Suryaa.co.in

Andhra Pradesh

జగన్.. నువ్విక ఇంటికే

-అగ్గికి పవనం తోడైంది
-నీ సినిమా అయిపోయింది
-టీడీపీ-జనసేన పొత్తు వైసీపీ విముక్త ఏపీ కోసం
-ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు..జనం కోరుకున్న పొత్తు
-సినిమా టికెట్ల పేరుతో చిరంజీవిని, దర్శకుడు రాజమౌళిని అవమానించారు
-సొంత చెల్లి, తల్లినీ జగన్ వదిలిపెట్టలేదు
-జగన్ ఒక బ్లఫ్ మాస్టర్
-అట్టర్ ప్లాప్ సినిమాకు సీక్వెల్ ఉండదు
-టీడీపీ-జనసేన విన్నింగ్ టీమ్.. వైసీపీ ఛీటింగ్ టీమ్
-త్వరలోనే టీడీపీ-జనసేన ఎన్నికల మేనిఫెస్టో
-వైసీపీ అగ్గి రాజేసింది…ఆ అగ్గితోనే వైసీపీని తగలబెట్టడానికి సిద్ధం
– ఆ అగ్గికి వాయువు పవన్ కల్యాణ్ తోడయ్యారు
– పొత్తు గెలవాలి…రాష్ట్రం నిలవాలి, ప్రజల బతుకులు వెలగాలి
– టీడీపీ-జనసేన పొత్తు సూపర్ హిట్
– తాడేపల్లిగూడెం జెండా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

తాడేపల్లిగూడెం : నేడు తాడేపల్లిగూడెంలో ‘తెలుగు జన’ విజయకేతనం జెండా సభ జరిగిన 28-02-24 చరిత్రను తిరగరాసే రోజు. మనం పోరాడాల్సింది వైసీపీ దొంగలపై. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రెండు పార్టీలు కలిసిన తర్వాత జరిగే మొదటి ఎన్నికల ప్రచార సభ ఇది. ఏపీ దిశా, దశా మార్చబోయే సభ ఇది.

అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాలకులను తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ సభకు వచ్చిన ప్రజలను చూస్తే తాడేపల్లి ప్యాలెస్ కంపించబోతోంది. ఈ సభ స్పందన శుభసూచికం. త్వరలో రాష్ట్రానికి నవోదయం. ఇది జరిగి తీరుతుంది. రాబోయే ఎన్నికలు రాష్ట్రానికి కీలకం. అందుకే రెండు పార్టీలు కలిసి బరిలో దిగాయి. మేం చేతులు కలిపింది మా కోసం, అధికారం కోసం, నా కోసం, పవన్ కల్యాణ్ కు అధికారం కోసమో కాదు. రాష్ట్రం కోసం, 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్ కోసం చేతులు కలిపాం. యువత, విద్యార్థులు, పుట్టిన, పుట్టబోయే బిడ్డల కోసం, వారి భవిష్యత్ కోసం కలిశాం.

విధ్వంసమైన రాష్ట్రాన్ని నిలబెట్టడానికి చేతులు కలిపాం. హత్యకు గురైన రాష్ట్రాన్ని తిరిగి బతికించడానికి మేంచేతులు కలిపాం. దెబ్బతిన్న రైతుల కోసం, బిడ్డల ఉద్యోగాల కోసం కలిసి బరిలో దిగాం. ప్రభుత్వ బాదుడుతో చిధ్రమవుతున్న పేదవారిని కాపాడేందుకు ఇద్దరం కలిసి అడుగులేస్తున్నాం. మా పొత్తు వైసీపీ విముక్త ఏపీ కోసం. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేందుకు మా పొత్తు.

ఈ పొత్తు ప్రజలు కోరుకున్నది..ప్రజలు కుదిర్చింది
ఒక వ్యక్తి అహంకారం వల్ల జరిగే నష్టాన్ని సీనియర్ నేతగా నేను చూస్తూ ఊరుకోలేను. ప్రశ్నించే తత్వం, ఎదురించే తత్వం ఉన్న పవన్ కల్యాణ్ కూడా మౌనంగా ఉండలేరు. అందుకే ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు. జనం కోరుకున్న పొత్తు. రాష్ట్రంలో వెలుగులు నింపే పొత్తు. రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం మాతో చేతులు కలపాలని కోరుకుంటున్నా. రాష్ట్ర పరిస్థితి 2014కు ముందు హేతుబద్ధత లేకుండా విభజన చేశారు. పవన్ ఎన్నికల ముందే తాను పోటీచేయడం లేదని, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు టీడీపీ, బీజేపీని సమర్థిస్తామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.

మేం అధికారాన్ని బాధ్యతగా తీసుకుని ప్రతిక్షణం రాష్ట్రం కోసం ఆలోచించాం. రాజధాని లేని రాష్ట్రం, పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని ఏం చేయాలని ఆలోచించాం. హైదరాబాద్ లేని రాష్ట్రం కనీసం పింఛన్లైనా ఇస్తారా అని ప్రజలు ఆలోచించే సమయంలో అనేక కార్యక్రమాలు చేశాం. ఏపీలో అన్ని వనరులు ఉన్నాయి. ప్రపంచాన్ని జయించే శక్తి ఆంధ్రా తమ్ముళ్లకు ఉంది. సమర్థమైన ప్రజలు ఉన్నారు. పోలవరం ఉంది. సముద్రతీరం ఉంది. బంగారం పండించే భూములు ఉన్నాయి.

అన్నదాతగా, అన్నపూర్ణగా రాష్ట్రానికి పేరు వచ్చిందంటే గోదావరి, కృష్ణా డెల్టాలే కారణం. ఇలాంటి రాష్ట్రాన్ని బాగుచేయాలని ముందుకు వెళ్లాం. 2029కి విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అమరావతిని హైదరాబాద్ కంటే మిన్నగా ఉండాలని రూపకల్పన చేశాం. పోలవరం పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని ఉన్నతమైన సంకల్పంతో ముందుకు వెళ్లాం.

కేంద్ర నుంచి 11 విద్యాసంస్థలను తీసుకువచ్చాం. ఢిల్లీకి వెళితే రాష్ట్రం కోసం వెళ్లాం. అనేకం సాధించాం. ప్రపంచమంతా తిరిగి 16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చాం. పది లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇవన్నీ ఇటుకా ఇటుకా పేర్చి కట్టిన సౌధాన్ని జగన్ వచ్చి ఒక్క గొడ్డలివేటుతో నాశనం చేశారు.

మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ ను పిచ్చోడిని చేసి చంపేశారు
ఇవాళ రాష్ట్రంలో సైకో పాలన ఉంది. ఏ రాష్ట్రంలోనైనా సైకో పాలన ఉందా, ఏ ముఖ్యమంత్రినైనా సైకో అన్నారా? ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేశారా? ప్రజావేదిక కూల్చివేత ద్వారా పరిపాలన ప్రారంభించారు. ఇదే అతని నిజమైన నైజం. విధ్వంసానికి దారితీశారు. మీడియాను కంట్రోల్ చేయడానికి, ప్రతిపక్షాలను కంట్రోల్ చేయడానికి జీవో నెం.1 తీసుకువచ్చారు.

మీటింగ్ లు అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఎన్నికల ముందు ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రి తర్వాత మీడియాపైనా, అందరిపైనా పిడిగుద్దులు గుద్దారు. తూ.గో జిల్లాలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఎమ్మెల్సీ కారులో డోర్ డెలివరీ చేశారు. అన్నా క్యాంటీన్లు మూసివేశారు. అన్నా క్యాంటీన్ల ద్వారా అన్నం పెట్టకూడదన్న దుర్మార్గుడు. పెత్తందారీ వ్యవస్థకు ఇది నిదర్శనం. రాజధానిని అడ్డుకున్నారని, శాసనమండలిలో బిల్లు పాస్ చేశారని, ఆ మండలిని రద్దు చేయాలని కోరిన వ్యక్తి జగన్ రెడ్డి. ఇది ఎంతటి అధికార దుర్వినియోగమో గమనించాలి.

మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ ను పిచ్చోడిని చేసి చంపేశారు. ఇది అతని అరాచకానికి పరాకాష్ట. రాజధానిలో విట్, ఎస్ఆర్ఎం, అమృత్ వంటి యూనివర్సిటీల్లో 15వేల మంది బయటివారు వచ్చి చదువుకునే పరిస్థితి. ఇవన్నీ టీడీపీ తీసుకువచ్చిందనే దురుద్దేశంతో రోడ్లు, నీళ్లు కూడా ఇవ్వలేదు. మట్టిని కూడా తవ్వుకుని వెళ్లిపోయారు. అంతర్జాతీయ క్రికెటర్ హనుమ విహారి వైసీపీ వేధింపులు తట్టుకోలేక పారిపోయారు.

సొంత చెల్లి, తల్లిని కూడా జగన్ వదిలిపెట్టలేదు
తన సొంత చెల్లెలు, ఆస్తి తగాదాలతో, ప్యాలెస్ తగాదాలతో విభేదించి వేరే పార్టీలో చేరితే ఆమె పుట్టుకపైనా, చెల్లెలిపైనా, తల్లిపైనా సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టారంటే ఎలాంటి వ్యక్తో ఆలోచించుకోవాలి. సీఎం మానసిక స్థితికి ఇవన్నీ నిదర్శనం. పవన్ కల్యాణ్ ఇప్పటంలో మీటింగ్ పెట్టారు. సభకు స్థలం ఇచ్చారని ప్రొక్లెయిన్ లు తీసుకువెళ్లి ఇళ్లను కూలగొట్టారు.

నేను సీఎంగా ఉన్నప్పుడు తిరుపతిలో ఒక సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ఆడవారిని చంపేవాడు. ఒంటరిగా ఉన్నవారిని క్రూరంగా చంపేసేవాడు. అతడిని పట్టుకోవాలని చెప్పాను. చేయలేకపోయారు. చివరకు పట్టుకుంటే నేరాలు చేసి జైలుకుపోయిన వ్యక్తి అని తేలింది. మహిళలపై ద్వేషం పెట్టుకుని ఇవన్నీ చేశాడు. 40 మందిని చంపేశాడు. అతడిని జైల్లో పెట్టాం. చివరకు రాజంపేట నుంచి వస్తూ ఎన్ కౌంటర్ లో చనిపోయాడు.

ఆ కేసుకు, ఈ కేసుకు సంబంధం ఉంది. ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం కోసం, డబ్బుల కోసం, రాజకీయం కోసం ఇవన్నీ చేస్తున్నాడు. ఎవరన్నా లెక్కలేదు. అందరినీ అణచివేయడమే ఆదర్శంగా పెట్టుకున్నారు. మనపై పవిత్రమైన బాధ్యత ఉంది. వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి సైకో నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలి. సిద్ధమా?

తెలుగుజాతిని ప్రపంచంలోనే నెం.1 కమ్యూనిటీగా చేయడమే మా సంకల్పం
ఈ రాష్ట్రాన్ని జగన్ రెడ్డి రాష్ట్రంగా చూడటం లేదు. ప్రజలున్నారనే ఆలోచన లేదు. కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విభజించి సర్వనాశనం చేయాలని చూస్తున్నారు. కులాలు కూడు పెట్టవు. మంచి ప్రభుత్వాలే జీవితాలను మారుస్తాయి. లేకపోతే అంతా సర్వనాశనమే. ఏపీ అంటే మంచి రాష్ట్రం. నా ఆలోచన, పవన్ కల్యాణ్ గారి ఆలోచన తెలుగుజాతిని ప్రపంచంలోనే నెం.1 కమ్యూనిటీగా చేయాలని మా సంకల్పం. దీనికి మీరు సిద్ధంగా ఉండాలి. మేం ఇద్దరం కలిసి పొత్తులు పెట్టుకున్నాం. మాకు ఏం భేషజాలు లేవు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే ఎలాంటి త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధమా?

సినిమా టికెట్ల పేరుతో చిరంజీవిని, రాజమౌళిని అవమానించారు
పవన్ విమానంలో వస్తే వీళ్ల అబ్బసొత్తు మాదిరిగా విమానాశ్రయానికి వీలులేదంటారు. విశాఖ వీధుల్లో తిరగకూడదని హోటల్లో కట్టడి చేసే పరిస్థితికి వచ్చారు. సినీ ప్రముఖులను కూడా శాసించే స్థితికి వెళ్లారు. సినిమా టికెట్ల పేరుతో మహా నటుడు చిరంజీవిని, మహా దర్శకుడు రాజమౌళిని అవమానించే స్టేజ్ కి వెళ్లారు. నేను బాధపడ్డా, నొచ్చుకున్నా, జీవితంలో ఇలాంటివి జరగకూడదని అనుకున్నా.

వై నాట్ 175అంటున్నాడు జగన్.. ఏం పొడిచాడని? వై నాట్ జాబ్ కేలండర్, డీఎస్సీ, ఉచిత ఇసుక. వైనాట్ పులివెందుల? తాడేపల్లిగూడెం శబ్ధం పులివెందులకు వినపడాలి. హూ కిల్డ్ బాబాయ్? సమాధానం చెప్పాలని సవాల్ విసురుతున్నా.

జగన్ ఒక బ్లఫ్ మాస్టర్
జగన్ ఒక బ్లఫ్ మాస్టర్. అబద్ధాలు, చేయని పనిని చేసినట్లుగా చెప్పడం. కనికట్టు చేసే వ్యక్తి జగన్ రెడ్డి. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు. తెచ్చాడా? మద్యపాన నిషేధం చేశావా, సీపీఎస్ రద్దు చేశావా? కుప్పంలో 35 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా. కుప్పానికి నీళ్లని నాటకాలు వేశాడు. ట్యాంకర్ లో నీళ్లు తీసుకెళ్లి కాలువలో పోశాడు, గేట్లు తీసుకెళ్లాడు.

సినిమా సెట్టింగ్ వేశాడు. నీళ్లు వదిలి వస్తే తెల్లారితే లేవు. గేట్లు తెల్లారితే లేవు. సెట్టింగులు తీసుకుని వెళ్లిపోయారు. ఇదీ జగన్ రెడ్డి విశ్వసనీయత. లక్ష ఓట్ల లక్ష్యంగా కుప్పంలో బాబుకు సహకరించాలని నేను పిలుపునిచ్చా. జగన్ రెడ్డి నా నియోజకవర్గంలో లక్ష మెజార్టీ వస్తుంది. నీ నాటకాలు పట్టించుకోరు.

అట్టర్ ప్లాప్ సినిమాకు సీక్వెల్ ఉండదు జగన్
వైసీపీ అగ్గి రాజేసింది.. ఆ అగ్గితోనే వైసీపీని తగలబెట్టడానికి సిద్ధం. జగన్ ది ప్లాప్ సినిమా. అధికారం కోసం పాదయాత్ర చేశాడు. నేను తలచుకుంటే పాదయాత్ర చేసేవాడా? ఒక్క అవకాశం ఇవ్వాలని బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. ఐదేళ్ల పాలన అంతా అట్టర్ ప్లాప్. నమ్మి ఓట్లేసిన వాళ్లు ఛీ కొడుతున్నారు. ఆ సినిమా అట్టర్ ప్లాప్. దీనికి సీక్వెల్ ఉండదు. అట్టర్ ప్లాప్ సినిమాకు సీక్వెల్ ఉంటుందా తమ్ముళ్లు? ఆ సినిమా అయిపోయింది. వైసీపీ రౌడీలకు 40 రోజుల్లో రియల్ సినిమా చూపిస్తాం.

జనసేన, టీడీపీ పొత్తు సూపర్ హిట్. నీ కుట్రలు, కుతంత్రాలు అట్టర్ ప్లాప్. విధ్వంసానికి ఇక ఫుల్ స్టాప్. అందుకే టీడీపీ-జనసేన విన్నింగ్ టీమ్.. వైసీపీ ఛీటింగ్ టీమ్. ప్రశాంత రాష్ట్రంలో హింస, దాడులు, కేసులతో అగ్గి రాజేశారు. అంతటా అశాంతి. ప్రతి ఒక్కరిలో కోపం, ఆవేశం ఉన్నాయి. అదే అగ్గితో టీడీపీ-జనసేన తమ్ముళ్లు వైసీపీని తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి వాయువు కూడా తోడైంది. పవన్ కల్యాణ్ వాయువు. అగ్గికి వాయువు తోడైతే వైఎస్సార్ కాంగ్రెస్ బుగ్గి అవుతుంది. మా ఇద్దరి కలయిక రాష్ట్ర భవిష్యత్ కోసం.

ప్రజల్లో ఉండేవారినే అభ్యర్థులుగా పెట్టాం
మేం 99 శాతం సీట్లు ప్రకటించాం. మిగిలిన సీట్లు కూడా ప్రకటిస్తాం. మీ ఆశీర్వాదం కోసం మొదటి మీటింగ్ తాడేపల్లిగూడెంలో పెట్టాం. ఇది చూసిన తర్వాత గెలుపును ఎవ్వడూ ఆపలేడు. గెలుపు మనదే. బాధ్యతగా అభ్యర్థుల ఎంపిక చేస్తున్నాం. కోటి 30 లక్షల మందిని ప్రజాభిప్రాయ సేకరణ చేశాం. ప్రజల్లో ఉండేవారిని అభ్యర్థులుగా పెట్టడానికి ముందుకు వెళ్తున్నాం. వీరిని చూసిన తర్వాత జగన్ లో భయం మొదలైంది. దీంతో అభ్యర్థులను మారుస్తానంటున్నాడు.

