Suryaa.co.in

Andhra Pradesh

రాయలసీమ ప్రాజెక్ట్ లపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు

– 14 ఏళ్ళు సీఎంగా ఉండి సొంత నియోజకవర్గానికి నీరు ఇవ్వలేకపోయిన అసమర్థుడు
– ఈ రోజు రాయలసీమ కోసం అంటూ చేసేది ‘ఏడుపు యాత్ర’ మాత్రమే
– రాయలసీమ వాసులు చంద్రబాబు జిమ్మిక్కులను నమ్మరు
– రాయలసీమకు నువ్వు చేసిన దానిపై చర్చకు సిద్దమా?
– కుప్పంలో చర్చిద్దామని ఆహ్వానిస్తున్నాం.
– చంద్రబాబు ఏం చేశాడో… వైయస్ఆర్, వైయస్ జగన్ ఏం చేశారో చర్చిద్దాం
– గండికోట ద్వారా పుంగనూరు, తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లి కి నీరు అందించేందుకు వైఎస్ జగన్ సిద్ధం అయ్యారు
– అందుకు ఆవులపల్లి, నేతిగుంట్లపల్లి, ముదివేడు ప్రాజెక్టులు నిర్మిస్తుంటే….
– సుప్రీం కోర్టు వరకు వెళ్లి ఆ పనులను అడ్డుకుంది చంద్రబాబు కాదా?
– హంద్రీనీవాకు వైఎస్ఆర్ 5 ఏళ్ళలో 95 శాతం పనులు పూర్తి చేశారు
– ఆ తరువాత 5 ఏళ్లు సీఎంగా ఉండి మిగిలిన 5 శాతం పనులు కూడా పూర్తి చేయలేను దుస్థితి చంద్రబాబుది
– కుప్పం బ్రాంచ్ కెనాల్ ను కూడా కమిషన్ల కక్కుర్తితో పూర్తి చేయలేకపోయావ్
– రూ. 200 కోట్ల అంచనా వ్యయాన్ని రూ. 440 కోట్లకు పెంచి…
– సీఎం రమేష్ కు పనులు కట్టబెట్టింది చంద్రబాబు కాదా?
– రాయలసీమ ప్రాజెక్ట్ లపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు
– సొంత నియోజకవర్గం కుప్పంకే నీళ్ళివ్వలేక పోయాడు
– 14 ఏళ్ళు సీఎంగా ఉండి చిత్తూరు జిల్లాకు ప్రాజెక్ట్ లు తేలేకపోయాడు
– కుప్పం నియోజకవర్గంకు మేలు చేసే పాలెం రిజర్వాయర్ పై స్టే తేవడానికి చంద్రబాబు సూత్రదారి
– ఆనాడు వైయస్ఆర్… నేడు వైయస్ జగన్ వల్లే రాయలసీమకు నీళ్ళు
– రాష్ట్ర అటవీ, ఇంధన, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

రాయలసీమ ప్రాంతానికి తాను ఏం చేశాడు… ఆనాడు వైయస్ఆర్ గారి హయాం, నేడు వైయస్ జగన్ ఏం చేశారో చర్చించేందుకు సిద్దమా? అని చంద్రబాబుకు రాష్ట్ర అటవీ, ఇంధన, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ మేరకు ప్రజల సమక్షంలో చర్చకు తాను సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు.

రాయలసీమ ప్రాజెక్ట్ ల కోసం చంద్రబాబు తలపెట్టిన యాత్ర కేవలం సీఎం వైయస్ జగన్ రాయలసీమకు చేస్తున్న మంచిని చూసి ఓర్వలేక చేసే ‘ఏడుపు యాత్ర’ అని విమర్శించారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే….

చంద్రబాబు నాయుడు రాయలసీమకు ఏం చేశారని ఒకసారి చూస్తే…. ఆయనకు రాయలసీమ మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాలోనే చాలా వెనుకబడిన ప్రాంతం అయిన పుంగనూరు, పీలేరు, మదనపల్లి, కుప్పం, పలమనేరు, తంబళ్ళపల్లి ప్రాంతాలను పోల్చుకుంటే దారుణమైన పరిస్థితి ఉంది. 14 నుంచి 15వందల అడుగుల లోతులో బోర్లు వేసినా అవి ఫెయిల్ అవుతున్నాయి. రైతులు అప్పులపాలై బెంగుళూరు వంటి ప్రాంతాలకు వలసలు పోయే పరిస్థితిని చూశాం.

