Suryaa.co.in

Political News

ఏమీ ‘పీకే’యించలేరేమో?

షర్మిల వస్తే వైసీపీ ఓట్లే పట్టుకుపోతారు
టీడీపీ-జనసేన వైసీపీ వ్యతిరేక ఓట్లే తీసుకుంటాయి
వాలంటీర్లు ఉన్నా టీడీపీ-జనసేన సభలు ఎందుకు హిట్టవుతున్నట్లు?
అంటే జనం వాలంటీర్లను లెక్కచేయడం లేదా?

సర్వే జనా సుఖినోభవంతు…!
‘సర్వే’ జనా సుఖినోభవంతు…’ అంటే….,’ ఓ సర్వేలు చేసే ఓ జనులారా…. ఏవో నాలుగు అంకెలు కెలికి, ఓ నాలుగు భవనాలు సంపాదించుకుని, సుఖం గా ఉండడానికి ఇదే సమయం… తండ్రులూ ‘అని అర్ధం.
ఓ పక్కన ఎన్నికల సీజన్ తరుముకు వస్తోంది . ఇది మిస్ అయితే, మళ్లీ అయిదేళ్ల వరకు పలకరించే నాధుడు ఉండరు.

ఈ ‘సర్వే’ జనం అధికార పక్షాలకూ కావాలి, ప్రతిపక్షాలకూ కావాలి. పోటీ చేయడానికి పార్టీ టికెట్ వచ్చిన వాళ్ళకూ కావాలి, టికెట్ రాని వాళ్ళకూ (రెబెల్ అభ్యర్థి గా పోటీ చేయడానికి )కావాలి. ఈ ‘సర్వే’ తో ఇదివరకు ‘పీకే’సిన వాళ్ళు, వరుస కుదిరితే, మళ్లీ ‘పీకే’ద్దాం అనుకునేవారికి ఇదో సువర్ణావకాశం.

‘సర్వే’శ్వర రావులకు సర్వేల్లో స్పెషలైజేషన్ ఏమీ అవసరం లేదు. కొంచెం రాజకీయ ‘కనెక్షన్ లు,కొంచెం స్మార్ట్ నెస్,.. కొంచెం మాటకారితనం ఉంటే చాలు. రాజకీయ వ్యాపారులు ఎగబడతారు.

ఎందుకంటే, వీరికి తమపైన తమకు నమ్మకం ఉండదు. ఓటర్లు తమ గురించి ఏమనుకుంటున్నారో తెలియదు. టికెట్ తమకు ఇస్తే,తమ నియోజక వర్గం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. కిందటి సారి ఏవేవో వాగ్దానాలు చేశారు … గట్టెక్కేశారు .. మళ్లీ ఇప్పుడు ఏంటి పరిస్థితి? ”మన కులపోళ్ళ మూడ్ ఎలా ఉంది? ఎగస్పార్టీ నా కొడుక్కూడా సేమ్ క్యాస్ట్ కదా…. అదీ ప్రాబ్లెమ్” వంటి ఆలోచనల్తో సతమత మవుతూ ఉంటారు.

‘సర్వే’ అనగానే…. జనం మైండ్ మీద ఎంతో కొంత ఇంపాక్ట్ పడుతుంది. ‘సర్వే ‘ చేయించా. మనకే పరిస్థితి అనుకూలంగా ఉంది…’ అని చెప్పని నాయకుడు ఉండడు.

‘టైమ్స్ నౌ ‘ అనే ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ మొన్న ఒకే సర్వే అంటూ… జనాన్ని బాగా బెదరేసింది. ఏ పీ నుంచి లోకసభ కు గల 25 స్థానాలలో 25 కి 25, లేదా 24 స్థానాలు వైసీపీ కి వస్తాయని చెప్పింది. దాంతో, వైసీపీ అనుకూల సాంఘికాసాంఘిక మీడియా రెచ్చిపోయింది. వైసీపీ అనుకూల విశ్లేషకులు విరుచుకు పడిపోయారు. తెలుగుదేశం కూటమి కి ఒక్క సీటు కూడా రాదు పొమ్మన్నారు. రెండూ రోజులపాటు ఊపేశారు.

అయితే, అది ‘టైమ్స్ నౌ’ సొంతంగా చేసిన సర్వే కాదంట.

