– ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ప్రాంత అభివృద్ధికి ఊతం
– మంత్రి సవిత
పెనుకొండ: సోమందేపల్లి మండలంలోని పునరాభివృద్ధి చేయబడిన చాకర్లపల్లి రైల్వే స్టేషన్ను రైల్వే మరియు జలశక్తి కేంద్ర సహాయ మంత్రి వర్యులు వి. సోమన్నశనివారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి ఎస్. సవిత హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారధి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, చాకర్లపల్లి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి ద్వారా ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ అభివృద్ధి స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు, ప్రాంత ఆర్థిక-సామాజిక పురోగతికి గణనీయంగా దోహదపడుతుందని పేర్కొన్నారు. కేంద్రం–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మౌలిక వసతుల అభివృద్ధి నిరంతరంగా కొనసాగుతోందని అన్నారు.
పెనుకొండ పట్టణం చారిత్రక ప్రాధాన్యతతో పాటు వేగంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో,పెనుకొండ రైల్వే స్టేషన్ను ఆధునికీకరించి అప్గ్రేడేషన్ చేయాలని కేంద్ర మంత్రిని మంత్రి సవిత కోరారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.అలాగే, ఇప్పటికే మంజూరైన చాకర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని రోడ్ ఓవర్ బ్రిడ్జి (RoB) పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు.
పెనుకొండ (ఆంధ్రప్రదేశ్) నుంచి పావగడ (కర్ణాటక) వరకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటు దిశగా సర్వే నిర్వహించి అనుమతి ఇవ్వాలని కోరుతూ, ఈ రైల్వే లైన్ ద్వారా రెండు రాష్ట్రాల మధ్య రవాణా, వాణిజ్య కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. అదేవిధంగా, పెనుకొండ ప్రజల ప్రయాణ సౌకర్యాల దృష్ట్యా బసవ ఎక్స్ప్రెస్, లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్, యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్* రైళ్లను పెనుకొండ రైల్వే స్టేషన్లో నిలుపుదల చేయాలని కేంద్ర మంత్రి వి. సోమన్న గారిని మంత్రి సవిత ప్రత్యేకంగా విన్నపించారు.ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ ఉన్నతాధికారులు, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.