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆవులపల్లి, నేతిగుంటపల్లి, ముదివేడు రిజర్వాయర్ లతో ఈ ప్రాంతానికి నీటిని అందించాలని, కాలువల ద్వారా అన్ని నియోజకవర్గాల్లోనూ చెరువులను నింపుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఈ మేరకు వాటి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతపురం వాసులకు ఇబ్బంది లేకుండా వైయస్ జగన్ తన సొంత నియోజకవర్గం లోని గండికోట రిజర్వాయర్ ద్వారా నికర జలాలను చిత్తూరు జిల్లాలోని ఈ ప్రాంతానికి నీటిని ఇచ్చేందుకు ఆలోచన చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఎన్జీటికి ఫిర్యాదుల పంపి, సుప్రీంకోర్ట్ కు వెళ్ళి ఈ ప్రాజెక్ట్ ల మీద చంద్రబాబు స్టే తీసుకువచ్చారు. రాయలసీమ సంగతి దేవుడు ఎరుగు… కనీసం సొంత జిల్లాలో కూడా ఇలాంటి అడ్డంకులు సృష్టిస్తున్న చంద్రబాబుకు ఏం నైతిక విలువ ఉందని ఈ రాయలసీమ ప్రాజెక్ట్ ల గురించి యాత్ర చేయడానికి అని అడుగుతున్నాను.

కుప్పం నియోజకవర్గంకు హంద్రీనావా నీరు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చాడు. ప్రజలంతా నమ్మారు, చాలాసార్లు ఓట్లు వేశారు. దాదాపు 14 సంవత్సరాలు సీఎంగా, ఏడుసార్లు శాసనసభ్యుడుగా ఉన్నావు, అంటే దాదాపు 35 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉండి కూడా కనీసం పలమనేరు దాకా వచ్చిన నీటిని కుప్పంకు తీసుకు వెళ్ళలేకపోవడం నీ అసమర్థత కాదా చంద్రబాబూ?.

పద్నాలుగు ఏళ్ళు సీఎంగా ఉండి కాలయాపన చేశాడు. ఇటీవల కుప్పంలో మాట్లాడుతూ నాకు ఆరు నెలలు సమయం ఇస్తే చాలు హద్రీనీవా పూర్తి చేస్తాను అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. కుప్పం పరిస్థితిని సీఎంవైయస్ జగన్ దృష్టికి తీసుకువెడితే, ఆయన కుప్పం సమావేశంలో హంద్రినీవా పూర్తి చేస్తాను, అన్ని చెరువులు నింపడంతో పాటు సాగు, తాగు నీరు ఇస్తానని హామీ ఇచ్చారు.

ఇచ్చిన హామీ మేరకు పనులు వెంటనే ప్రారంభమయ్యాయి, మరో రెండు నెలల్లో సీఎం స్వయంగా వచ్చి పనులు ప్రారంభించే పరిస్థితి ఉంది. ఈ రోజు కుప్పంకు నీళ్ళు వస్తున్నాయంటే సీఎం వైయస్ జగన్ వల్లే వస్తున్నాయి. వైయస్ జగన్ చెప్పిన మాట ప్రకారం పనులు పరుగులు తీస్తున్నాయి.

చంద్రబాబు సొంత జిల్లాకు, చివరికి సొంత నియోజకవర్గంకు కూడా అన్యాయం చేశాడు. ఈరోజు రాత్రికి రాత్రి ఆయనకు రాయలసీమ గుర్తుకువచ్చిందా? ఆరోజుల్లో దివంగత వైయస్ఆర్ 95 శాతం హంద్రీనీవా పూర్తి చేశారు. మిగిలిన అయిదు శాతం పూర్తి చేసేందుకు చంద్రబాబుకు చేతులు రాలేదు. అటువంటి ఆయన ఈ రోజు రాయలసీమ ప్రాజెక్ట్ ల గురించి మాట్లాడుతున్నారు.

చంద్రబాబు కుప్పంకు రెండు వందల కోట్లతో టెండర్లు పిలిచారు. దానిని రూ. 440 కోట్లకు ఏ విధంగా పెంచారు? టిడిపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కు ఆ పనులు ఇచ్చారు. ఇప్పుడు ఆయన బిజెపిలో ఉన్నారు. శ్రీశైలంకు వరద నీరు వస్తుంటే, వరదలు తగ్గిన తరువాత సీఎం వైయస్ జగన్ గారు ఆలోచన చేసి 60 రోజుల్లో 40 టీఎంసిలు హంద్రీనీవాకు తరలించేందుకు కాలువలను వెడల్పు చేసి, నీటిని అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు పనులు వేగంగా జరుగుతున్నాయి.