‘ విదుర కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ‘ అనే సంస్థకు చెందిన ఈటీజీ రీసెర్చ్ అనే ఏజెన్సీ తయారు చేసిన ‘సర్వే ‘ ను.. ‘టైమ్స్ నౌ ‘ తన స్వంత సర్వే అన్నంత బిల్డ్ అప్ తో ప్రసారం చేసింది. ఈ ‘ విదుర కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ‘ అనే సంస్థ – ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం లో పని చేసే అవినాష్ అనే ఒక ముఖ్య ప్రముఖునికి చెందినదని ‘ గ్రేట్ ఆంధ్ర’ అనే, జగన్ వీరానుకూల వెబ్ సైట్ పేర్కొన్నది. ఈ విషయం బాగా ప్రచారం లోకి రావడంతో, ఆ సర్వే విశ్వసనీయత ఒక్కసారిగా పేలిపోయింది.

అదే సమయం లో వైసీపీ ఎం. పీ రఘు రామకృష్ణ రాజు ఇంకో సర్వే బయటకు తీశారు. దాని ప్రకారం – 25 లోకసభ స్థానాలలోనూ వైసీపీ కి కడప, రాజంపేట,అరకు లోకసభ స్థానాలలో మాత్రమే అనుకూలత ఉన్నదని అంకెలు చెబుతున్నాయి. మరో మూడు, నాలుగు స్థానాల్లో….’ టైట్ ఫైట్ ‘ అని ; మిగిలిన 18,19 స్థానాల్లో టీడీపీ – జనసేన కూటమి దే ఆధిక్యత అని రఘురామరాజు తేల్చారు.

ఈ లెక్కన, వైసీపీ కి పాతిక ఎం ఎల్ ఏ స్థానాలే అని ఆయన అంటున్నారు. ఈ అంకెలన్నీ….’ సర్వే ‘ ల పుణ్యమే.

వచ్చే ఎన్నికల్లో విజయానికి…. ఆధారపడుతున్న అనేక అంశాలలో ఈ ‘సర్వే’ లు కూడా ఒకటి అనడానికి ఈ ‘ టైమ్స్ నౌ ‘ సర్వే ప్రచార తీరు ఒక ఉదాహరణ. ఈ సర్వే చిట్కా లు తేలిపోతున్నాయి.

వాలంటీరు వ్యవస్థ తమను వచ్చే ఎన్నికల వైతరిణి ని దాటిస్తుందని, వైసీపీ నేతలు కొందరు నేతలు గట్టి నమ్మకం పెట్టుకున్నట్టు కనబడుతున్నది. కానీ ; ఆ వ్యవస్థ బాగా అల్లరై పోతున్నది. హత్యలు, మాన భంగాలు, మోసాలు, దొంగతనాలు,వివాహిత మహిళల ను లేపుకు పోవడాలవంటి ఘటనలు, వాలంటీర్ వ్యవస్థ పరువును బజారులో పడేశాయి.

వాలంటీర్ కనపడుతుంటే… ఆడంగులను ఎక్కడ ఏమి చేస్తారో అని మగంగులు బిక్కు బిక్కు మంటున్నారు. దీనితో, ఆ వ్యవస్థ పట్ల సమాజం లో బాగా చిన్న చూపు ఏర్పడింది. చివరకు, ఈ వ్యవస్థ…. అధికార పక్షానికి ఏ మేరకు ఉపయోగ పడుతుందో తెలియడం లేదు.

వాలెంటీర్ వ్యవస్థ పై ప్రజలలో ఏర్పడుతున్న వ్యతిరేకత, అసలుకే ఎసరు పెట్టవచ్చునని అంచనా వేసేవారు కూడా లేకపోలేదు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సభలకు అంతలేసి జనం రావడం అంటే…. జనం పై వాలంటీర్ల పట్టు రోజు రోజు కూ పలుచనై పోతున్నట్టుగానే అంచనా వేయవచ్చునని ఒక విశ్లేషకుడు అభిప్రాయ పడ్డారు.

రాష్ట్రం లోని ప్రతి 50 గృహాలకూ ఒక వాలంటీర్ ఉంటే…., వారు చిత్తశుద్ధి తో ‘పని’ చేస్తూ ఉంటే….; ప్రతిపక్ష నేతల సభలకు వెళ్ళ వద్దని సహజం గానే చెబుతారు కదా! మరి వారి సభలకు జనం పోటెత్తుతున్నారు అంటే…. వాలంటీర్లు పని చేయడం లేదా? అన్న సందేహం కలగక మానదు.

