– జనార్థన్ వీడియో ద్వారా వైయస్ఆర్సీపీకి బురద అంటించే యత్నం
– ప్రజల దృష్టిని మళ్ళించేందుకు మిధున్‌రెడ్డి నివాసంలో తనిఖీలు
– సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?
– సూటిగా ప్రశ్నించిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి
నెల్లూరు : నకిలీ మద్యం వ్యవహారంలో సీఎం చంద్రబాబు కుట్రలు వెలుగు చూస్తున్నాయని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్థన్‌రావుతో ఒక వీడియోను కుట్రపూరితంగా తయారు చేయించి, జోగి రమేష్ పేరు చెప్పించడం ద్వారా వైయస్ఆర్సీపీకి ఆ బురదను అంటించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో కీలకమైన నిందితుడు, టీడీపీ నేత జయచంద్రారెడ్డిని ఏపీకి తీసుకురావడంలో ఎందుకు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది, సీబీఐ విచారణకు ఎందుకు చంద్రబాబు భయపడుతున్నారని నిలదీశారు. ఇంకా ఆయనేమన్నారంటే..
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే చంద్రబాబు ఒక పథకం ప్రకారం కుట్రలకు పాల్పడుతున్నారు. నకిలీ మద్యం విషయంలో చంద్రబాబు నీచమైన డ్రామాలకు పాల్పడుతున్నారనే దానిని ప్రజలు గమనిస్తున్నారు. నకిలీ మద్యం తయారీ ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దీనికి కారకులైన తన పార్టీ వారిని కాపాడుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందే తప్ప, దీని మూలాలను దర్యాప్తు చేసి, దానిపై చర్యలు తీసుకునేందుకు సిద్దంగా లేదు. ప్రజల దృష్టిని మళ్ళించేందుకు నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పేరును తెరమీదికి తీసుకువచ్చారు. చంద్రబాబు ఇంటిపైన దాడి చేశారంటూ గతంలోనే జోగి రమేష్‌పై ఆయనకు అక్కసు ఉంది. ఎవరైతే గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారో, నేడు కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై గళం ఎత్తుతున్నారో వారిపైన దాడులు చేయించాలి, పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టాలనే లక్ష్యంతోనే చంద్రబాబు పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం ప్రారంభించింది.