-జగన్మోహన్రెడ్డి కి దళిత సంక్షేమంలో డిస్టింక్షన్
-చర్చకు మేం సిద్ధం..అసెంబ్లీ వేదికగా చర్చిద్దామా..?
-సిఎం ని నోటికొచ్చినట్లు మాట్లాడటం పెద్దరికం అనిపించుకోదు చంద్రబాబూ…
-మా బిడ్డలకు విద్యా సాధికారత అందించిన ఘనత జగదే
-వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులతో దళితులకు మేలు
-దళితులను అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టింది జగన్
-దళిత సంక్షేమంపై చంద్రబాబుకి మాట్లాడే అర్హత లేదు.
-రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీల్లేదా..?
-చంద్రబాబు ఆర్ధిక శాస్త్రంలో సంక్షేమం, అభివృద్ధి లేనేలేవు
-మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:
ఎవరి హయాంలో దళితులకు మేలు జరిగిందో చర్చిద్దాం..
చంద్రబాబునాయుడికి ఒక ఊహా ప్రపంచం ఉంటుంది. ప్రతి విషయాన్నీ తానే కనిపెట్టాననే భ్రమల్లో ఉంటుంటాడు. ఎస్సీ నాయకులంతా చంద్రబాబు భ్రమలను ప్రచారం చేయాలనికోరుతున్నాడు. ముఖ్యమంత్రి ని పట్టుకుని చంద్రబాబు వాడు వీడు అంటూ తన స్థాయిని తగ్గించుకున్నాడు. చంద్రబాబునాయుడు దళిత సమస్యలపై చర్చించడానికి సిద్ధం అని ఇప్పటికైనా అన్నందుకు స్వాగతం తెలుపుతున్నాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, పార్టీ దళిత సమస్యలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము.
చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కొత్త రాష్ట్రానికి ఐదేళ్లు సిఎంగా చేశాడు. కొత్త రాష్ట్రంలో చంద్రబాబు దళితులకు ఏం చేశాడు..జగన్మోహన్రెడ్డి ఈ నాలుగేళ్లలో ఏం చేశారు అనేది చర్చించడానికి మేం సిద్ధంగా ఉన్నాం.
చెప్పుకోడానికి చంద్రబాబు వద్ద ఏమీ లేదు:
మీకు చెప్పుకోడానికి ఒక్క కార్యక్రమం కూడా లేదని నేను భావిస్తున్నాను. దళితుల జీవితాల్లో వెలుగులు రావాలంటే అంబేద్కర్ చెప్పినట్లు విద్య ముఖ్యం. చంద్రబాబు హయాంలో విద్యారంగాన్ని ఎంత బ్రష్టు పట్టించాడో అందరూ చూశారు.కార్పొరేట్ స్కూల్స్ బాగుపడటానికి చంద్రబాబు విధానాలు ఉపయోగపడితే, మా హయాంలో చేపట్టిన సంస్కరణలు పేదలకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. విద్యారంగంలో నాడు నేడు ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మౌళిక వసతులు మెరుగుపరిచారు. ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టి మా దళిత బిడ్డలకు నాణ్యమైన విద్యను అందింస్తున్నారు. డబ్బున్న వాళ్లు ఏ విధంగా కార్పొరేట్ స్కూల్‌కి వెళ్తున్నారో, డబ్బున్నోళ్లలా అదే ఆత్మగౌరవంతో మా పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్తున్నారు. విద్య అనేది ఒక పెట్టుబడి..సామాన్య మానవుడికి నాణ్యమైన విద్య ఇచ్చిన ఘనత జగన్మోహన్రెడ్డిది.
గతంలో ఎప్పుడూ పేదవాడికి విద్యా సాధికారత అందించాలనే ఆలోచన చంద్రబాబు చేయలేదు. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రభుత్వం రంగంలోనే నాణ్యమైన వైద్యం అందేలా చేయడం దళితులకు మేలు చేయడం కాదా అనేది నేను ప్రశ్నిస్తున్నా.విద్యా, వైద్య రంగాలు రెండు చాలు జగన్మోహన్రెడ్డి ఆలోచనా విధానం ఏమిటో చెప్పడానికి.రూ.2.08 లక్షల కోట్ల డీబీటీ అందిస్తే దానిలో 53 వేల కోట్లు పైచిలుకు దళితులకు అందితే గొప్ప సంస్కరణ కాదా..? కరోనా తర్వాత పేదవాడికి డబ్బు పంచండి అని ప్రపంచం అంతా చెప్తుంటే..దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేదు. ఏ ముఖ్యమంత్రీ ముందుకు రాలేదు. కానీ జగన్మోహన్రెడ్డి కరోనాలో సైతం గ్రామ వాలంటీర్లను పెట్టి వారికి డబ్బు అందించి కాపాడింది ముఖ్యమంత్రి . అలాంటి సందర్భంలో దళితులు, పేదవారు జగన్ గారికి అండగా ఉండి తీరతారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో ఒక్క పరీక్ష ద్వారా పారదర్శకంగా నియామకం చేస్తే దానిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలే అధికంగా ఉద్యోగాలు పొందారు.
