూమిలో విలేకరిగా పనిచేస్తున్న సందర్భంలోనే, అంబర్‌పేటలో మధుసూదన్‌రాజ్ ఎన్‌కౌంటర్ జరిగింగి.
ఆయన శవాన్ని పోస్టుమార్టమ్ కోసం గాంధీ మార్చురీకి తీసుకువచ్చారు. ఆ సందర్భంలో అక్కడికి వచ్చిన గద్దర్, ఎస్‌ఐబిలో ఉన్న ఐపిఎస్ అధికారిణి అనూరాధతో వాగ్వాదానికి దిగారు. ఎన్‌కౌంటర్ గురించి మీడియాకు వివరించారు. రిపోర్టింగ్ కోసం అక్కడకు వెళ్లిన నేను.. ఆయనను పరిచయం చేసుకుని, గతంలో ఆయన హాజరైన శిక్షణా శిబిరం గురించి గుర్తు చేసి, నేను ఫలానా పేపరులో జర్నలిస్టుగా పనిచేస్తున్నానని చెప్పినప్పుడు.. ఆప్యాయంగా నా భుజం తట్టిన సందర్భం నాకు ఇప్పటికీ గుర్తే. ‘గద్దర్ యాది’లో.. ఇవన్నీ ఒక సింహావలోకనం మాత్రమే.
అయితే ఆ తర్వాత కాలంలో పీపుల్స్‌వార్‌లో లంపెన్‌గ్రూపులు చేరడం, పార్టీ అనేక గ్రూపులుగా విడిపోయి సెటిల్‌మెంట్లకు కేంద్రంగా మారటం, గ్రామాల్లో తలిదండ్రులపై అలిగిన వారు సైతం లక్ష్యం లేకుండా, దళాల్లో చేరడంతో అసలు లక్ష్యం దెబ్బతింది. త్యాగం చేసేవారి సంఖ్య తగ్గిపోవడం, యువకులు ఐటి, ఉద్యోగాల వైపు మళ్లుతున్న ఫలితంగా కొత్త రిక్రూట్లమెంట్లు లేకుండా పోయాయి. ఉన్నా చేరేవారే లేకుండా పోయారు.
ఉన్న సీనియరు మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో తలవాల్చడం, బతికున్న మరికొంతమంది కామ్రేడ్లు అనారోగ్యం బారినపడి లొంగిపోతున్న కారణంగా, మావోయిస్టు ఉద్యమం కోలుకోలేనంత దారుణంగా బలహీనపడింది. అంకితభావం కొరవడి, లక్ష్యంలో స్పష్టత లేనప్పుడు ఫలితాలు కూడా అందుకు భిన్నంగా ఉండవు. ఆ కథ వేరు.
సహజంగా పోలీసు కేసులుంటే వారికి ఉద్యోగం ఇవ్వరు. పోలీస్ వెరిఫికేషన్‌లో కేసులున్నట్లు తేలితే, వారికి ఎంతలావు సిఫార్సులున్నా ఉద్యోగాలు రావు. తెలంగాణ ఉద్యమంలో రోడ్డెక్కి కేసులపాలయిన యువకుల పరిస్థితే దానికి ఓ ఉదాహరణ. మరి అలాంటిది, వందలమంది పోలీసులు.. రాజకీయ నాయకులను నిర్దయగా చంపిన మావోలకు బహిరంగ మద్దతు ప్రకటించి, ప్రభుత్వానికి దొరకకుండా పదేళ్లు అజ్ఞాతవాసం చేసిన గద్దర్‌కు ఏకంగా, ఏ కోణంలో పద్మ అవార్డు ఎలా ఇస్తారన్న ప్రశ్నలు కొట్టిపారేయలేం.
రేవంత్‌రెడ్డి సర్కారుకు మొహమాటమో, ఆయనపై ప్రేమ ఉన్నందున గద్దరు పేరు సిఫార్సు చేసిన మాత్రాన.. అవార్డు ఇచ్చేయాలా అన్న రైటిస్టుల ప్రశ్నలో తప్పేమీలేదు. మరి అయోధ్యను దగ్గరుండి కూలగొట్టిన వారికి అవార్డులు ఎలా ఇస్తారు? గద్దరును మీరు మాత్రం కౌగిలించుకోలేదా అన్న లెఫ్టిస్టుల ప్రశ్న కూడా కొట్టిపారేయలేం. ఎవరి వాదన వారిది. ఎవరి కోణం వారిది.
ఇదంతా పక్కనపెడితే, న క్సల్స్ మద్దతుదారైన గద్దర్‌కు, పద్మ అవార్డు ఇవ్వాలని రేవంత్ చేసిన సిఫారసుతోపాటు, ఆయన పేరుతో సినిమా అవార్డులివ్వాలన్న నిర్ణయాన్ని.. అప్పట్లో నక్సల్స్ దాడిలో హత్యకు గురైన మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు తనయుడు, ఇప్పుడు రేవంత్ మంత్రివర్గంలోనే కీలక స్థానంలో ఉన్న శ్రీధర్‌బాబు ఆమోదించారా? లేదా? అన్నదే ప్రశ్న. గద్దర్‌కు ఎందుకు అవార్డు ఇవ్వలేదన్న కాంగీయుల డిమాండ్‌పై శ్రీధర్‌బాబు స్పందిస్తే బాగుండేది. ఎందుకంటే అసలైన బాధితుడు ఆయనే కాబట్టి!