టీడీపీ హయాంలో హంద్రీ నీవా ద్వారా 5 సంవత్సరాలలో తరలించింది 133.11 టిఎంసిలు మాత్రమే. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నాలుగు ఏళ్లలోనే 154.46 టిఎంసిల నీటిని తరలించి రాయలసీమను సస్యశామలం చేసారు. అంటే సగటున చంద్రబాబు నాయుడు ఏడాదికి 26.62 టిఎంసిల నీటిని అందిస్తే, సీఎం శ్రీ వైఎస్ జగన్ సగటున 38.62 టిఎంసిల నీటిని అందించారు.

రాయలసీమ, నెల్లూరు ప్రాంతానికి 59 టిఎంసిల నీరు అందించేందుకు తెలుగుగంగ ప్రాజెక్టును చేపట్టారు. 1985 నుండి 2004 వరకు ఈ ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేసింది 1788.75 కోట్ల రూపాయలు. ఆ సమయంలో 9 సంవత్సరాలు పాటు చంద్రబాబు ముఖ్యమంత్రి. అదే రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 2004 నుండి 2014 వరకు ఇందుకోసం మొత్తం 2233.70 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

ఇదే ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ మట్టికట్టకు 2014 నుండి 2019 మధ్య 668.11 కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు లీకేజీలకు అడ్డుకట్ట వేయలేదు, ప్రధాన కాలువకు లైనింగ్ కూడా చేయలేదు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచాక 500 కోట్ల రూపాయలతో ఆ పనులు పూర్తి చేసి… ప్రతి సంవత్సరం సకాలంలో వెలిగోడు రిజర్వాయర్ ను సకాలంలో నింపుతున్నారు. మైదుకూరు, బద్వేల్ నియోజకవర్గాలకు నీరు ఇచ్చి సస్యశ్యామలంగా మారుస్తున్నారు.

గాలేరు నగరి ప్రాజెక్టు కు 1995 నుండి 2004 వారకు చంద్రబాబు ఖర్చు చేసింది అక్షరాల 17.52 కోట్లు మాత్రమే, అవి కూడా ఆఫీస్ నిర్వహణ కోసం ఖర్చు అయ్యింది. అనంతరం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గాలేరు నగరి కోసం 4283.08 కోట్ల రూపాయలు వెచ్చించారు.

గండికోట రిజర్వాయర్ సామర్ధ్యం 26.85 టీఎంసీలు, అయితే 2014 – 19 మధ్య నిర్వాసితులకు పునరావాసం కల్పించక పోవడంతో కేవలం ఐదారు టీఎంసీలు కూడా నిల్వ చేయలేని దుస్థితి ఉన్నింది. మా ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక వెయ్యి కోట్ల రూపాయలతో నిర్వాసితులకు పునరావాసం కల్పించి 2020 నుండి ప్రతి ఏటా ఫుల్ కీపాసిటి అంటే 26.85 టిఎంసిల నీరు నిల్వ చేస్తున్నారు.

చిత్రవతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిస్థితి కూడా ఇంతే 10 టిఎంసిల నిల్వ సామర్ధ్యం ఉన్నప్పటికీ, చంద్రబాబు పునరావారం కల్పించకపోవడంతో కేవలం ఐదారు టీఎంసీలు మాత్రమే నిల్వ చేసే పరిస్థితి ఉండేది, అయితే వైఎస్ జగన్ అధికారం వచ్చాక 600 కోట్ల రూపాయలతో పునరావాసం ఏర్పాటు చేసి గరిష్ట స్థాయిలో నీటి నిల్వ చేస్తున్నారు.

2015 లో శ్రీశైలం నుండి 800 అడుగుల కంటే దిగువ నుండి అక్రమంగా నీటిని తరలించడానికి తెలంగాణ సర్కార్ పాలమూరు – రంగారెడ్డి, డిండి పధకాలను చేపడితే, నాటి సీఎం చంద్రబాబు ఎందుకు అడ్డుకోలేక పోయారు ? ఓటుకు నోటు కేసులో తెలంగాణకు అడ్డంగా దొరికిన బాబు, ఆ కేసు నుండి తప్పించుకోవడానికి కృష్ణ జలాల పై రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారు.