అంత అసహనం ఎందుకు బాబూ..?:
మీరు ఎందుకు అంతగా అసహనానికి గురవుతున్నారు..? ఒక ముఖ్యమంత్రి ని పట్టుకుని వాడు వీడు అంటూ మాట్లాడటం సబబేనా..? 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే…దానిలో సింహభాగం మా దళితులకే అందాయి. మీ హయాంలో ఎప్పుడైనా పేదలకు ఇంత స్థాయిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆలోచించారా..? నీ ఆర్ధిక శాస్త్రంలో ఆ విధానం ఉందా..? ప్రపంచంలో అంతమంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తున్నది ఒక్క జగన్మోహన్రెడ్డి . దళితులను అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టింది జగన్.
దళితుల నాయకత్వం పెంచడం కోసం ఐదుగురు దళితులకు మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవులు ఇచ్చారు. అందులో ఒక డిప్యూటీ సీఎం, ఒక దళిత మహిళకు హోం మంత్రి వంటి కీలక పదవులు ఇచ్చారు. మండలి ఛైర్మన్‌గా మోషేన్ రాజును అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టారు. రాష్ట్ర క్యాబినెట్లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే. మండలిలో 43 మంది వైఎస్సార్సీపీ సభ్యులు ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ సభ్యులు 22 మంది ఉన్నారు. రాష్ట్రంలో 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే జగన్మోహన్రెడ్డి గారి నాయకత్వంలో 28 మంది గెలిచారు. నాలుగు పార్లమెంటు స్థానాల్లో నలుగురూ గెలిచారు. అదీ జగన్ గారి నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం, విశ్వాసం.ఇలాంటివి ఎప్పుడన్నా చంద్రబాబు ఊహల్లోకి వచ్చాయా..? రేపు చర్చకు వస్తే..జగన్ చేసిన మేలును నేను చేయను అని చర్చకు వస్తారా..?
ప్రతి కుటుంబం జగనన్నే మా భవిష్యత్తు అంటోంది:
దళిత సంక్షేమ విషయంలో చంద్రబాబుకు పాస్ మార్కులు కూడా రాలేదు. జగన్మోహన్రెడ్డి దళిత సంక్షేమంలో డిస్టింక్షన్లో పాస్ అయ్యారు.జగన్ చేసిన మేలుతో జగనన్నే మా భవిష్యత్తు అని ప్రతి కుటుంబం చెప్తోంది. దళిత సంక్షేమంపై చంద్రబాబుకి మాట్లాడే అర్హత లేదు.దళితులకు ఎవరేం చేశారో అసెంబ్లీలో చర్చించడానికి మేం సిద్ధం. అసెంబ్లీ కంటే ప్రజాస్వామ్యంలో చర్చావేదిక ఏం ఉంటుంది..మీరు చర్చిద్దాం అంటున్నారు కదా..అసెంబ్లీకి రండి. మీరు వస్తానంటే ప్రత్యేక అసెంబ్లీ పెట్టమని కూడా కోరతాం. డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రిని వాడు వీడు అంటారా..? మీ సీనియారిటీకి అది తగునా..?
రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీల్లేదా..?:
అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తామంటే దానికి వ్యతిరేకంగా కేసులు వేసింది చంద్రబాబునాయుడే.రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీలు లేదని చంద్రబాబునాయుడు చెప్తున్నాడు. ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని కోర్టులో కేసు వేస్తూ మీరు మళ్లీ దళిత సంక్షేమం గురించి మాట్లాడుతున్నారా..? విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం కడుతున్నారు..దళితుల ఆత్మగౌరవం ఎంతగా పెరుగుతుందో ఆలోచించాలి. విజయవాడలో ప్రతి ఒక్కరూ అంబేద్కర్‌ని చూసి గర్వంగా తిరిగే రోజు రాబోతోందని, దానికి జగన్ కృషి చేస్తున్నారని మీకు బాధగా ఉన్నట్లుంది.సిఎం ని నోటికొచ్చినట్లు మాట్లాడటం మీ పెద్దరికానికి మంచిది కాదు. అది మీ మనసులో ఉన్న అభిప్రాయమా..? మీరు అలా మాట్లాడటానికి కారణాలేమిటో ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి.