Suryaa.co.in

Andhra Pradesh

అరబిందో ఫార్మాతో లాభం పొందింది చంద్రబాబే

-ప్రతి ఎన్నికలో ఆ సంస్థ నుంచి చందాలు తీసుకున్నారు
-ఇది వాస్తవం. కాదంటారా? చంద్రబాబు జవాబు చెప్పాలి
-లేకపోతే ఏ గుడికైనా వచ్చి ప్రమాణం చేయాలి
-నేను చెప్పింది నిజమని నేనూ ప్రమాణం చేస్తాను
-ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి కొడాలి నాని ఛాలెంజ్‌

31 లక్షల ఇళ్ల స్థలాలు:
రాష్ట్రంలో సీఎం వైయస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టి దాదాపు మూడున్నర ఏళ్లైంది. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలుగా ఆయన పాలన సాగుతోంది. రాష్ట్రంలో కనీసం ఇంటి స్థలం లేని వారెంత మంది అన్న వివరాలు ఆరా తీసిన ముఖ్యమంత్రి, దాదాపు 31 లక్షల నిరుపేద కుటుంబాలకు కనీసం ఇంటి స్థలం లేదని గుర్తించారు. అందుకోసం రూ.16 వేల కోట్లతో 50 వేల ఎకరాల భూమి సేకరించారు. ఆ భూమిని లేఅవుట్లుగా అభివృద్ధి చేసి, నిరుపేద కుటుంబాలకు ఇంటి స్థలం రిజిస్ట్రేషన్‌ చేయించారు. అంతే కాకుండా వేల కోట్లు ఖర్చు పెట్టి, ఆయా లేఅవుట్లలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్‌ వంటి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ఏకంగా 31 లక్షల కుటుంబాలకు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు, రెండు విడతల్లో 21 లక్షల ఇళ్లు కూడా కట్టించి ఇస్తున్నారు.

బాబు కోసమే పవన్‌ పార్టీ:
మరి చంద్రబాబు ఏనాడైనా తన పాలనలో, ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్లలో కనీసం ఒక్కటంటే ఒక్క ఇంటి స్థలం అయినా ఇచ్చాడా? అయినా సరే పవన్‌కళ్యాణ్‌ మాత్రం ఏనాడూ ప్రశ్నించలేదు. ప్రశ్నించడు. చంద్రబాబు కోసం పార్టీ పెట్టి, ఆయన సూచనలు, సలహాలకు అనుగుణంగా, కేవలం చంద్రబాబు మేలు కోసమే పవన్‌కళ్యాణ్‌ పని చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలి.

‘ఇప్పటం’తో బాబు రాజకీయం:
రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన దత్తపుత్రుడిని తొలుత చంద్రబాబు ఇప్పటంకు పంపించాడు. అక్కడికి హడావిడిగా పోయిన దత్తపుత్రుడు పెద్ద డ్రామా చేసి వచ్చాడు. ఆ తర్వాత సొంత పుత్రుడిని అక్కడికి పంపించాడు. ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేయిస్తూ, రాజకీయం చేస్తున్నారు. అంత చిన్న గ్రామానికి అంత పెద్ద రోడ్డు ఎందుకు? అని పప్పు లోకేష్‌ అంటున్నాడు. మరి ఇప్పటం తర్వాత వేరే ఊళ్లు లేవా? నిజానికి తాము రోడ్లు ఆక్రమించి, నిర్మించిన ప్రహరీలు, ఇతర కట్టడాలనే కూల్చారని స్వయంగా ఇప్పటం వాసులు కూడా చెబుతున్నారు. అయినా లోకేష్‌ బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు. పిచ్చి విమర్శలు చేస్తున్నారు. నిజానికి చంద్రబాబు గత పాలనలో రోడ్ల నిర్మాణం, మరమ్మతు కోసం ఎంత ఖర్చు చేశాడు? అదే జగన్‌గారు ఇప్పుడు వాటి కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుస్తోంది కదా? సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ పాలనలో అన్ని వర్గాల వారు సంతోషంగా ఉంటే, ఏం చేయాలో తోచక చంద్రబాబు లేనిపోని రాజకీయాలు చేస్తున్నారు. ఆయనకు దత్తపుత్రుడు, ఎల్లో మీడియా వంత పాడుతోంది. ఏ మాత్రం ప్రజాభిమానం లేని పప్పు లోకేష్, ఎంతో ప్రజాభిమానం ఉండి, ఎంతో మెజారిటీతో గెల్చిన జగన్‌గారిపై పిచ్చి విమర్శలు చేస్తున్నారు. ఇకనైనా చంద్రబాబు, లోకేష్‌ వాస్తవాలు గుర్తించాలి.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా…
ఇదే నా సవాల్‌:
2024 ఎన్నికలు చంద్రబాబుకు చివరి ఎన్నికలు. జగన్‌కి కాదు. ఎందుకంటే, ఆయన ఏనాడూ వచ్చే ఎన్నికల కోసం ఆలోచించడం లేదు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇవాళ్టి వరకు ప్రజా సంక్షేమం, శ్రేయస్సే ధ్యేయంగా పని చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఓడిపోతారు. ఇప్పటికే ఆయనకు వయసై పోయింది. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో కూడా జగన్‌గారు గెలవరని చంద్రబాబు అంటున్నారు. ఆయనకు ఒక సవాల్‌. చంద్రబాబుకు జీవితకాలం టైమ్‌ ఇస్తున్నాం. దమ్ముంటే పులివెందుల నియోజకవర్గంలో కనీసం ఒక గ్రామ పంచాయతీలో అయినా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోమనండి. ఇది మా ఛాలెంజ్‌. అదే చంద్రబాబు ఎప్పటి నుంచో ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో అన్ని పంచాయతీలను జగన్‌ గెల్చారు. అదీ ఆయన సత్తా. అందుకే మళ్లీ చెబుతున్నా. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో కూడా గెలవబోడు.

