– ఆయన సొంత అకౌంట్ నుంచి 6 లక్షలు పెట్టి టికెట్ కొన్నారు
– ఆయన పీఏలూ టికెట్ కొని రావలసిదే
– ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్ మ్యూజికల్ నైట్ టికెట్లపై నారా భువనేశ్వరి చమత్కారం
విజయవాడ: ‘‘అది ఒక ఆశయం కోసం నిర్వహిస్తున్న మ్యూజికల్ నైట్. కాబట్టి ఎవరైనా డ బ్బులుపెట్టి టికెట్ కొనాల్సిందే. చివరకు సీఎం చంద్రబాబునాయుడుకీ ఫ్రీ లేదు. ఆయన తన అకౌంట్ నుంచి 6 లక్షలు పెట్టి టికెట్ కొన్నారు. ఆయనతో వచ్చే పీఏలు కూడా టికెట్ కొని రాకపోతే లోపలికి రానీయరు’’ అని సీఎం చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి చమత్కరించారు. చంద్రబాబు రూ.6 లక్షలతో టికెట్ కొన్నారని, ఐదుగురికి ఒక టేబుల్ బుక్ చేసుకున్నారని భువనేశ్వరి వివరించారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బంది కూడా టికెట్ కొంటేనే ఈ కార్యక్రమానికి అనుమతించడం జరుగుతుందని స్పష్టం చేశారు. నారా భువనేశ్వరి ఆధ్వర్యంలోని ఎన్టీఆర్ ట్రస్ట్.. నిధుల సేకరణ నిమిత్తం, భారీ మ్యూజికల్ నైట్ కార్యక్రమం నిర్వహిస్తోంది.
చంద్రబాబు ఖర్చులకు తానే డబ్బులు ఇస్తుంటానని, కానీ ఈసారి మాత్రం చంద్రబాబు తన సొంత ఖాతాలోని డబ్బుతో టికెట్ కొన్నారని తెలిపారు. చంద్రబాబు వెనుక వచ్చే ఆయన పీఏలు కూడా ఫ్రీగా వద్దామనుకుంటే కుదరదని, వారు కూడా టికెట్ కొనాల్సిందేనని.. టికెట్ లేకపోతే మిమ్మల్ని లోపలికి రానివ్వబోమని వాళ్లని హెచ్చరించానని చమత్కరించారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ యుఫోరియా మ్యూజికల్ నైట్ పేరిట ఫిబ్రవరి 15న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ సంగీత విభావరికి..సంగీత దర్శకుడు తమన్ తన ట్రూప్ తో ఆడియన్స్ ను ఉర్రూతలూగించనున్నాడు.