లేకపోతే వెళ్ళవద్దని వారు చెప్పినా జనం ఖాతరు చేయడం లేదా? ఈ మీటింగ్ లకే ఖాతరు చేయని జనం…; పోలింగ్ రోజున ఏం ఖాతరు చేస్తారు? పోలింగ్ రోజున వాలంటీర్ల మాట చెల్లక పోతే…. వాళ్ళను ఇంతకాలమూ ఎందుకు పోషించినట్టు? పైగా ఆ వాలంటీర్ వ్యవస్థ లో ఇంకో ట్విస్ట్ ఉంది.

‘ ధర్మజుడు తన్నోడి… నన్నోడెనా?- నన్నోడి… తన్నోడెనా? ‘ అని ద్రౌపది – దుశ్శాసుడిని నిలదీసినట్టు, వాలంటీర్లు ప్రైవేట్ వ్యక్తులా…. లేక ప్రభుత్వ ఉద్యోగులా అనేది తేలడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులైతే, నియామకాలు ఏ ప్రాతిపదికన చేశారు? రిజర్వేషన్లు అమలు చేయలేదే? అయిదు వేలు జీతం ఏమిటి? వారి కి ఇంక్రిమెంట్లు, సెలవులు, ప్రమోషన్లు, ఇతర ప్రయోజనాలు ఎందుకు వర్తింప చేయడం లేదనే ప్రశ్నలు తల ఎత్తుతాయి.

వారు స్వచ్ఛంద సేవకులే అయితే, వారికి ప్రభుత్వ ఖజానా నుంచి నెలకు రెండు వందల కోట్లకు పైబడి, వేతనాల రూపం లో చెల్లించడం ఏమిటి అనే ప్రశ్న ఉండనే ఉంది. దీనిమీద వైసీపీ నుంచి స్పష్టత లేదు.
లక్షల సంఖ్య లో వాలంటీర్లు ఉన్నప్పటికీ, ప్రతిపక్ష నేతల సభలకు జనం విరగబడడం…. అధికార పక్షానికి మంచి శకునం కాదు.

మొన్న జరిగిన పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఉప ఎన్నికల్లో టీడీపీ కి సగానికి సగం రావడం…. అధికార పక్షానికి మంచి శకునం కాదు.

ప్రభుత్వం పై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చేసే ‘నిశిత’ విమర్శలకు కౌంటర్ లు ఇవ్వడానికి.. వైసీపీ పార్టీ – పేర్నినాని, కొడాలి నాని, అంబటి రాంబాబు , గుడివాడ అమరనాధ్, రోజా వంటి నేతల పైనే ఆధారపడడం పట్ల కూడా – జనం లో అంత సానుకూలత వ్యక్తం కావడం లేదు.

వారు జనం లోకి వెళ్లి మాట్లాడుతుంటే … వీరు మైక్రోఫోన్ ల ముందు మాట్లాడుతున్నారు. ఒక జన సమూహం లోకి వెళ్లి మాట్టాడే పరిస్థితి వైసీపీలో కనపడడం లేదు . ముఖ్యమంత్రి పదవికి ఉండే సవాలక్ష భద్రతా పరిమితుల దృష్ట్యా… జగన్ జనంలోకి స్వేచ్ఛగా వెళ్ళలేరు. ఆ స్థాయి మరొక నాయకుడికి ఉన్నట్టు కనపడదు . ప్రతిపక్ష నేతలు రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తుంటే ; వైసీపీ లో తమ తమ నియోజక వర్గాల్లో పాదయాత్రో…. వాహన యాత్రో చేసేవారు కూడా కనపడడం లేదు. వైసీపీకి ఇదో ప్రతి బంధకం.

