Suryaa.co.in

Andhra Pradesh

వృద్ధుల క్షోభ మీకు తగలక మానదు

– డబ్బులు అకౌంట్లో వేస్తే వృద్ధులు తీసుకోగలుగుతారా?
– పెన్షన్ల కోసం బ్యాంకులు చుట్టూ తిప్పి అవస్తలు పెట్టారు
– సీఎస్ జవహర్ రెడ్డిని హెచ్చరిస్తున్నా..
– ప్రజలు ఏడిస్తే సైకో ముఖ్యమంత్రికి ఆనందంగా ఉంటోంది
– జగన్ రెడ్డికి ఫోటోల పిచ్చి పరాకాష్టకు చేరింది
– ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేస్తాం, మీ భూములు కాపాడతాం
– మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తాం
– వెలిగొండను పూర్తి చేసి, పొదిలికి నీరు అందిస్తాం
– ఎర్రచందనం స్మగ్లర్ చెవిరెడ్డిని ఓడించండి
– ఎమ్మెల్యేగా నారాయణరెడ్డిని, ఎంపీగా మాగుంటను గెలిపించండి
– పొదిలి ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు

మార్కాపురం/పొదిలి: రానున్న ఎన్నికల్లో టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించేందుకు, చరిత్రను తిరగరాసేందుకు, సైకో నుండి రాష్ట్రాన్ని కాపాడేందుకు మార్కాపురం ప్రజలంతా సిద్ధమా? జగన్ రెడ్డి పాలనలో రాజకీయాలు చౌకబారుగా తయారయ్యాయి. మొన్నటి వరకు గిద్దలూరులో ఓ ఎమ్మెల్యే అప్రతిష్టపాలవ్వడంతో అక్కడి ప్రజలు ఛీ కొట్టారు… మార్కాపురంలో ప్రస్తుత ఎమ్మెల్యేను ఇక్కడి ప్రజలు ఛీ కొట్టారు…దీంతో ఇక్కడి ఎమ్మెల్యేని తీసుకెళ్లి గిద్దలూరులో జగన్ రెడ్డి పడేశాడు. ఇక్కడి చెత్త…గిద్దలూరులో బంగారం అవుతుందా? రాష్ట్ర ప్రజలను జగన్ రెడ్డి కుండ మార్పిడి చేసి మోసం చేస్తున్నాడు.

భాస్కర్ రెడ్డి ఎర్రచందనం స్మగ్లర్
ఈ ప్రాంతానికి తిరుపతి నుండి ఎర్రచందనం స్మగ్లర్ ను జగన్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా తీసుకొచ్చాడు. ఎర్రచందనం స్మగ్లర్ భాస్కర్ రెడ్డి….ఇలాంటి వ్యక్తి ఇక్కడ గెలిస్తే మీ పరిస్థితి ఏమవుతుందో అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఓ సైకో… అహంకారి.. విధ్వంసకారుడు…మంచి చేయడం తెలియని వ్యక్తి…అన్నీ నాశనం చేయడం మాత్రమే తెలుసు. జగన్ రెడ్డి దోపిడీ చేయడంలో దిట్ట..ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియాలో జగన్ అండ్ కో సిద్ధహస్తులు. రాష్ట్ర ప్రజలను వేధిస్తే సీఎం కు నవ్వు వస్తోంది…మనం కష్టపడితే జగన్ రెడ్డికి ఆనందంగా ఉంటోంది. ఉద్యోగస్తులపై 1,500కేసులు పెట్టి వేధించిన వ్యక్తి సైకో ముఖ్యమంత్రి.

పెన్షనర్ల ఉసురు చీఫ్ సెక్రటరీకి తప్పక తగులుతుంది:-
పెన్షన్లు ఇవ్వడం జగన్ రెడ్డి కష్టంగా మారింది. పెన్షన్లు ప్రారంభించిన పార్టీ టీడీపీ. రూ.200పెన్షన్ ను రూ.2వేలకు పెంచిన పార్టీ టీడీపీ. రూ.2వేల నుండి రూ.3వేలకు పెంచడం జగన్ రెడ్డికి కష్టతరంగా మారింది. రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ రూ.4వేలకు పెంచి ఇస్తాం. తెలుగుదేశంపార్టీ పేదల పక్షాన నిలబడే పార్టీ. గత నెలలో 1.50లక్షల సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్దే పెన్షన్ ఇచ్చే వెసులుబాటు ఉన్నా…సైకో జగన్ పెన్షన్ తీసుకునే పేదవారిని, వృద్ధులను రోడ్డు మీదకు తెచ్చి పొట్టనపెట్టుకున్నాడు.

ఈనెలలో అయినా పెన్షన్లను ఇంటి వద్దకు వెళ్లి అందించాలని ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కుదరదు అన్ని ఎన్నికల అధికారికి లేఖ రాశాడు. ఈనెలలో పెన్షన్లను బ్యాంకు ఖాతాల్లో వేసి వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పి వేధిస్తున్నారు. అకౌంట్లో డబ్బులు వేస్తే వృద్ధులు తీసుకోగలరా? పెన్షన్ల కోసం వృద్ధులను బ్యాంకులు చుట్టూ తిప్పి వేధిస్తున్నారు. పెన్షనర్లకు పెద్ద కొడుకుగా ఉంటా…ప్రతి నెల 1వ తారీఖునే ఇంటి వద్దే పెన్షన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి పేదవారి ఉసురు తగులుతుందని గుర్తించాలి.