రాయలసీమ ఎత్తిపోతల పధకాన్ని చేపట్టి, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షణకు నడుం బిగించింది సీఎంవైఎస్ జగన్. దీనిపై తెలంగాణ సర్కార్ ఎన్జీటీని ఆశ్రయించింది. విభజన చట్టం 11వ షెడ్యూల్ లో గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ తో పాటు వెలిగొండ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇచ్చింది, కానీ కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డు ఆ ప్రాజెక్టులను అనుమతించలేదు.

వాటి అనుమతి తెచ్చుకోక పొతే నీటి వినియోగానికి అనుమతించం అని 2014 నుండి తెగేసి చెబుతున్నా చంద్రబాబు నోరు ఎందుకు మెదపలేదు. వైఎస్ జగన్ అధికారం లోకి వచ్చాక కేంద్రంతో చర్చించి, ఒప్పించి ప్రాజెక్టులకు అనుమతి ఉందని ఉత్తర్వులు ఇప్పించారు. ఈ విషయాలు అన్ని కూడా చంద్రబాబు నాయుడుకి తెలుసు. అయన రాయలసీమకు చేసిన అన్యాయం మారే ప్రాంత నాయకులు కూడా చేయలేదు.

సొంత నియోజకవర్గంలోని ప్రాజెక్ట్ రానివ్వని నువ్వు రాయలసీమ ప్రాజెక్ట్ ల గురించి చేసే యాత్ర ఏ విధంగా ఉంటుంది. దీనిపై చర్చకు రావాలి. ఆ చర్చలో ప్రజలు కూడా పాలు పంచుకుంటారు. ఆ తరువాత రాయలసీమ యాత్ర చేస్తే బాగుంటుందని కోరుతున్నాం. రాయలసీమపై కొంచెమైనా చిత్తశుద్ది, లేకుండా తాను పుట్టిన ప్రాంతం అయినా కూడా ఏ మాత్రం ప్రేమ లేకుండా చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

చివరికి కుప్పం ప్రజల కోసం పాలార్ ప్రాజెక్ట్ కు స్వర్గీయ వైయస్ఆర్ టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించాలని భావిస్తే… తమిళనాడు ప్రభుత్వం ద్వారా దానికి అడ్డంకులు కల్పించడంలో చంద్రబాబు ప్రధాన సూత్రధారిగా నిలిచాడు.

ఆనాడు కేంద్రంలో భాగస్వామిగా, తన ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉండి కూడా రాయలసీమ ప్రాజెక్ట్ లను నిర్లక్ష్యం చేశారు. సాగునీటి ప్రాజెక్ట్ లపై ఉదాసీనంగా వ్యవహరించారు. గతంలో వైయస్ రాజశేఖరరెడ్డి గారు, నేడు వైయస్ జగన్ హయాంలోనే ఆ ప్రాజెక్ట్ లకు మోక్షం లభిస్తోంది. ఆనాడు వైయస్ఆర్ హయాంలో వచ్చిన ఫలితాలను, ఈ రోజు జగన్ గారి పాలనలో సీమ ప్రజలు పొందుతున్నారు. ఇవ్వన్నీ తెలిసి కూడా చంద్రబాబు తెలియనట్లు నటిస్తున్నాడు. చంద్రబాబు కళ్ళుండి చూడలేక, చెవులుండి వినలేని స్థితిలో ఉన్నాడు. ఆయనకు అవసరమైనవి తప్ప ప్రజలకు ఏవి అవసరమో చంద్రబాబుకు పట్టదు.

అనంతరం ఆయన మీడియా ప్రశ్నలకు బదులిస్తూ….
రాయలసీమ ప్రాజెక్ట్ లపై చంద్రబాబుతో ఎక్కడైనా చర్చకు సిద్దమే. చర్చ పుంగనూరు కంటే కుప్పంలో అయితే బాగుంటుంది. ఆయన సొంత నియోజకవర్గంలోని ప్రజలకు కూడా బాగా అర్థమవుతుంది. పుంగనూరులో అయితే చంద్రబాబును ప్రజలు వ్యతిరేకిస్తే, అదికూడా మేమే చేయించామని చెప్పుకుంటాడు. అందుకే ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో చర్చకు వస్తే బాగుంటుదని కోరుతున్నాం. మేం ప్రజాస్వామికవాదులం. ఎవరిని అడ్డుకోం. చంద్రబాబు యాత్రను అడ్డుకునేందుకు మేం దిగజారాల్సిన అవసరం లేదు.

LEAVE A RESPONSE