అసలు నక్సల్స్ దాడుల్లో తలవాల్చిన తమ సహచరుల మరణాలకు కారకులైన వారికి బహిరంగ మద్దతుదారైన గద్దర్‌కు.. అవార్డు సిఫార్సు చేయడాన్ని పోలీసు అధికారుల సంఘాలు కానీ, పోలీసు అధికారులు గానీ చేయెత్తి జైకొడతారా? రేవంత్ సర్కారు బహుబాగైన నిర్ణయం తీసుకుందని ఖాకీవనంండుమనసుతో, నిబిడాశ్చర్యంతో చప్పట్లు కొడుతుందా? అడవి అన్నల తుపాకి గర్జనకు నేలకూలిన కెఎస్ వ్యాస్, పరదేశీనాయుడు, ఉమేష్‌చంద్ర వంటి ఐపీఎస్ ఆత్మలు రేవంత్ సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఆనందతాండవం చేస్తాయా?
ఉమ్మడి రాష్ట్రంలో తొలి ల్యాండ్‌మైన్ పేలుడు కేంద్రమైన ఏటూరినాగారంలో, తలవాల్చిన సాధారణ పోలీసుల కుటుంబాలు గద్దర్‌కు అవార్డు సిఫార్సుతో ఎగిరి గంతేస్తాయా? అప్పట్లో పీపుల్స్‌వార్ దాడిలో చనిపోయిన అనేకమంది కాంగ్రెస్ నేతల వారసులు, ఇప్పుడు సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తారా? లేదా? అన్నదే ప్రశ్న.
పోనీ నిజంగా రేవంత్ సర్కారు పద్మాలకు సిఫారసు చేసినవారంతా, ఇప్పుడే భూమ్మీదకు వచ్చినవారు కాదు. వారికి ఆయా రంగాల్లో దశాబ్దాల చరిత్ర ఉంది. మరి యుపీఏ పదేళ్ల పాలనలో, కాంగ్రెస్ పాలకులు వారి పేర్లు ఎందుకు సిఫార్సు చేయలేదు? వైఎస్ జమానాలో నక్సల్స్‌తో చర్చలు జరిపినప్పుడే, గద్దర్‌కు అవార్డు ఇస్తే పోయేది కదా అన్న రైటిస్టుల ప్రశ్నకు బదులిచ్చేదెవరు?
ఎలాగూ పోలీసులు-రాజకీయ నేతలను, జమిలిగా మట్టుబెట్టిన అడవి అన్నలకు బహిరంగ మద్దతుపలికిన గద్దర్‌కు పద్మ అవార్డు సిఫారసు చేసినట్లుగానే.. అప్పట్లో నక్సల్స్‌కు మద్దతుగా పనిచేసి, సర్కారుకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసు వేసిన బాలగోపాల్, కన్నభిరాన్, వరవరరావు, హరగోపాల్ వంటి పౌరహక్కుల నేతలకూ అదే చేత్తో అవార్డులు సిఫార్సు చేయవచ్చు కదా? వారు చేసిన పాపమేమిటి? అసలు నక్సల్స్‌కు వారు చేసిన తక్కువేమిటన్నది పౌరసమాజం సంధిస్తున వ్యంగ్యాస్త్రం.
మాది గాంధీ పరివార్ అయితే మీది గాడ్సే పరివార్.. అంటూ ఇండోర్ వేదికగా కాషాయపార్టీని రేవంత్ దునుమాడారు. బాగానే ఉంది. అంటే అహింసామూర్తి అయిన గాంధీతాతను, హింసాయుత ప్రవృతిగల గాడ్సే చంపారని, సదరు గాడ్సేను భాజపేయులు కొలుస్తారన్నది రేవంత్ కవిహృదయం. మరి అదే అసింసామూర్తి ఉన్న గాంధీ పరివార్‌కు, తెలంగాణ రాష్ట్రంలో నాయకత్వం వహిస్తున్న రేవంత్.. హింసే సిద్ధాంతంగా ఉన్న నక్సల్స్ ప్రతినిధి అయిన గద్దర్‌కు, పద్మ అవార్డు ఇవ్వాలని ఎలా సిఫారసు చేశారన్నది ఇప్పుడు కాషాయగళధారుల ప్రశ్న. నిజమే కదా మరి?!
కేంద్రం ప్రకటించిన అవార్డుల ప్రహసనం పరిశీలిస్తే.. తమకు అక్కరకు వచ్చేవారిని పురస్కారంతో ప్రతిఫలం తీర్చుకున్నట్లే ఉంది. గతంలో పద్మ అవార్డులకు విపరీతమైన వడపోత జరిగేది. లబ్ధప్రతిష్ఠులు, వివాదరహితులకు మాత్రమే ఇచ్చే అవార్డులు.. రాను రాను పార్టీల కోణంలోనో, భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాలకో వేదికగా మారిందన్న పౌరసమాజం ఆవేదనను తప్పుపట్టాల్సిన పనిలేదు.
కాంగ్రెస్ జమానాలో వామపక్ష మేధావులకు అవార్డులు దక్కగా, కాషాయం హయాంలో జాతీయవాద భావాలున్న వారికి అవి దక్కుతుండటం రివాజుగా మారింది. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఈమధ్యన అది మరో మెట్టెక్కి.. రాజకీయ అడుగులు దిశగా పయనిస్తుండటం, అవార్డులకు ఏమాత్రం శోభనీయదు.