వెలిగొండ పూర్తిచేసి మార్కాపురం, పొదిలి ప్రాంతాలను ఆదుకుంటాం:
మార్కాపురం నియోజకవర్గంలో సాగునీరు లేదు, త్రాగునీరు లేదు, బోరు పడే పరిస్థితి లేదు, ఉపాధి పనులు లేక వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు. ఈ ప్రాంతంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి ప్రత్యేకంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి నీరు ఇవ్వాలని గతంలో మీరు నన్ను అడిగితే ఆ పనులు పరుగులు పెట్టించాను. మెయిన్ ఛానల్ పనులు 80శాతం పూర్తిచేశాను. రెండో ఛానల్ 60శాతం పూర్తి చేశాను. నేను అధికారంలో ఉండి ఉంటే 2020నాటికి వెలిగొండను పూర్తిచేసి నీళ్లను మీకు అందించేవాడిని.

ఈ మధ్యే ముఖ్యమంత్రి ప్రాజెక్టుకు రిబ్బన్ కత్తిరించాడు…కానీ నీళ్లు లేని పరిస్థితులు. జగన్ రెడ్డి డ్రామాల రాయుడు…ఈ డ్రామాలు మాకు వద్దు…నీళ్లు ఇవ్వండని ముఖ్యమంత్రిని ప్రజలు నిలదీయాలని కోరుతున్నాను. నేను ముఖ్యమంత్రి అయ్యాక వెలిగొండను పూర్తిచేస్తాను…పొదిలికి కూడా నీరు అందిస్తానని హామీ ఇస్తున్నాను. పొదిలి మండలాన్ని కూడా వెలిగొండ ఆయకట్టులో చేరుస్తాను. దొనకొండ అందుబాటులో ఉంది…అక్కడ పరిశ్రమలు వచ్చే పరిస్థితి ఉంది. రామాయపట్నం పోర్టు వస్తే చాలా ఆదాయం వస్తుంది.

కానీ జగన్ పాలనలో ఇవేమీ చేయలేదు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు ఇండోనేషియాకు చెందిన ఏషియా పల్ప్ అండ్ పేపర్ పరిశ్రమ రూ.25వేల కోట్ల పెట్టుబడితో వస్తే…దాన్ని జగన్ రెడ్డి తరిమేశాడు. ఈ జిల్లాకు న్యాయం జరగాలంటే…పొదిలికి న్యాయం జరగాలంటే…అది టీడీపీతోనే సాధ్యం.

జగన్ రెడ్డికి ఫోటోలు పిచ్చి పరాకాష్టకు
రాష్ట్ర ప్రజలకు చెందిన భూములన్నీ జగన్మోహన్ రెడ్డివే అనే విధంగా పట్టాదారు పాస్ పుస్తకాలపై తన ఫోటోలు వేసుకున్నాడు. దీని పేరు జగనన్న భూహక్కు పత్రం. ఈ భూమి మీ పితరులు మీకు ఇస్తే…జగన్ మీకు హక్కులు ఇవ్వడం ఏంటి? పాస్ పుస్తకం మీద తన ఫోటో వేసుకోవడం ఏంటి? జగన్ రెడ్డి ఫోటోలు పిచ్చి పరాకాష్టకు చేరింది. భూముల్లోని సరిహద్దు రాళ్లపై కూడా జగన్ రెడ్డి తన ఫోటోలు వేసుకున్నాడు. జగన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయితే మీ భూములకు చెందిన ఒరిజినల్ పత్రాలు ఉండవు, పట్టాదారు పాస్ పుస్తకం ఉండదు, అడంగల్ ఉండదు, అన్నీ ఆన్ లైన్ అని చెప్పి మీ ఆస్తులను జగన్ రెడ్డి తాకట్టు పెట్టేస్తాడు.అవసరమైతే అమ్మేస్తాడు.

అడిగేందుకు కోర్టులకు కూడా వెళ్లే పరిస్థితిని జగన్ రెడ్డి లాగేసుకున్నాడు. పేదవాళ్ల భూములు లాక్కునే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రైతుల మెడకు ఉరితాడుతో సమానం..దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. వైసీపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాను…ఈ చట్టాన్ని రద్దు చేయకపోతే జగన్ రెడ్డిని, వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయాలి..దీనికి మార్కాపురం ప్రజలంతా సిద్ధంగా ఉండాలి. నేను ముఖ్యమంత్రి అయ్యాక పెట్టే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు మీద పెడతాను.

