సుజనా చౌదరికి కేంద్రం బిగ్ షాక్

-ఇది సాధారణంగా జరిగే ప్రకియనే
-మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు చేసిందన్న ప్రచారంలో నిజం లేదన్న విమ్స్ యాజమాన్యం

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు చెందిన మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దయినట్లు తెలుస్తోంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసినట్లు సమాచారం. ఈ విద్యా సంవత్సరంలో ఈ వైద్య కళాశాలలో సీట్లను భర్తీ చేయకూడదని ఆదేశించినట్లు చెబుతున్నారు.

ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లను నిలిపివేయాలంటూ ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి గల కారణాలు స్పష్టంగా తెలియరావట్లేదు. దీనితో త్వరలోనే కాళోజీ నారాయణ రావు మెడికల్ యూనివర్శిటీ లేదా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఈ గుర్తింపు రద్దు కావడం వల్ల తెలంగాణ 100 మెడికల్ సీట్లను కోల్పోయిందనే అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని ఇతర మెడికల్ ఇన్‌స్టిట్యూట్లలో సర్దుబాటు చేయొచ్చనే అంచనాలు లేకపోలేదు.

అయితే ఈ ప్రచారాన్ని విమ్స్ యాజమాన్యం ఖండించింది. తనిఖీల్లో వసతులకు సంబంధించి కొన్ని లోటు పాట్లు ఉన్నాయని భావించి, సీట్ల భర్తీని మెడికల్ కౌన్సిల్ నిలిపివేసింందని వివరించింది. వాటిని సరిదిద్దుకుంటే, మళ్లీ అనుమతులు వస్తాయని, ఇది సాధారణంగా జరిగే ప్రకియనే అని స్పష్టం చేసింది. అంతే తప్ప మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు చేసిందన్న ప్రచారంలో నిజం లేదని వెల్లడించింది.

Leave a Reply