Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర రాజకీయాన్ని కుదిపేసిన చంద్రబాబు పులివెందుల పర్యటన

– జన ప్రభంజనం సంకేతంపై అన్ని పార్టీల్లో విస్తృత చర్చలు
• కలవరపాటులో జగన్ రెడ్డి శిబిరం
• కనీసం పులివెందుల అయినా దక్కుతుందా అని ఆందోళన
• వైనాట్ 175 నినాదం గాలిలో కలిసిపోయిందంటున్న వైసీపీ నేతలు
• సంభ్రమాశ్చర్యాలలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు
• పులివెందులలో కూడా గెలవాలని పట్టుదల
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

 

బుధవారంనాడు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కడప జిల్లా పులివెందుల పర్యటన రాష్ట్ర రాజకీయాలను ఒక ఊపు ఊపింది. నేల ఈనిందా అన్నట్లు.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో ప్రజలు రోడ్లపైకి వచ్చి చంద్రబాబుకు పూలమాలలు, హర్షాతిరేకాలతో తమ మద్దతు తెలిపి సృష్టించిన ప్రభంజనం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నింటిని షేక్ చేసింది.

పులివెందులలో చంద్రబాబుకు వచ్చిన స్పందన ఎవరు ఊహించలేనిదని, ఈ ప్రజా ప్రభంజనం రాష్ట్రంలో జరగనున్న రాజకీయ పరిణామాలకు ముందస్తు సంకేతం. జగన్ రెడ్డి సొంత గడ్డపైనే చంద్రబాబు సృష్టించిన ప్రజా ప్రభంజనానికి కారణాలను తెలుసుకోవటం అవసరం. దశాబ్దాలుగా మౌనంగా ఉండిన పులివెందుల ప్రజలు, మూగబోయిన వారి గొంతుకలు ఒక్కసారిగా సంకెళ్లు తెంచుకుని చంద్రబాబుకు మద్దతుగా బయటికి రావటం సామాన్య విషయం కాదు. విప్లవ సమానమైన ఈ పరిణామాన్ని సరిగా అర్థం చేసుకోవాలి.

తరతరాలుగా అణచివేతకు గురైనవారు ఒక్కసారిగా తిరగబడాలనుకుంటే దానికి అనువైన వాతావరణం, అణచివేత నుంచి తమను విముక్తి కల్పించగలడన్న బలమైన నాయకుడు ఉండాలని చరిత్ర పాఠాలు చెబుతున్నాయి. అటువంటి తరుణం, అట్టి నాయకుడు కనిపించడంతోటే పులివెందుల ప్రజలు సంకెళ్లను తెంచుకుని బుధవారంనాడు చంద్రబాబు పర్యటన సందర్భంగా బయటికొచ్చారు.

పులివెందుల చరిత్ర 60 సంవత్సరాల క్రితం హింసాత్మక రీతిలో వైఎస్ రాజారెడ్డి తెరపైకి వచ్చినప్పటినుంచి పులివెందుల ప్రాంతం అరాచకాలకు, అక్రమాలకు, అణచివేతలకు అడ్డాగా మారింది. ఆయన పెత్తందారీ, అహంకార ధోరణులను ప్రశ్నించినవారు అడ్రస్ లేకుండా పోయారు. దేశ వ్యాప్తంగా అంబేద్కర్ రచిత రాజ్యంగం ఆధారంగా పాలన సాగుతుంటే.. పులివెందులలో మాత్రం రాజారెడ్డి చెప్పిందే వేదం. ఆయన మాటే రాజ్యాంగం.

అప్పటి నుంచి పులివెందుల నియోజకవర్గంలో ఎక్కువ శాతం ప్రజలు ఓట్లు వేయటమే మరచిపోయారు. ఎందుకంటే వారిని బూత్ ల వద్దకు కనీసం రానివ్వరు. ప్రశ్నించే గొంతులు మూగబోయాయి. ఎందుకంటే అట్టివారు దారుణంగా అణచివేయబడ్డారు. వేలాదిమంది తమ ఆస్తులు కోల్పోయి నిరాశ్రయులయ్యారు.

ఎందుకంటే.. రాజారెడ్డి కుటుంబ సభ్యుల కన్ను పడిందంటే ఎంతటివారైనా బికారులవ్వాల్సిందే. క్లుప్తంగా.. భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి ప్రసాదించిన స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు పులివెందులలో మచ్చుకకైనా కానరావు. మన దేశ చరిత్రలో మధ్యయుగ కాలం నాటి దారుణ పరిస్థితుల కంటే పులివెందులలో హీనమైన వాతావరణం.

రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలకు, గొడవలకు మారుపేరు. పులివెందులను వీటికి తలమానికంగా తీర్చిదిద్దారు వైఎస్ రాజారెడ్డి, ఆయన వారసులు.

స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు రాయలసీమలో శాంతి సామరస్యాల స్థాపనకు విశేషమైన కృషి చేసి చాలావరకు లక్ష్యాన్ని సాధించారు. ఈ ప్రయత్నాలు పులివెందులలో పలు కారణాల వలన పూర్తిగా విజయవంతం కాకపోవడంతో అక్కడి ప్రజలు అణచివేతలు, అంధకారంలో ఇప్పటికి మగ్గుతూ వచ్చారు.

జగన రెడ్డి తీరు వైఎస్ రాజారెడ్డి రెండవ తరం వారసుడు జగన్ రెడ్డి ప్రజాస్వామ్య ప్రక్రియలో ముఖ్యమంత్రగా అధికారం చేపట్టినా ఆయన మానసికత మాత్రం పెత్తందారీ వ్యవహారమే. తాత వేసిన అప్రజాస్వామిక పునాదులను మార్చటానికి కించిత్తు ప్రయత్నం కూడా చేయకుండా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. తమ నియంతృత్వ, నిరంకుశత్వ, పెత్తందారీ పోకడలతో కడప లోక్ సభ, పులివెందుల శాసనసభ నియోజకవర్గాలను తన కుటుంబ ఆస్తిగా పరిగణిస్తూ ప్రజలపై దాష్టికం కొనసాగించారు.

2019 ఎన్నికలప్పుడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ జగన్ రెడ్డి మరీ మరీ ప్రాథేయపడితే.. పోనీలే కుర్రవాడు అడుగుతున్నాడని కొంతశాతం ప్రజలు సానుకూలంగా స్పందిస్తే ముఖ్యమంత్రి పదవి చేపట్టి, గత నాలుగేళ్లకు పైగా రాష్ట్రంలో విధ్వంస రచన చేశాడు. దాని ఫలితంగా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు తీవ్రంగా నష్టపోయారు. అలవిగాని అప్పులు చేస్తూ.. అవన్నీ పేదవారికోసమే చేస్తున్నామని అబద్ధాలాడుతూ తన అవినీతి దందాను అప్రతిహతంగా కొనసాగిస్తున్నాడు జగన్ రెడ్డి.

సరైన అవగాహన లేని జగన్ రెడ్డి పాలనలో సంక్షేమమంతా సంక్షోభంలో పడిపోయి, పేదలు కూడా జగన్ దోపిడికి సాధకాలుగా మారి, పేదలు మరియు పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన ఆర్థిక ప్రగతి కుంటుపడి, రాష్ట్రం అప్పుల కుప్పగా మారి, అణచివేతలు రాష్ట్రమంతా విస్తరించి ప్రజల భవిత అంధకారంలో పడిపోయింది.

మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్న జగన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ప్రజలు అమరావతే రాజధాని అంటూ నినదించటం జగన్ తీరు పట్ల ప్రజల నిరసనకు సాక్షాత్కారం.
జగన్ పై పులివెందుల ప్రజల తిరుగుబాటు తన నిర్వాకాలతో రాష్ట్ర ప్రజలతోపాటు పులివెందుల ప్రజల వర్తమానం, భవిష్యత్తులను విద్వంసం చేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా పేరుకున్న తీవ్ర నిరసనకు ప్రతీకగా పులివెందుల ప్రజలు చంద్రబాబు పర్యటన సందర్భంగా ప్రభంజనం సృష్టించి తిరుగుబాటు జెండాను ఎగురవేశారు. ఈ తిరుగుబాటుతో దశాబ్దాలపాటు తాము గురౌతూ వచ్చిన అణచివేత నుంచి విముక్తి పొందాలనేది వారి మనోవాంఛ. జగన్ రెడ్డిని అధికారం నుంచి తప్పిస్తేకానీ రాష్ట్రం, పులివెందుల బాగుపడవనే నమ్మకంతో వారు రోడ్లెక్కారు.
నవ్యాంధ్రను వినాశనానికి జగన్ రెడ్డి చేరువ చేస్తే దీనిని పునర్ నిర్మించగలిగిన సత్తా, తమకు స్వేచ్ఛ, స్వాంతంత్ర్యాలు కలిగించగలిగే దమ్ము కేవలం చంద్రబాబుకే ఉన్నదన్న నమ్మకంతో వారు మొదటిసారిగా రాజారెడ్డి వారసులపై ధ్వజమెత్తారు.

పులివెందుల ప్రభంజనంతో జగన్ శిబిరం తీవ్ర కలవరానికి గురైంది. వైనాట్ 175 అన్నవారు ఇప్పుడు పులివెందులలో గెలుపుపై అనుమానంలో పడ్డారు. ముందెన్నడూ పులివెందులలో చూడని ఈ ప్రజా చైతన్యాన్ని చూసి తెదేపా నాయకులు, కార్యకర్తలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. పులివెందుల కోటను కూడా బద్దలు కొడతామన్న ధైర్యం వారిలో ఉరకలేస్తోంది.

పులివెందుల ప్రజలే తిరుగుబాటు చేస్తే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలు వెనుకబడతారా? జగన్ రెడ్డి సొంత నియోజకవర్గ ప్రజలు చూపిన ధైర్యం, తెగువ, బాధ్యతాయుతమైన స్పూర్తితో నవ్యాంధ్ర ప్రజలు రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక, దోపడీ, విధ్వంసక పాలన నుంచి విముక్తి కొరకు రానున్న ఎన్నికల మహాయజ్ఞంలో తమవంతు పాత్ర పోషిస్తారని పులివెందుల సాక్షిగా బుధవారం వెల్లడైంది.

 

LEAVE A RESPONSE