Suryaa.co.in

Andhra Pradesh

గ్రావెల్‌ దోపిడీని అడ్డుకుంటే మా పై కేసులా?.. సర్కారుకు సిగ్గుందా?

-2200 కోట్ల విలువైన గ్రావెల్ ను దోచేసిన పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్య
-పొన్నూరు మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్

రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు కిలారు వెంకట రోశయ్య రూ. 2200 కోట్ల విలువైన గ్రావెల్ ను దోచారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొన్నూరు మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు.

పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని చేబ్రోలు మండలం శేకూరు, వీరనాయకుని పాలెం, శెలపాడు,వేజెండ్ల, సుద్దపల్లి,చేబ్రోలు, వడ్లమూడి సమీప గ్రామాలలో పెద్ద ఎత్తున జరిగిన గ్రావెల్ దోపిడికి వ్యతిరేకంగా ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్రను చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య భాగస్వామ్యంతో గ్రావెల్ దోపిడీ యదేచ్చగా సాగుతుందని తెలిపారు. ఏడు వందల ఎకరాల్లో సుమారు 125 కోట్ల టన్నుల గ్రావెల్ ను గత నాలుగున్నర ఏళ్లలో అధికారంతో దోచేశారని తెలియజేశారు.

అక్రమ గ్రావెల్ పై ఎన్నిసార్లు స్పందన కార్యక్రమంలో అర్జీలు పెట్టినా, బాధిత గ్రామ ప్రజలతో పోరాటాలు చేసినా ప్రభుత్వం నుంచి సరియైన స్పందన కరువైందని ఏద్దేవా చేశారు. అదేవిధంగా ఎంతమంది ఉన్నత అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న అధికారి లేడని అన్నారు.ఆయా గ్రామాలలో అమాయకుల ప్రాణాలు పోయినా, రోడ్లు ధ్వంసం అయినా, బ్రిడ్జిలు కూలిపోయినా మైనింగ్ దోపిడీ మాత్రం ఆగలేదని తెలియజేశారు. ఉధ్యాన పంటలకు ఈ ప్రాంతం ప్రసిద్ధిగాంచిన ప్రాంతమని గ్రావెల్ దోపిడీతో ఉధ్యాన పంటల విస్తీర్ణం రోజు రోజుకు తరిగి పోతుందని చెప్పారు.

2019-20 సంవత్సరంలో ఈ ప్రాంత రైతాంగం 1227 ఎకరాల్లో ఉద్యాన పంటలు వేశారని, ఏటికి ఏడు ఉద్యాన పంటల విస్తీర్ణం తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యాన పంటల విస్తీర్ణం 2020-21 సంవత్సరంలో 665 ఎకరాలకు ,2021-22 సంవత్సరంలో 545 ఎకరాలకు తగ్గుపోయిందని చెప్పారు. అధికారిక లెక్కల ప్రకారం సుమారు రూ || 5 కోట్ల పెనాల్టీ విధించారని, అయినా అక్రమార్కుల నుంచి ఒక రూపాయి కూడా వసూలు చేయలేదని తెలిపారు. దీనికి అసలు కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉండటమేనని నరేంద్ర కుమార్ అన్నారు.

తాము పోరాటం చేసిన సందర్భంలో స్థానిక శాసనసభ్యులు రోశయ్యను ముఖ్యమంత్రి ఇప్పటివరకు మూడుసార్లు పిలిపించారని, అది కేవలం లెక్కలు కట్టి తమ వాటా వసూలు కోసమేనని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు కప్పం కట్టించుకోవడానికి తప్ప నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియాను ఆదుపు చేయదానికి కాదని తెలియజేశారు. పర్యావరణ అనుమతులు లేకుండా అడ్డగోలుగా గ్రావెల్ తవ్వేశారని నరేంద్ర కుమార్ తెలిపారు.

ఐదు క్వారీల లీజుల్లో మాత్రమే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకున్నప్పటికీ అన్నీ క్వారీలలో నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా గ్రావెల్ తవ్వేశారని తెలిపారు. పర్యావరణం పాడైపోతున్నా, పొలాలు నిస్సారంగా మారుతున్నా, భూగర్భ జలాలు కలుషితమవుతున్నా పట్టించుకొనే దిక్కులేకుండా పోయిందని నరేంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఊళ్లకు ఊళ్లు దుమ్ము కొట్టుకుపోతున్నా పాలకులలో, ప్రభుత్వాధికారులలో చలనం లేకపోవటం ఆవేదన కలిగించే అంశమని తెలియజేశారు.

ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ చేస్తున్న ఈ పోరాటానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్,రాష్ట్ర గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ దాసరి రాజామాష్టార్, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, జనసేన పొన్నూరు నియోజకవర్గ ఇంచార్జ్ మార్కండేయ బాబు తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ పాదయాత్రలో కలిసి నడిచారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE