– మాజీ మంత్రి దేవినేని ఉమా
విజయవాడ: నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇది తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక గర్వకారణమైన రోజు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ గొల్లపూడి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు, 15 ఏళ్లపాటు రాష్ట్రాన్ని నడిపించారు. ఆ కాలంలో కరువులు, ఆర్థిక సమస్యలు, విద్యుత్ సంక్షోభం వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ప్రజలకు ఆశాకిరణంలా నిలిచారు. క్రమశిక్షణతో, దూరదృష్టితో సంక్షోభాలను అధిగమించి ప్రజలకు భరోసా కల్పించారు అని ఆయన వివరించారు.
హైదరాబాద్ అభివృద్ధి అంటే చంద్రబాబు పేరు తప్పనిసరిగా గుర్తు వస్తుంది. ఆయన కలల ప్రాజెక్టులే హైటెక్ సిటీ, సైబరాబాద్, శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్. ఆయన తీసుకున్న దూరదృష్టి నిర్ణయాల వల్లే హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా ఎదిగింది. ఐటీ రంగంలో అనేక యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించబడ్డాయి అని దేవినేని ఉమామహేశ్వరరావు గుర్తుచేశారు.