ఇక,వైసీపీ మీద ప్రేమతోనో…, స్వార్ధం తోనో…అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ దొంగోట్లు చేర్పించినట్టు… సాక్ష్యాలు, రుజువులతో సహా బయటపడి పోతున్నది. దానితో, అధికారుల సస్పెన్షన్ లు మొదలయ్యాయి. అనంతపురం జిల్లా పరిషత్ సీఈఓ భాస్కర రెడ్డి, ఆయన కంటే ముందు ఆ ఉద్యోగం లో ఉన్న ఓ మహిళా అధికారిని జగన్ ప్రభుత్వమే సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ లు ముందు ముందు ఇంకా ఊపందుకుంటాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, ఢిల్లీ లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను ఈ పని మీదే కలవబోతున్నారు కూడా. ఈ దొంగ ఓట్ల తతంగం అనేది స్థానిక వైసీపీ నేతల ప్రోద్బలం మీద, స్థానిక అధికారులే నడుం బిగించారో లేక.. ఎవరైనా పెద్దల ఆదేశాల మేరకు చేపట్టారో తెలియదు గానీ…, ఆపకీర్తి మాత్రం వైసీపీ కి చుట్టుకున్నది.

మామూలుగా గెలవ లేక, దొంగోట్ల చేర్పుడు మీద వైసీపీ ఆధారపడిందనే ప్రచారం మాత్రం జనం లోకి వెళ్ళింది. ఈ ప్రచారాన్ని వైసీపీ నేతలు ఎవరూ ఖండించడం లేదు. దొంగోట్లు వైసీపీ ప్రతిష్ఠ కు ఇదో ఎదురు దెబ్బ అనుకుంటే ; ‘ఎదురు దెబ్బ’ లకు కొరత ఏమీ కనపడడం లేదు.

అమరావతి లో నిమిషాల మీద ‘పేదల’కని, ఓ యాభై వేల ఇళ్ళు కడదామని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. ముఖ్యమంత్రి శంకుస్థాపన కూడా చేశారు. ఈ నిర్మాణాల మీద హై కోర్టు స్టే ఇచ్చింది. ఈ స్టే ని కూడా ప్రభుత్వ ప్రతిష్ఠ కు భంగకరం గా పలువురు వ్యాఖ్యానించారు.

వీటికి తోడు, వై. ఎస్. జగన్ సోదరి షర్మిల ఎపిసోడ్ ఒకటి ఉంది. ఆంధ్రకూ తన సోదరుడు ఉన్నందున, తెలంగాణ సంగతి చూద్దామని ఆమె అనుకున్నారు. తెలంగాణలో బాగానే శ్రమ పడ్డారు. అయితే, ఇప్పుడు ఆమె కాంగ్రెస్ లో ‘విలీనం ‘ అయిపోయి ; ఆంధ్ర రాజకీయాలలోకి వస్తారంటూ వార్తలు వెలువడుతున్నాయి.

అలా జరిగితే, వైసీపీ ప్రభుత్వానికి అదో అదనపు తలనొప్పి. ఆంధ్ర లో కూడా ఆమె ఓ మూడు వేల కిలోమీటర్లు రెండోసారి నడిచినా నడిచేస్తారు. చంద్రబాబు – పవన్ కళ్యాణ్ కూటమి – జగన్ వ్యతిరేక ఓటే పట్టుకు పోతారు. షర్మిల అయితే…. జగన్ అనుకూల ఓటే పట్టుకు పోతారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటితమైన మరు క్షణం… ప్రభుత్వ యంత్రాంగం కేంద్ర ఎన్నికల సంఘం నియంత్రణ లోకి వెళ్ళిపోతుంది. ఏయే అధికారులను, పోలీసులను ఎన్నికల విధుల నుంచి తొలగించాలో జాబితాలు తయారు చేసుకుని, తెలుగుదేశం నాయకులు సిద్ధం గా ఉన్నారు. ఇలా, ఒకదాని తరువాత ఒకటి గా ఎదురవుతున్న ప్రతికూల శకునాల మధ్య…. అధికార పక్షం నేతలు….’ టైమ్స్ నౌ ‘ తరహా సర్వేల పై ఎక్కువ ఆధార పడుతున్నారని విమర్శకులు అంటున్నారు.

అందుకే, ‘ సర్వే ‘ జనా సుఖినో భవంతు… అనేది. అయితే, ఇక్కడో గమ్మత్తు ఉంది. ‘పీకే’ద్దామానుకునే సర్వేశ్వర్రావులతో.. ఏదో ‘పీకే’యిద్దామనుకుంటే, చివరకు ఏమీ ‘పీకే’ యించ లేకపోవచ్చు. జనం తెలివి మీరి పోయారు , మరి!

భోగాది వేంకట రాయుడు
bhogadirayudu2152@gmail. com

LEAVE A RESPONSE