గుడిలో ప్రమాణం చేస్తారా?:
అరబిందో ఫార్మా నుంచి చంద్రబాబు ఏనాడూ చందాలు తీసుకోలేదా? 1999 ఎన్నికల్లో అరబిందో కంపెనీ నుంచి చంద్రబాబు డబ్బులు (చందాలు) తీసుకోలేదా? ఆ తర్వాత 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో కూడా అరబిందో ఫార్మా నుంచి చంద్రబాబు చందాలు తీసుకోలేదా? దీనికి సమాధానం చంద్రబాబు చెప్పాలి. ఆ కంపెనీ వేసిన చిల్లర చంద్రబాబు తీసుకున్నారు. ఇది వాస్తవం. అరబిందో  ఫార్మా కంపెనీ యజమాని కుమారుడికి విజయసాయిరెడ్డి తన కూతురును ఇచ్చింది 2013లో. కానీ అంతకు ముందు ఏడెనిమిది సంవత్సరాల నుంచే విజయసాయిరెడ్డికి ఆ కంపెనీతో అనుబ«ంధం ఉంది. అంతే తప్ప, కూతురును ఇచ్చిన తర్వాత వచ్చిన సంబంధం కాదు. అరబిందో  ఫార్మా కంపెనీ నుంచి చందాలు తీసుకున్న చంద్రబాబు, వారికి ఫేవర్‌ చేయలేదా? అది నిజం కాకపోతే, ఏ గుడికి వచ్చి చంద్రబాబును వచ్చి ప్రమాణం చేయమనండి. అరబిందో కంపెనీ నుంచి తాను ఏనాడూ డబ్బులు తీసుకోలేదని చెప్పమనండి. ఇవాళ ఈడీ కేసులో ఉన్న ఆ వ్యక్తి, విజయసాయిరెడ్డి అల్లుడు కాదు. వారి బంధువు మాత్రమే. వ్యాపారాలను ప్రోత్సహించి, చిల్లర డబ్బులు అడుక్కున్న చిల్లరగాడు చంద్రబాబు. కాదంటే, ఎ గుడికైనా వచ్చి ప్రమాణం చేయమనండి. నేనూ ప్రమాణం చేస్తాను.

కోడిగుడ్డుపై ఈకలు:
ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్న చంద్రబాబు, కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నాడు. వాటిని ఆయన దత్తపుత్రుడు, ఎల్లో మీడియా లెక్కిస్తోంది. అసలు లేని ఈకలను వారు లెక్కిస్తున్నారు. ఇది చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ నీతిలేని అనైతిక రాజకీయం. లోకేష్‌ అసమర్థుడు కాబట్టే, పవన్‌కళ్యాణ్‌ను దత్తత తీసుకుని, ఆయన ద్వారా రాజకీయాలు చేసి, మళ్లీ ఎలాగోలా అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు.

LEAVE A RESPONSE