చర్చిలకు ఎంపీ నిధుల వినియోగంపై కేంద్రం ఆరా!

– ఎంపీ లాడ్స్‌ నిధులపై వివరణ ఇవ్వండి
– ఎంపీ రఘురామ ఫిర్యాదుపై ఏపీకి కేంద్రం లేఖ
( మార్తి సుబ్రహ్మణ్యం)
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేంద్రానికి చేస్తున్న ఫిర్యాదులు ఏపీ సర్కారుకు తలనొప్పిగా మారుతున్నాయి. ఇప్పటికే సీఐడీ చీఫ్ సునీల్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణంరాజు.. తాజాగా కొంతమంది వైసీపీ ఎంపీలు, తమ ఎంపీ నిధులను చర్చి నిర్మాణాలకు కేటాయిస్తున్నారంటూ ప్రధానికి ఫిర్యాదు చేయటం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీ లాడ్స్- ప్రభుత్వ నిధులతో చర్చి నిర్మాణాలు చేస్తున్నారన్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుపై కేంద్రం రంగంలోకి దిగింది. బాపట్లలో వైసీపీ ఎంపి నందిగం సురేష్ తన ఎంపీ లాడ్స్ నుంచి.. వెలమవారిపాలెం చర్చి మరమ్మతులు, పునర్మిర్మాణం కోసం 43 లక్షలు కేటాయించడం అప్పట్లో వివాదంగా మారింది.
అదేవిధంగా వివిధ జిల్లాల్లో వైసీపీ ఎంపీలు కమ్యూనిటీ హాలు నిర్మాణాల పేరిట ఇస్తున్న నిధులతో ముందు కమ్యూనిటీ హాళ్లు నిర్మించి, ఆ తర్వాత వాటిని చర్చిలుగా మారుస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని, వైసీపీ రె బెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రధాని మోదీని స్వయంగా కలిసినప్పుడు ఫిర్యాదు చేశారు. తమ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాళ్లను చర్చిలుగా మార్చేందుకు, తమ పార్టీ ఎంపీలు అధికారులపై ఒత్తిడి చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని కూడా ఎంపీ రాజు, ప్రధానికి ఫిర్యాదు చేశారు.
ఎంపీ నిధులతో చర్చిలు నిర్మించడం, మరమ్మతులు చేయడం చట్టవిరుద్ధమని ఎంపీ రాజు ప్రధాని దృష్టికి తీసుకువె ళ్లారు. కాగా రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం క్రైస్తవ అనుకూల విధానాలు అవలంబిస్తోందని, మతమార్పిళ్లు శరవేగంగా జరుగుతోందన్నారు. రాష్ట్రంలో కొందరు పోలీసు, ఏఐఎస్ అధికారులు బహిరంగంగా క్రైస్తవ వేదికలపై ప్రసంగాలు చేస్తున్నారని, అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్.. జగన్ సీఎం అయిన తర్వాత క్రైస్తవులకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చినట్లు చెప్పిన వీడియాను కూడా, ఎంపీ రాజు ప్రధానికి అందించారు. క్రైస్తవ మతం మారిన దళితులు-రెడ్లకే జగన్మోహన్‌రెడ్డి సర్కారు కీలక పదవులిస్తోందని, ఆ జాబితాను ప్రధానికి అందించారు. హిందూ ఆలయాలపై వరసగా జరుగుతున్న దాడులను, ఏపీ ప్రభుత్వం అరికట్టలేకపోతోందని కూడా ప్రధానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఆ క్రమంలో ఎంపీ నిధులతో చర్చి నిర్మాణాలు చేస్తున్న వైనంపై, ఆయన సెప్టెంబర్ 20న ఒక పత్రికలో వచ్చిన క్లిప్పింగును జతపరుస్తూ ప్రధాని లేఖ రాశారు. ఎంపీ నిధులతో నిర్మించిన కమ్యూనిటీహాళ్లు తర్వాత చర్చిలుగా మారాయన్న ఆరోపణలపై, విచారణ జరిపించాలని ఎంపీ రాజు ప్రధానిని కోరారు. జగన్ ప్రభుత్వం ఇప్పటికే 25 కోట్లతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 248 చర్చిలు నిర్మించిందని, ఒక్కో చర్చికి 84 వేల నుంచి కోటి రూపాయల వరకూ ఖర్చు చేసిందని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు.
దానితో స్పందించిన పీఎంఓ రాష్ట్రాన్ని వివరణ కోరింది. దానిపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శికి లేఖ రాయడంతో, ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఎంపీ లాడ్స్‌ నిధులను మత సంబంధ భవనాలకు కేటాయించడంపై ఏపీని కేంద్ర ప్రభుత్వం వివరణ కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక విభాగం ముఖ్యకార్యదర్శికి కేంద్రం లేఖ రాసింది. బాపట్లలో చర్చికి రూ.46 లక్షల ఎంపీ లాడ్స్‌ నిధులు ఖర్చు చేశారని.. చాలా చోట్ల ఇదే తరహాలో నిధులు వినియోగించారని ఎంపీ రఘురామ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పీఎంవో కార్యాలయం.. ఏపీ ప్రభుత్వం వివరణ కోరాల్సిందిగా సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖకు ఆదేశాలిచ్చింది. దీంతో ఎంపీ లాడ్స్‌ నిధులపై వాస్తవ నివేదికతో పాటు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఏపీని కేంద్రం వివరణ కోరింది. ఫలితంగా ఎంపీలు ఎంతమంది తమ నిధులను కమ్యూనిటీ హాళ్ల పేరిట చర్చి నిర్మాణాలకు ఇచ్చారన్న విషయం బయటపడనుంది.