మన అభ్యర్థులు విద్యావంతులు, పేరున్నవారు. జగన్ అభ్యర్థులు స్మగర్లు, రౌడీలు. వీరి గెలిస్తే రక్షణ ఉండదు. బూతులు, మాఫియా నేతలు కావాలా, ప్రజలకు సేవ చేసే మంచి వ్యక్తులు కావాలా? రాష్ట్రాన్ని పునర్ నిర్మించాలనే సంకల్పం ఉంది. కావాల్సింది మీ మద్దతు. జగన్ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో స్కెచ్ ఉంది. ఎలా అభివృద్ధి చేయాలో మా వద్ద బ్లూ ప్రింట్ ఉంది. బాదుడు లేకుండా సంక్షేమం చేస్తాం. కోతలు లేకుండా పథకాలు ఇస్తాం. పెట్టుబడులు తీసుకువచ్చి సంపద సృష్టిస్తాం. నీళ్లు ఇచ్చి రైతుల్ని బతికిస్తాం, యువతకు ఉద్యోగాలు ఇస్తాం.

త్వరలోనే టీడీపీ-జనసేన ఎన్నికల మేనిఫెస్టో
జగన్ తాను దోచుకున్న డబ్బులతో మీ వద్దకు వస్తాడు. మేం సంపద ద్వారా వచ్చే ఆదాయాన్ని పేదవాళ్లకే ఇస్తాం.అందుకే సూపర్-6 తీసుకువచ్చాం. రేపో, ఎల్లుండో మళ్లీ అన్నివర్గాలకు న్యాయం చేసేవిధంగా బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్ ఇస్తాం. ఎస్టీ ల కోసం ఆలోచిస్తాం, మైనార్టీల కోసం చేస్తాం, మహిళల కోసం ఆలోచిస్తాం, రైతుల కోసం ఆలోచిస్తాం, కడకు ఉద్యోగులకు కూడా న్యాయం చేస్తాం. త్వరలోనే టీడీపీ-జనసేన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తాం.

పవిత్రమైన సభ ద్వారా నేను చెబుతున్నా.. మనం ఐక్యంగా ఉండకుండా, ఈ రాష్ట్రం బాగుకాకుండా చూడటానికి అనేక కుట్రలు చేస్తారు. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే మనం నష్టపోతాం. అందరికీ సీట్లు ఇవ్వలేకపోవచ్చు. మేం ఒకటే హామీ ఇస్తున్నాం.. పనిచేసిన ప్రతి కార్యకర్త, నాయకుడికి న్యాయం చేసే బాధ్యత రెండు పార్టీలు తీసుకుంటాం.

టీడీపీ-జనసేన పొత్తు సూపర్ హిట్
నేతలు ఈగోకు పోవద్దు. ఎవరూ ఎక్కువా, తక్కువా కారు. ఎవరి వెనుకా ఎవరూ నడవడం లేదు. రెండు పార్టీలు కలిసి ప్రజల కోసం అడుగులు వేస్తున్నాం. పార్టీల నిర్ణయాలను, ఆదేశాలను అర్థం చేసుకున్న తెలుగుదేశం, జనసేన నాయకులకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. రాష్ట్రానికి న్యాయం చేయాలనే సంకల్పంతో మేం ఇద్దరం మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టాం.

ప్రజల జీవితాలను ఛిద్రం చేసిన ఫ్యాన్ ను.. టీడీపీ-జనసేన కొట్టే దెబ్బకు ముక్కలు ముక్కలు అయిపోవాలి. కలిసి పనిచేయండి.. కసితో పనిచేయండి, కష్టపడి పనిచేయండి. అలాంటి కార్యకర్తలకు న్యాయం చేస్తాం. పొత్తు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, ప్రజల బతుకులు వెలగాలి. టీడీపీ-జనసేన పొత్తు సూపర్ హిట్. ఆంధ్రప్రదేశ్ ఇక అన్ స్టాపబుల్. తెలుగుదేశం-జనసేన ఐక్యత వర్థిల్లాలి. ఎన్నికలయ్యే వరకు ఎవరూ విశ్రమించవద్దు

LEAVE A RESPONSE