– నల్లగొండ మళ్లీ రాష్ట్రంలో రైతుల తిరుగుబాటుకు వేదిక కావాలి.
– నల్లగొండ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నాలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్ జోష్
నల్లగొండ: పట్టణంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నా విజయవంతమైంది. ఈ మహాధర్నాకు హాజరైన ముఖ్య అతిథులు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ లు కోటిరెడ్డి, మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీ లు పాల్గొన్నారు. కేటీఆర్‌కు ఎన్జీజీ కాలేజీ నుంచి ఘన స్వాగతం అందించి ర్యాలీగా క్లాక్ టవర్‌కు తీసుకువెళ్లారు. నల్లగొండ పట్టణం కిక్కిరిసిపోయి, రోడ్లన్నీ ట్రాఫిక్‌తో నిండిపోయాయి.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏమన్నారంటే.. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బ్రహ్మాండంగా వసతులుండేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కష్టాలు ఎక్కువయ్యాయి. పోరాటాల పురిటి గడ్డ నల్లగొండ మళ్లీ రాష్ట్రంలో రైతుల తిరుగుబాటుకు వేదిక కావాలి. కేసీఆర్ పాలనలో టింగ్ టింగ్ మని డబ్బులు ఖాతాలో పడేవి. ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతులను నిలువునా మోసం చేస్తున్నారు.
కేసీఆర్ 2 పంటలకే ఇస్తుండు.. కానీ రేవంత్‌రెడ్డి మూడో పంటకు ఇస్తా అని మోసం చేస్తున్నారు. జనవరి 26న రా.12 గంటలకు డబ్బులు వేస్తామని రేవంత్ అన్నారు కానీ ఇప్పటివరకు రూపాయి పడలేదు. రుణమాఫీ, రైతుబంధు, బోనస్ అన్నీ భోగస్ అని పేర్కొన్నారు. నల్లగొండ బిడ్డలు జీవశ్చవాలుగా మారడానికి కాంగ్రెస్ కారణం.
కాంగ్రెస్ ప్రభుత్వం 2023 యాసంగి పంటకు 2,500 బాకీ పెట్టిందని, వానాకాలం ఒక్కో ఎకరానికి 7,500 బాకీ ఉన్నదని వివరించారు. ఒక్కో రైతుకు ఎకరాకు రూ.17,500 బాకీ ఉన్నది. కాంగ్రెస్ రైతులను నిలువునా మోసం చేసింది. రైతుబంధు డబ్బులు ఆపడానికి రేవంత్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారు.
మార్చి 31 వరకూ రుణమాఫీ కొనసాగుతుందని చెబుతున్నారు కానీ ఏ సంవత్సరమో చెప్పడం లేదు. నల్లగొండ నుంచి కాంగ్రెస్ వ్యతిరేక పోరాటం ప్రారంభం: కాంగ్రెసోళ్లు మళ్లీ ఓట్ల కోసం వస్తారు. నిలదీయండి. నల్లగొండ నుండే కాంగ్రెస్‌ను చీల్చి చెండాడాలి. హైకోర్టు ధర్నాకు అనుమతిచ్చినందుకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.మా పోరాటం న్యాయంగా కొనసాగుతుంది. న్యాయం ఇంకా బ్రతికే ఉంది.