సెస్‌ పేర కేంద్రం తొండాట

15వ ఫైనాన్స్‌ కమిషన్‌ స్వయంగా వెల్లడించిన విషయాలు గమనిస్తే కేంద్రం తన ఆదాయాన్ని పెంచుకుంటూ రాష్ట్రాలకు మొండిచేయి చూపుతున్న వైనం తెలిసిపోతుంది. రాష్ట్రాలపై 62 శాతం వ్యయ బాధ్యతలుంటాయి. కానీ వాటికి రెవెన్యూలో దాదాపు 37 శాతం వాటానే ఉన్నది. కేంద్రానికి ఉన్న వ్యయ బాధ్యతలు 38 శాతమే. కానీ రెవెన్యూలో దాదాపు 63 శాతం పొందుతున్నది. వ్యయభారం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల రెవెన్యూ వాటా పెంచాలి.
కానీ కేంద్రం పన్ను అయితే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని, సెస్‌ను పెంచుకుంటూ పోతున్నది. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల నడ్డివిరిచి వసూలు చేస్తూనే, రాష్ట్రాలకు వాటా ఎగ్గొడుతున్నది. దీనివల్ల రాష్ట్రాలు ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టడంలో ఇబ్బందులు పడుతున్నాయి. ఈ విధంగా రాజ్యాంగస్ఫూర్తికి, ప్రజా సంక్షేమానికి, రాష్ట్రాల హక్కులకు కేంద్రం భంగం వాటిల్లజేస్తున్నది.
ఫైనాన్స్‌ కమిషన్‌ నివేదికను అనుసరించి 2025-26 నాటికి డివిజిబుల్‌ పూల్‌ పన్ను జీడీపీలో 8.05 శాతం ఉండగా సెస్‌ 1.85 శాతంగా ఉండబోతున్నది. రాష్ట్రాలకు 62 శాతం ఖర్చులుంటే, 37 శాతం రెవెన్యూ మాత్రమే వస్తోందని, కేంద్రానికి ఖర్చు 38 శాతం ఉంటే రెవెన్యూ 63 శాతంగా ఉండబోతోందని 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ అభిప్రాయపడింది.
పన్నుల మీద పన్ను వేస్తే దానిని ‘సెస్‌’ అంటారు. మొదట్లో కేంద్ర ప్రభుత్వం విధించే ఈ సెస్‌లో రాష్ట్రాలకు కూడా భాగస్వామ్యం ఉండేది. కానీ 80వ రాజ్యాంగ సవరణ-2000 ద్వారా వాజపేయి ప్రభుత్వం ఆర్టికల్‌ 269, 270, 272ను సవరించి ‘సెస్‌’ను డివిజిబుల్‌ పూల్‌ (రాష్ట్రాలతో పంచుకునే పన్నులు) నుంచి మినహాయించింది. ఈ సవరణ వల్ల సెస్‌లను, సర్‌ఛార్జ్‌ లను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంచుకునే అవకాశం లేకుండాపోయింది. (జీఎస్టీలో మాత్రం సెస్‌ను చేర్చారు) కేంద్రం సెస్‌ను కానీ, సర్‌ఛార్జీని కానీ ఏదైనా నిర్దిష్ట ప్రయోజనం కోసం సేకరించవచ్చు. దాన్ని మొదట కన్సాలిడేటెడ్‌ ఫండ్‌లో జమచేసి, పార్లమెంటులో ఆమోదం తదుపరి ఆ ప్రత్యేకమైన ప్రయోజనం కోసం ఖర్చు చేయవలసి ఉంటుంది.
నిర్దిష్ట ప్రయోజనం కోసమని ప్రవేశపెట్టిన ఈ వెసులుబాటును కేంద్రం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నదనేది గమనార్హం. కాలక్రమేణా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే సెస్‌ మొత్తం విపరీతంగా పెరిగింది. 2011-12కు ముందు 92,537 కోట్లుగా ఉన్న సెస్‌ 2020-21 నాటికి సుమారు 4,81,767 కోట్లకు చేరుకున్నది. ఈ పెరుగుదల ఒక దశాబ్దకాలంలో 5 రేట్లుగా నమోదైంది.
మోదీ ప్రభుత్వం ఈ ఏడేండ్లలో సుమారు 1.41 లక్షల కోట్ల సెస్‌ను 4.81లక్షల కోట్లకు పెంచుకున్నది. అంటే 4.81 లక్షల కోట్లను రాష్ట్రాలతో పంచుకోవడం లేదు. దేశ వాసులు చెల్లిస్తున్న మొత్తం ట్యాక్స్‌ రెవెన్యూలో సెస్‌ 2011-12 నాటికి సుమారు 10 శాతంగా ఉండేది. కానీ 2020-21 నాటికి సుమారు 20 శాతానికి చేరుకున్నది. ఈ సెస్‌ పెరుగుదలను గమనించిన రాష్ట్రాలు సెస్‌ను డివిజిబుల్‌ పూల్‌లో ఉంచాలని కేంద్రాన్ని కోరాయి.
14వ ఫైనాన్స్‌ కమిషన్‌, 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ కూడా ఇదే విధంగా సూచించాయి. అలాగే అనేక స్వతంత్ర సంస్థలు, మేధో బృందాలు ఈ సెస్‌లను దీర్ఘకాలం కొనసాగించకూడదని, ఏ పరిస్థితిలోనైనా కొనసాగిస్తే రాజ్యాంగ సవరణ ద్వారా డివిజిబుల్‌ పూల్‌లోకి మార్చాలని పేర్కొన్నాయి.