సూపర్ సిక్స్ పథకాలతో అభివృద్ధి, సంక్షేమం
నేను ఇటీవల మన మ్యానిఫెస్టోను ప్రకటించాను. బాబు సూపర్ సిక్స్ అనే పేరుతో పథకాలు తెచ్చాను. ప్రజాగళం పేరుతో నేను మీ ముందుకు వచ్చాను…నాతోపాటు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ లు కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్ స్థాపనకు పాటుపడుతున్నాం. రాష్ట్రం, కేంద్రం కలిసి ఏపీని అభివృద్ధి చేస్తాం. కేంద్రం ప్రణాళికలు, రాష్ట్ర ప్రణాళికలు కలిపి అమలు చేస్తే రాష్ట్ర ప్రజలందరికీ మేలు కలుగుతుంది.

రాష్ట్ర మహిళలకు 4 ప్రత్యేక కార్యక్రమాలు ప్రకటించాం
ప్రతి మహిళకు నెలకు రూ.1,500, సంవత్సరానికి రూ.18వేలు, ఐదేళ్లలో 90వేలు అందిస్తాం. తల్లికి వందనం పేరుతో చదివే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.15వేలు అందిస్తాం…మీ పిల్లలందరినీ చదివించే బాధ్యత మాది…ఈ పథకంలో కటింగులు, ఫిటింగులు ఏమీ లేవు. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తాం. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం. కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి పేరుతో 3కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా తీర్చి దిద్దాలని భావిస్తోంది.. రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలకు రూ.10లక్షలు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.

జాబు రావాలంటే…బాబు రావాలి…అందుకే నేను ముఖ్యమంత్రి అయ్యాక తొలి సంతకం మెగా డీఎస్సీపైనే సంతకం చేస్తాను. రాష్ట్ర యువతకు 5ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు అందిస్తాం…ఏడాదికి 4లక్షల ఉద్యోగాలు అందిస్తాం. నిరుద్యోగులకు ప్రతినెల రూ.3వేలు భృతి అందిస్తాం. యువత భవిష్యత్తు మార్చే బాధ్యత నాది. చంద్రన్న బీమా ను నేను ముఖ్యమంత్రి అయ్యాక పునరుద్ధరిస్తాం…సహజ మరణానికి రూ.5లక్షలు, ప్రమాదంలో మరణిస్తే రూ.10లక్షలు అందిస్తాం. ఆరోగ్య బీమా ద్వారా ప్రతి కుటుంబానికి రూ.20లక్షలు వరకు ఉచిత వైద్యం అందించే ఏర్పాటు చేస్తాం.

ముస్లిములు, ఎస్సీ, బీసీలను ఆదుకుంటాం
ముస్లిం మైనారిటీలకు 50ఏళ్లకే పెన్షన్లు అందిస్తాం. ఖబరస్తాన్, ఈద్గాలకు స్థలాలు కేటాయిస్తాం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 4శాతం రిజర్వేషన్ అమలు చేస్తాం, హజ్ యాత్రకు లక్ష రూపాయలు ఆర్థికసాయం చేస్తాం, రూ.5లక్షల వడ్డీలేని రుణాలు ఇప్పించే ఏర్పాట్లు చేస్తాం. ఎస్సీ, బీసీలకు న్యాయం చేస్తాం. బీసీలకు బీసీ డిక్లరేషన్ ప్రకటించాం. ఎస్సీలకు జిల్లాల వారీగా రిజర్వేషన్ క్యాటగిరీలు అమలు చేస్తాం…మాదిగలకు న్యాయం చేస్తాం. మార్కాపురం నియోజకవర్గంలో నారాయణ రెడ్డిని ఎమ్మెల్యేగా, మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఎంపీగా గెలిపించాలని కోరుతున్నాను.

మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తాం
మన ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తాం. పొదిలి మండలానికి తాగు, సాగు నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటాను. పొదిలి పట్టణంలో ఉన్న పెద్ద చెరువును సాగర్ జలాలతో నింపి, ఇంటింటికీ కుళాయి ద్వారా నీరు అందిస్తాం. పొదిలికి రింగ్ రోడ్డు అందించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తాం, డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తాం.

బెల్లం వ్యాపారులపై వేధింపులు అరికడతాం. పొదిలి పట్టణం 10 వార్డులో షేక్ ఖాసిం అనే వ్యక్తి పిడుగు పడి చనిపోయి మూడేళ్లయినా ప్రభుత్వం ఎలాంటి సాయం అందించలేదు. మేము అధికారంలోకి వచ్చాక ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. టీడీపీ, జనసేన, బీజేపీ, ఎమ్మార్పీఎస్ నాయకులంతా కలిసి మే 13న రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలను విజయవంతం చేయాలి.

రాష్ట్ర ప్రజలను కాపాడుకునే బాధ్యత నాది…జగన్ రెడ్డిపై ప్రజలకు ఉన్న ఆవేశాన్ని ఓటుగా మార్చుకోవాలి…పోలింగ్ బూత్ లు దద్దరిల్లిపోవాలి…సైకిల్ స్పీడు పెంచండి…అడ్డొచ్చిన వాళ్లను తొక్కుకుంటూ ముందుకు వెళ్లిపోవాలి. వచ్చే ఎన్నికల్లో మన గెలుపు అన్ స్టాపబుల్.

LEAVE A RESPONSE