సెస్‌ ట్యాక్స్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ పరిధిలోకి రాదని, సెస్‌ గురించి ఎలాంటి సూచనలు చేయటానికి ఫైనాన్స్‌ కమిషన్‌కు అధికారం లేదని 14, 15వ ఫైనాన్స్‌ కమిషన్లకు బీజేపీ ప్రభుత్వం చెప్పటం గమనార్హం. 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ 42 శాతం ట్యాక్స్‌ను రాష్ట్రాలకు బదలాయించాల్సిందిగా సూచించినప్పటికీ, సెస్‌ పుణ్యాన ఆ బదలాయింపు 32.4 శాతంగా ఉన్నది. 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ నివేదిక ప్రకారం, కేంద్రం వసూలు చేసే పన్నులో డివిజిబుల్‌ పూల్‌ కేవలం 67.5 శాతంగా ఉంది. అంటే 32.5 శాతం పన్నును కేం ద్రం రాష్ట్రాలకు బదలాయింపు చేయదు. డివిజిబుల్‌ పూల్‌ లో ఎలాగూ కేంద్రానికే పెద్ద వాటా ఉంటుంది. దీనికి తోడు మొత్తం ఆదాయంలో 32.5 శాతాన్ని డివిజిబుల్‌ పూల్‌ లోనే చేర్చకుండా సెస్‌రూపంలో కేంద్రం తీసుకుంటున్నది.
2021-22 నుంచి 2025-26 వరకు గల 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ కాలంలో మొత్తం పన్నులో సెస్‌ 18.6 శాతానికి పైగా ఉండవచ్చని అంచనా వేసింది. 15వ ఆర్థిక సంఘం లెక్కల ప్రకారం.. 2021-26, ఐదు ఆర్థిక సంవత్సరాల్లో గ్రాస్‌ రెవెన్యూ రిసీట్స్‌ (జీఆర్‌ఆర్‌) 154 లక్షల కోట్లుగా అంచనా వేసింది. అందులో సుమారు 20 లక్షల కోట్లు కేంద్రానికి స్పెక్ట్రమ్‌ అమ్మకం, ఆర్బీఐ డివిడెంట్‌ రూపాన రాబోతున్నాయి.
ఈ 20 లక్షల కోట్లను కేంద్రం రాష్ట్రాలతో పంచుకోదు. ఇది మినహాయించగా గ్రాస్‌ టాక్స్‌ రెవెన్యూ (జీటీఆర్‌) 134 లక్షల కోట్లు. ఇందులో సెస్‌ సుమారు 33 లక్షల కోట్లుగా ఉండబోతున్నది. అంటే రాష్ట్రాలతో పంచుకునే డివిజిబుల్‌ పూల్‌లో సుమారు 102 లక్షల కోట్లుంటాయి. 41 శాతం లెక్క ప్రకారం చూస్తే రాష్ట్రాలకు సుమారు 42 లక్షల కోట్లు రానున్నాయి.
ఈ ఐదేండ్లలో వివిధ గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలకు రానున్నవి సుమారు 10 లక్షల కోట్లుగా తేల్చింది. అంటే కేంద్రం 154 లక్షల కోట్ల తన ఆదాయంలో రాష్ట్రాలతో పంచుకునేది 52 లక్షల కోట్లు మాత్రమే.
ఫైనాన్స్‌ కమిషన్‌ నివేదికను అనుసరించి 2025-26 నాటికి డివిజిబుల్‌ పూల్‌ పన్ను జీడీపీలో 8.05 శాతం ఉండగా సెస్‌ 1.85 శాతంగా ఉండబోతున్నది. రాష్ట్రాలకు 62 శాతం ఖర్చులుంటే, 37 శాతం రెవెన్యూ మాత్రమే వస్తోందని, కేంద్రానికి ఖర్చు 38 శాతం ఉంటే రెవెన్యూ 63 శాతంగా ఉండబోతోందని 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ అభిప్రాయపడింది.
సీఏజీ (కాగ్‌)కూడా ఇటీవల పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో… 2018-19 ఆర్థిక సంవత్సరంలో సుమారు 40 శాతం సెస్‌ను కన్సాలిడేటెడ్‌ ఫండ్‌లో నుంచి నిర్దిష్ట ప్రయోజనాలకు బదలాయించలేదని పేర్కొన్నది. ఆ 40 శాతం సెస్‌ను తన ద్రవ్యలోటును పూరించుకోవటానికి వినియోగించుకొన్నదని, అది రాజ్యాంగ విరుద్ధమని తప్పుబట్టింది.
ఇప్పటికీ పెట్రోల్‌ పై లీటర్‌కు 20.5 రూపాయల సెస్‌ ఉండగా, డీజల్‌పై లీటర్‌కు రూ. 22 ఉంది. రాజ్యాంగం ప్రతిపాదించిన ఆర్థిక స మాఖ్య వాదాన్ని బీజేపీ తుంగలో తొక్కుతూ, సెస్‌ను విపరీతంగా పెంచుతూ రాష్ట్రాలకు మొండి చేయి చూపుతున్నది. రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూనే, మరో వైపు పెట్రో ల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని రాష్ట్రాలకు సూచించడం రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధం.

– పెండ్యాల మంగళాదేవి

Leave a Reply